పుట్టే ప్రతివాడికి పౌరసత్వం ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు

అమెరికా గడ్డపై పుట్టే ప్రతి చిన్నారికీ జన్మతః పౌరసత్వం లభించేలా అమల్లో ఉన్న నిబంధనలను సవరిస్తామంటూ దేశాధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. అమెరికా పౌరసత్వం లేని దంపతుల సంతానానికి జన్మతః అమెరికా పౌరసత్వం దక్కే విధానాన్ని కచ్చితంగా ఏదో ఒక మార్గంలో రద్దు చేస్తానని బుధవారం పునరుద్ఘాటించారు. ఆయన నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీతోపాటు సొంత రిపబ్లికన్‌ పార్టీలోని పలువురు నాయకులు దేశాధ్యక్షుడి వైఖరిపై మండిపడుతున్నారు. అమెరికాలో జన్మించే ప్రతి చిన్నారికీ పౌరసత్వం ఇవ్వాలని రాజ్యాంగంలో నిబంధనలేవీ లేవని ట్రంప్‌ అన్నారు. ‘జన్మతః పౌరసత్వం ఇస్తుండటంతో మనదేశానికి రూ.వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇది మన పౌరులకు ఇబ్బందికరం. ఏదో ఒక మార్గంలో ఈ విధానానికి ముగింపు పలుకుతాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వుతో ఈవిధానాన్ని తాను సవరించగలనని రాజ్యాంగసవరణ తప్పనిసరి కాదన్నారు. జన్మతః పౌరసత్వం ఇచ్చే దేశం అమెరికా మాత్రమేనని ట్రంప్‌ ట్వీట్లలో పేర్కొన్నారు. కెనడా, మెక్సికో వంటి దాదాపు 30 దేశాలూ ఈవిధానాన్నే అనుసరిస్తున్న సంగతి గమనార్హం. ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వుతో ట్రంప్‌ ఏకపక్షంగా పౌరసత్వ హక్కు విధానాన్ని మార్చలేరని అందుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని అక్కడి నేతలు స్పష్టం చేస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ పాల్‌ ర్యాన్‌ స్పందిస్తూ.. ‘ఎగ్జిక్యూటివ్‌ చర్య ద్వారా వలస చట్టాలను మార్చాలని మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రయత్నించారు. దాన్ని మేం వ్యతిరేకించాం. మేం కన్జర్వేటివ్‌లం. మాకు రాజ్యాంగంపై విశ్వాసం ఉంది.’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించకుండా పౌరసత్వ నిబంధనలు మార్చలేమని సెనేట్‌ జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్‌, రిపబ్లికన్‌ సెనేటర్‌ చుక్‌ గ్రాస్లే అభిప్రాయపడ్డారు. హెచ్‌1బీ వీసాల కింద పేర్కొనే ప్రత్యేక ఉద్యోగాల నిర్వచనాన్ని మారుస్తామని ఇప్పటికే అమెరికా ప్రకటించడంతో వేల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారు. తాజాగా ‘పిల్లల హక్కు’నూ ఉపసంహరించుకునే దిశగా ట్రంప్‌ అడుగులు వేయడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌ సహా పలు దేశాలకు చెందిన లక్షల మంది ఏదో ఒక వీసాపై అమెరికాలో నివసిస్తూ అక్కడ పుట్టే తమ సంతానానికయినా ఆదేశ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఉండేవారు. తాజాగా ట్రంప్‌ ప్రకటన అలాంటివారందరిలో గుబులు రేపుతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com