Business

అమ్మకానికి జాక్సన్ ఎస్టేట్-వాణిజ్యం

Business News - Neverland Ranch Up For Sale Again

* కొవిడ్‌ మహమ్మారి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఫైజర్‌, మోడెర్నా సంస్థలు తయారుచేసిన టీకాల పంపిణీ జరుగుతోంది. కాగా.. వ్యాక్సిన్ల కొనుగోలులో ధనిక దేశాలు గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్న వేళ.. పేద, మధ్యాదాయ దేశాలు చైనాపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చైనా నుంచి తక్కువ ధరకు వచ్చే టీకాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఆ టీకాలు పనిచేస్తాయా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. చైనా వ్యాక్సిన్లు పనిచేయవు అని చెప్పేందుకు ఎలాంటి స్పష్టమైన కారణాలు లేనప్పటికీ.. ఆ దేశానికి టీకా కుంభకోణాల చరిత్ర ఉంది. అంతేగాక, టీకా తుది ప్రయోగాలపై చైనా తయారీ సంస్థలు బాహ్య ప్రపంచానికి లోతైన వివరాలు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

* బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో కొనుగోలు చేసింది. ఐఎంజీ వరల్డ్‌వైడ్‌ ఎల్‌ఎల్‌సీతో కలిసి నిర్వహిస్తున్న సోర్ట్స్ ‌మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ వెంచర్‌ ‘ఐఎంజీ-ఆర్‌’ను సొంతం చేసుకొంది. ఐఎంజీ వరల్డ్‌వైడ్‌కు చెందిన 50శాతం వాటాలను రిలయన్స్‌ రూ.52.08 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని రిలయన్స్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి అందజేసిన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరిగింది. డీల్‌ పూర్తికాగానే రిలయన్స్‌ ఐంఎంజీ ఆర్‌ను రీబ్రాండింగ్‌ చేయనుంది.

* జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఎస్‌పీ 125 బైక్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో వినియోగదారులకు రూ.5వేల వరకు లబ్ధి చేకూరనుంది. హోండాతో ఒప్పందం చేసుకున్న బ్యాంకుల నుంచి ఫైనాన్స్‌ తీసుకున్న వినియోగదారలకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, స్టాండర్డ్‌ ఛార్టర్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ వీటిల్లో ఉన్నాయి.

* దివంగత పాప్‌ గాయకుడు మైఖెల్‌ జాక్సన్‌కు చెందిన ‘ది నెవర్‌ల్యాండ్‌ ఎస్టేట్’‌ను విక్రయించేశారు. జాక్సన్‌ మాజీ స్నేహితుడు రోన్‌ బుర్కిలీ లాస్‌ ఓలివోస్‌లోని ఈ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. దీని కోసం ఆయన 22 మిలియన్‌ డాలర్లను చెల్లించారు. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక వెల్లడించింది. 2,700 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్‌ విలువను 2015లో 100మిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఆ తర్వాత కూడా పలు మార్కెట్లలో విక్రయానికి ప్రయత్నించి విలువ లెక్కించారు. గతేడాది దీని విలువ 31 మిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. వాస్తవానికి జాక్సన్‌ దీనిని 1987లో 19.5 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. పీటర్స్‌ పాన్‌ స్టోరీలోని ఊహాత్మక ద్వీపం గుర్తుకువచ్చేలా నెవర్‌ల్యాండ్ అని పేరుపెట్టారు.

* జనవరి 1, 2021 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు (ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మినహా) ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ పరికరం “ఫాస్ట్ ట్యాగ్” తప్పనిసరి అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం స్పష్టం చేశారు. ఫాస్ట్ ట్యాగ్‌ను ఉపయోగించడం ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చునని, అలాగే నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని గడ్కరీ తెలిపారు.