రేపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల–ఆధ్యాత్మిక వార్తలు

1. రేపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే శుక్రవారం విడుదల చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వామివారి సేవలో పాల్గొనేందుకు వీలుగా వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను www.tirumala.org వెబ్సైట్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తేనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్ విధానంలో ఆన్లైన్లో జారీ చేస్తుంది. విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్ కింద వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఈ సేవా టిక్కెట్లన్నీ కలిపి దాదాపు 50 వేల వరకు విడుదల చేయనుంది. భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాల స్వీకరణ నిమిత్తం ప్రతినెల మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ తితిదే ఈవో కార్యక్రమంలో తిరుమల అన్నమయ్య భవనం నుంచి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొని సమాధానాలిస్తారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య భక్తులు ఫోన్ నెంబర్ 0877- 2263261 ద్వారా ఈవోతో మాట్లాడవచ్చు.
2. వైద్యో నారాయణో ధన్వంతరిః -నవంబరు 5 ధన్వంతరి జయంతి
మంచి వైద్యుడిని ధన్వంతరితో పోల్చుతాం.. యుగయుగాలుగా మన వైద్యశాస్త్రానికి మూల పురుషుడిగా పిలుచుకునే ఆయన ఎవరు?
తరతరాలుగా సంపూర్ణ ఆరోగ్యానికి సరిపోలిన అర్థం ధన్వంతరి. ఆ పేరులోనే శారీరక, మానసిక ఆరోగ్యాలు ఇమిడి ఉన్నాయి. పురాణకాలం నుంచి నేటి దాకా వైద్యానికి అధిదేవతగా ధన్వంతరిని ప్రస్తావిస్తూ ఉంటారు. పురాణాలలో సాక్షాత్తు దైవస్వరూపుడుగా పేర్కొన్న ఈ స్వామి మానవాళి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన వాటన్నిటినీ సమకూరుస్తాడన్న నమ్మకం ప్రబలంగా ఉంది.ధన్వంతరి అనే పదానికి సంబంధించిన అర్థాన్ని పరిశీలిస్తే.. ఆ స్వామి ఆవిర్భావ లక్ష్యం స్పష్టమవుతుంది. ‘‘ధనుః శల్యం తస్య అంతం పారం ఇయర్తి గచ్ఛతీతి ధన్వంతరిః’’ అని పండితులు పేర్కొన్నారు. అంటే ధనుస్సు నుంచి వెలువడిన బాణపు ములుకుల్లాంటి శారీరక, మానసిక దోషాలు, రోగాలు, బాధలను నివారించేవాడని అర్థం. శరీరానికి తగిలే తీవ్రమైన గాయాలు, అనేక కారణాల వల్ల పుట్టుకొచ్చే వ్రణాలు, అలాగే మానసిక వ్యాధులన్నింటినీ తగ్గించేవాడని అర్థం. దీనిని అనుసరించి పూర్వకాలం నుంచి చికిత్సలు, శస్త్రచికిత్సలలో ఆరితేరిన వారిని ధాన్వంతరీయులు అని పిలుస్తూ గౌరవించడం కనిపిస్తుంది.
**ఎలా ఉంటాడు?
ధన్వంతరి సాక్షాత్తు దైవమే. శ్రీమహావిష్ణువు స్వరూపుడే. ఆ స్వామి ధర్మరక్షణ కోసం అవసరమైనప్పుడల్లా ప్రతి యుగంలో జన్మించినట్టే.. ధన్వంతరి కూడా మానవాళికి వైద్యాన్ని అందించేందుకు పలుజన్మలను ఎత్తినట్టు పురాణ కథలు పేర్కొంటున్నాయి. ధన్వంతరి స్వరూప వర్ణన కూడా పలు రకాలుగా కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం బాలకాండలో ధన్వంతరి ఆవిర్భావ ప్రస్తావన ఉంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఒక చేత కమండలం, మరోచేత దండాన్ని ధరించి ధన్వంతరి ఆవిర్భించినట్టు తెలుస్తోంది. భాగవతంలో.. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృతభాండాన్ని చేతపట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ జన్మఖండంలో సూర్యభగవానుడి దగ్గర ధన్వంతరి ఆయుర్వేదాన్ని నేర్చుకున్నట్టు, సూర్యుడికి ఉన్న పదహారు మంది శిష్యుల్లో ఈయన కూడా ఒకరని ప్రస్తావించారు,. విష్ణుధర్మోత్తర పురాణంలో ఒకచేత అమృత కలశం, మరోచేత వనమూలికలను పట్టుకొని ఉన్న ధన్వంతరి వర్ణన ఉంది. మరికొన్ని చోట్ల శ్రీమహావిష్ణువులా నాలుగు చేతులు, పీతాంబరాలు ధరించి పైరెండు చేతుల్లో శంఖచక్రాలు, కింది రెండు చేతుల్లో జలగ, అమృత కలశాన్ని పట్టుకొని ఉన్నట్టుగా పేర్కొన్నారు. జలగను పట్టుకోవడం శస్త్రచికిత్సకు సంబంధమైన సూచన అని పండితుల వివరణ.
**హరివంశ కథ
హరివంశ పురాణం 29వ అధ్యాయంలోని కథ ప్రకారం క్షీరసాగర మథనమప్పుడు సాగర గర్భం నుంచి ఒక దివ్యపురుషుడు పుట్టుకొచ్చాడు. చక్కటి రూపం, శంఖంలాంటి కంఠం, పద్మాల్లాంటి కళ్లు, సుతిమెత్తని సుందర కేశజాలంతో దృఢమైన నల్లని శరీరంతో పీతాంబరాలను ధరించి, మణికుండలాలు, పుష్పమాలలు అలంకరించుకొని, చేతిలో అమృతకలశంతో ఆవిర్భవించాడు. బ్రహ్మాది దేవతలు ఆయనకు ధన్వంతరి అని పేరు పెట్టారు. నీటిలో నుంచి పుట్టినవాడు కాబట్టి అబ్జ అనే పేరును శ్రీమహావిష్ణువు ఆయనకు పెట్టారు. మరో జన్మలో తల్లి గర్బంలో పుట్టి యజ్ఞభాగాన్ని స్వీకరించేలా అనుగ్రహించారు. మహావిష్ణువు చెప్పినట్టే ద్వాపరయుగంలో కాశీరాజు సుహోత్రుడికి పుత్రుడుగా జన్మించిన ధన్వంతరి. ఆయుర్వేదశాస్త్రాన్ని అష్టాంగాలతో రచించాడు. కాయచికిత్స, కౌమారభృత్య (బాల చికిత్స), భూతవైద్యం (గ్రహ చికిత్స), శలాక్యతంత్ర, శల్యతంత్ర (శస్త్ర చికిత్స), విషతంత్ర, రసాయన తంత్ర, వశీకరణ తంత్ర అనే అష్టాంగాలతో ఆయుర్వేద శాస్త్రాన్ని ధన్వంతరి మానవాళికి అందించాడు. అలాగే మహాభాగవతం నవమ స్కంధంలో పురూరవ వంశ క్రమంలో ధన్వంతరి మూడో తరానికి చెందిన దివోదాసుడుగా కనిపిస్తాడు. ఈయననే దివోదాస ధన్వంతరి అని కూడా పిలుస్తుంటారు.
3. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.84కోట్ల ఆదాయం వచ్చింది.
4. భగినీహస్త భోజనమంటే..
దీపావళి పండగ తర్వాత రెండు రోజులకు వచ్చే కార్తీక శుద్ధ విదియను యమద్వితీయగా చేసుకుంటారు. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే పండగ. పురాణ కథలను అనుసరించి యముడికి ఒక సోదరి ఉన్నది. ఆమె పేరు యమి. సోదరి మనసులోని కూడని ఆలోచనలను పోగొట్టి యముడు ఆమెకు ధర్మాన్ని తెలియజెప్పిన రోజు ఇదేనని అంటారు. ఆనాడు యముడు తన సోదరి ఇంట భోజనం చేశాడని కథ ప్రచారంలో ఉంది. నాటి నుంచి యమద్వితీయ పండగగా వాడుకలోకి వచ్చింది. ఆనాడు భగినీ (సోదరి)హస్త భోజనం ఒక ఆచారంగా స్థిరపడింది. అన్నదమ్ములు సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకొని.. అక్కడ భోజనం చేసే ఈ ఆచారం సామాజికంగా, కుటుంబపరంగా చాలా ప్రయోజనకరమైనది. తోడబుట్టిన వారి మధ్య అనుబంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత కాలంలో.. సంవత్సరంలో ఒక్కనాడైనా సోదరి యోగక్షేమాలు విచారించాలని ఈ పండగ గుర్తు చేస్తోంది.
5. శుభప్రదం శీఘ్ర ఫల దాయకం
అరటి శుభ సూచకం అని అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వినియోగిస్తారు. దీనివెనుక ఒక ఇతిహాస సంబంధమైన కథ కూడా ఉంది. ఒకప్పుడు దూర్వాస మహాముని సాయంసంధ్యవేళ కూడా ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య (కదలీ) సంధ్యావందనం సమయం కావడంతో ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడి నేత్రాలనుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశిగా మారిపోతుంది. కొన్నిరోజుల తరువాత దుర్వాస మహర్షి మామగారు తన కూతురు గురించి అడగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయిందని చెప్పి, తన మామ గారి ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు, ఆమెను చెట్టుగా మార్చి, శుభప్రదమైన కార్యాలన్నింటిలో కదలీఫలం (సంస్కృత పదానికి తెలుగు అర్థం అరటి) రూపంలో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు. అరటి ఆకులను రకరకాల పనులకు ఉపయోగిస్తారు, ముఖ్యంగా భోజనం చెయ్యడానికీ, పెళ్ళిళ్ళలో మండపాల అలంకరణకు వాడతారు.ఆంజనేయస్వామిని ఆరాధించేవారు అరటితోటలో లేదా అరటిచెట్టు కింద స్వామి వారి విగ్రహాన్నిప్రతిమనుపటాన్ని ఉంచి పూజిస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అరటికి అంటుదోషం, ఎంగిలి దోషం అంటవు. అందుకే అన్ని దేవతల పూజలలోనూ అరటిని నివేదించవచ్చు. కుజదోషం ఉన్నవారు అరటిచెట్టుకు చక్కెర కలిపిన నీరు పోసి, తడిసిన ఆ మట్టిని నొసట బొట్టుగా ధరిస్తే ఉపశమనం కలుగుతుందంటారు. అరటినారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలు కలుగుతాయంటారు. సంతానం లేనివారు అరటిచెట్టును పూజిస్తే మంచిదని చెబుతారు. అరటిని ఆనారోగ్యానికి ఔషధంగా వాడతారు. దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. మానసిక ఒత్తిడితో బాధపడేవారు అరటిపండ్లు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని, అరటిపండు శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుందనీ వైద్యనిపుణులు చెబుతారు. జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com