తిరుమలలో దీపావళి ఆస్థానం-ఆధ్యాత్మిక వార్తలు

1. 7న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 7న దీపావళి ఆస్థానం జరగనుంది. 9న శ్రీ తిరుమల నంబి శాత్తుమొర, 12న శ్రీసేనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం, 14న శ్రీవారికి పుష్పయోగ మహోత్సవం, శ్రీతిరుమంగై ఆళ్వార్ ఉత్సవం ఆరంభం, 15న శ్రీపూదత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 20న కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీచక్రతీర్థ ముక్కోటి, 23న శ్రీతిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర, 24న శ్రీతిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం తదితర పూజాధికాలు ఉంటాయని తితిదే తెలిపింది.
2.పోస్టల్లో పద్మావతి అమ్మవారి ఆశీర్వచనం
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి తపాలాశాఖ ద్వారా హుండీ కానుకలు పంపే భక్తులకు ఇకపై రశీదుతో పాటు అమ్మవారి కుంకుమ, పవిత్ర పసుపుదారం, అమ్మవారి చిత్రపటం, అక్షితలు ఆశీర్వచనగా అందనున్నాయి. తపాలాశాఖ ‘ఆశీర్వచనం’ పేరుతో 2008 నుంచి తిరుమల శ్రీవారికి తపాలాశాఖ ద్వారా కానుకలు పంపే భక్తులకు రశీదుతో పాటు స్వామివారి అక్షితలు, చిత్రపటాన్ని తిరిగి పంపిస్తోంది. దీంతో భక్తులు తమ కానుకలు స్వామివారికి చేరాయన్న నమ్మకంతో పాటు అరుదైన అక్షితలను స్వీకరించామన్న అనుభూతి చెందుతున్నారు. ‘ఈవో, తితిదే, తిరుపతి, 517 503’ చిరునామాకు కానుకలు పంపాల్సిందిగా అధికారులు సూచించారు.
3.టీటీడీకి రిలయన్స్ రూ.1,11,11,111 వితరణ
ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటీ 11 లక్షల 11 వేల 111 రూపాయల విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవోలు పి.మధుసూదనప్రసాద్, పీవీఎల్ మాధవరావు ఈ విరాళానికి సంబంధించిన చెక్కును సోమవారం ఉదయం శ్రీవారి దర్శనానంతరం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్కు అప్పగించారు. అవసరం ఉన్న పథకానికి దాన్ని ఉపయోగించుకోవాలని దాతలు టీటీడీ అధికారులకు సూచించారు. దాతలకు వేదాశీర్వచనం పలికి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటాన్ని బహూకరించారు.
4. నిత్యాన్న ప్రసాదాలు
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను నిజం చేసి చూపిస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందచేస్తూ ఆకలి తీరుస్తోంది. ముప్పైమూడేళ్ల కిందట ప్రతి నిత్యం కొద్ది మంది భక్తులకు కడుపునింపే ఆశయంతో రూ. 5 లక్షల మూలధనంతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకుని ప్రతిరోజూ లక్షల మందికి కడుపు నింపుతోంది.నిత్యం భక్తులు హుండీలో వేసే కానుకలే కాకుండా టీటీడీ చేపట్టిన వివిధ ట్రస్టులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. ఇలా అన్నప్రసాద çపథకం, ఆరోగ్య వరప్రసాదం, ప్రాణదాన పథకం, గో సంరక్షణ పథకం, వేద పరిరక్షణ పథకం, బాలమందిరం ట్రస్టు, స్విమ్స్ వంటి పలు పథకాలను అంచెలంచెలుగా ప్రారంభించింది టీటీడీ. వీటిలో అన్నప్రసాదం ట్రస్టుకు అత్యంత ప్రా«ధాన్యత ఉంది. మొదట్లో తిరుమలలోని స్ధానిక మఠాలు భక్తుల ఆకలిని తీరుస్తూ ఉండేవి. అయితే క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా ఎక్కువ మంది ఆహారాన్ని కొని తినాల్సి వచ్చేది. దీంతో సామాన్య భక్తుల ఇబ్బందిని పరిగణనలోకి తీసుకున్న టీడీడీ నిర్ణయం ప్రకారం 1985 ఏప్రిల్ 6న నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన రూ. 5 లక్షల విరాళంతో ప్రారంభమైన ఈ పథకానికి మొదటి ఏడాదే రూ. 60 లక్షలకు పైగా విరాళాలు అందాయి. ఆ తర్వాత అన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు మరింతగా ఊపందుకున్నాయి. ఏడాదికేడాదీ ప్రవాహంలా అన్నదాన ట్రస్టుకు భక్తులు విరాళాలు అందిస్తూండటంతో ప్రస్తుతం అన్నదానం ట్రస్టు డిపాజిట్లు వెయ్యి కోట్ల మార్కును దాటాయి. బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న ఈ నగదు నుంచి వచ్చే వడ్డీతో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గతంలో అన్నదాన ట్రస్టు పేరులో దానం అనే పదాన్ని అన్నప్రసాద పథకంగా మార్చింది టీటీడీ. భక్తులు ఇస్తున్న కానుకలు ఏటా పెరుగుతూ ఉండటంతో ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అన్నప్రసాద ట్రస్టుకు భక్తులు ఇచ్చిన విరాళాల మొత్తం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. మొదట్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయంలోనే టోకెన్లు అందజేసి అన్నప్రసాద సౌకర్యం కల్పించిన టీటీడీ 2007 సంవత్సరం నుంచి టోకెన్లతో నిమిత్తం లేకుండా ఎవరికైనా భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం తిరుమలలోని ప్రధాన అన్నదాన కేంద్రంలో ప్రతిరోజూ దాదాపు లక్షమందికి, ఇతర చోట్ల పది నుంచి పదిహేను వేలమంది వరకు భక్తులకు అన్నప్రసాదం లభిస్తోంది.నానాటికీ పెరుగుతున్న భక్తులకు గతంలో ఉన్న పాత అన్నదాన భవనం చాలక పోవడంతో టీటీడీ ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద ప్రాంగణాన్ని రూ.25 కోట్ల ఖర్చుతో నిర్మించింది. నాలుగువేల మంది భక్తులు ఏకకాలంలో భోజనం చేసేలా, నిత్యం లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించేలా నిర్మించిన ఈ నూతన భవనాన్ని 2011లో ప్రారంభించారు. ఇందులో అత్యాధునిక భారీ ఆవిరి యంత్రాల ద్వారా ఆహారాన్ని తయారు చేసి వేలాది మందికి సకాలంలో ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు. టీటీడీ సిబ్బందితో పాటూ శ్రీవారి సేవకులూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మానవసేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ప్రధాన అన్నప్రసాద కేంద్రంలోనే కాకుండా తిరుమలలోని పలు ప్రదేశాల్లోనూ టీటీడీ భక్తులకు ఆహారాన్ని అందచేస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, యాత్రికుల వసతి సముదాయాలలో కూడా అన్నప్రసాదాన్ని అందచేస్తోంది. మూడేళ్ల కిందట తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో కూడా అన్నప్రసాదం పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తిరుపతిలోని వసతిగృహ సముదాయాలకు అన్నప్రసాదం పథకాన్ని విస్తరించింది. తిరుమలతో పాటు పలుచోట్ల మొబైల్ çఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా ఆహార వితరణ ప్రారంభించింది. తిరుమలలోని రద్దీ ప్రదేశాల్లోను, కాలినడక మార్గాల్లోను భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తోంది.ఇటీవలి కాలంలో అన్నదాన పథకంలో కొన్ని కొత్త డొనేషన్ స్కీములను టీటీడీ ప్రవేశ పెట్టింది. వీటిలో భాగంగా రూ.6 లక్షలు విరాళం ఇస్తే ఆ దాత పేరుతో ఒకపూట అల్పాహారాన్ని భక్తులకు అందజేస్తారు.రూ.10 లక్షలు విరాళం ఇస్తే దాత పేరిట ఒకపూట అన్నప్రసాద వితరణను నిర్వహిస్తారు. రూ. 25 లక్షలు విరాళం ఇచ్చే దాత పేరిట ఒక రోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఇలా టీటీడీ అన్నదాన ట్రస్టులోని స్కీములకు దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొందరు భక్తులు టీటీడీకి నిత్యం దాదాపు ఏడు టన్నుల కూరగాయలను ఉచితంగా పంపుతూ కొంతవరకు భారాన్ని తగ్గిస్తున్నారు. మిగిలిన అదనపు వ్యయాన్ని టీటీడీ హుండీ ఆదాయం ద్వారా వచ్చే నిధుల నుంచి భర్తీ చేస్తోంది.
5. బదరీ నారాయణుడు
మహాభారత ఇతిహాసంలో…. భారతీయ నాగరికతలో హిందువుల పూజలలోను పాలు పంచుకుంటున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒకటి. భగవంతుడికి నివేదించే అతికొద్ది పండ్లలో రేగుపండు ఒకటి. రేగు పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. పిల్లలకు పోసే భోగిపండ్లు రేగి పండ్లే. సూర్యభగవానుడికి రేగు పండ్లంటే ఇష్టమట. రథసప్తమినాడు చిక్కుడు ఆకులతోపాటు రేగు ఆకులను కూడా తలమీద పెట్టుకుని స్నానం చేస్తారు. వినాయకుని పూజలోనూ రేగు ఆకులను సమర్పిస్తారు. బదరీనాథ్లో ఉన్న స్వామివారికి రేగుపండ్లంటే అమిత ఇష్టమట. అందుకే ఆయనకు బదరీనారాయణుడనే పేరు వచ్చింది. అలాగే వ్యాసుడికి బాదరాయణుడనే పేరు బదరీ ద్వీపంలో పుట్టినందువల్లే వచ్చింది.తంత్ర శాస్త్ర గ్రంథాలలో కూడా బదరీవృక్షం ప్రసక్తి ఉంది. ఈ చెట్టు పండులోనే గాదు, ఆకులలోను బెరడులోను, చివరకు గింజల్లోకూడ ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు కనిపెట్టారు. నిజానికి దీనిని వైద్యంలో వినియోగించే పద్ధతి భారత దేశంలో ఈ నాటిది కాదు. పూర్వం నుండే వాడుకలో ఉంది. మందమతులుగా ఉన్న పిల్లలచేత రోజూ కాసిన్ని రేగుపండ్లు తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుందట. అలాగే, దీని ఆకు పసరును పుండ్లు, వ్రణాలు వంటి వాటికి పై పూతగా వాడితే త్వరగా తగ్గిపోతాయట. కొన్ని దేశాలలో వీటి లేత ఆకులను కూరగా వండుకొని తింటారు. రేగుపండ్లతో పండ్లరసాలు, వడియాలు వంటి కొన్ని వంటకాలు కూడా చేస్తారు.
6. సిద్ధివినాయకుడి సన్నిథిలో అంబానీ ఫ్యామిలీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, ఆనంద్ పిరామల్ వివాహవేడుక డిసెంబర్లో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖేశ్అంబానీ కుటుంబం నిన్న రాత్రి ముంబైలోని సిద్ధివినాయకుడి ఆలయాన్ని సందర్శించింది. ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్ అంబానీ, కొడుకు అనంత్ అంబానీతో కలిసి ఇషా, ఆనంద్ల పెండ్లి పత్రికను ఆలయానికి తీసుకెళ్లారు. గణనాథుని సన్నిథిలో పెండ్లిపత్రికను పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు.
7. శబరిమల వివాదంపై స్పందించిన మంచు మనోజ్‌
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఓ అభిమాని సేవ్‌ శబరిమల క్యాంపెయిన్‌పై ఇప్పటికైనా నోరు విప్పండి అంటూ మనోజ్‌ ను ట్యాగ్‌చేస్తూ ట్వీట్‌ చేశాడు.ఈ ట్వీట్‌పై స్పందించిన మనోజ్‌.. ‘మనం పేదలకు నీరు, ఆహారం, చదువు లాంటి కనీస అవసరాల తీర్చడం పై ముందుగా బాధపడాలి. మనకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆయన, తన సమస్యలను తానే పరిష్కరించుకోగలడని కూడా నమ్మాలి. మానవత్వం కోసం పోరాడండి’ అంటూ కామెంట్ చేశాడు మనోజ్‌.
8. తిరుమల సమాచారం
ఈరోజు బుధవారం *31-10-2018* ఉదయం *5* సమయానికి….
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ …. శ్రీ వారి దర్శనానికి *1* కంపార్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి *6* గంటల సమయం పడుతోంది ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి *02* గంటల సమయం పడుతోంది.. నిన్న అక్టోబర్ *30* న *64,464* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు *20,565* మంది.. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.23* కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com