విద్యా సంస్థల అధినేతలు…అధికారం కోసం పాకులాటలు

విద్యాసంస్థల యజమానులు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలల యజమానులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వని ప్రధాన రాజకీయ పార్టీలు లేవంటే అతిశయోక్తి కాదు. అధిక శాతం మంది విద్యాసంస్థలను ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి రాగా…మరికొందరు రాజకీయాల్లో అడుగిడిన తర్వాత వాటిని నెలకొల్పారు. తాజా ఎన్నికల్లోనూ పలువురు ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. విద్యా సంస్థల ద్వారా ఆర్థిక బలం సాధిస్తున్న యజమానులు ఆ తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోతున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే ఖర్చులోనూ వెనుకాడకపోవడం…పార్టీకి విరాళాలు ఇవ్వడం…కళాశాల అధినేతగా గుర్తింపు ఉండటంతో పలువురు విద్యాసంస్థల యజమానులకు ప్రతి ఎన్నికల్లో సీట్లు లభిస్తున్నాయి. ఫలితంగా వారిలో పలువురు ఎమ్మెల్యేలవుతున్నారు. మరి కొందరికి ఎమ్మెల్సీ పదవులు వరిస్తున్నాయి. కొందరు ఆయా విద్యాసంస్థలకు ఛైర్మన్లుగా కూడా ఉన్నారు. మరి కొన్నిటికి తమ కుటుంబ సభ్యులు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో సొంత జిల్లాల్లో కళాశాలలను నెలకొల్పినా ఆ తర్వాత వాటిని హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించారు. మళ్లీ ఎన్నికలు రావడంతో అనేక మంది కళాశాలల యజమానులు టికెట్లను దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, భాజపా పూర్తిగా అభ్యర్థులను ప్రకటిస్తే బరిలో దిగే ‘విద్యా’ నేతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్న మల్లారెడ్డి(తెరాస) మేడ్చల్‌ ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నారు. ఆయన మల్లారెడ్డి గ్రూపు విద్యాసంస్థల యజమాని. కాంగ్రెస్‌ నుంచి మేడ్చల్‌ టికెట్‌ కోరుతున్న మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి కేఎల్‌ఆర్‌ గ్రూపు పేరిట పలు విద్యాసంస్థలున్నాయి. ఖమ్మం స్థానానికి కాంగ్రెస్‌ నుంచి పోట్ల నాగేశ్వర్‌రావు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు కొత్తగూడెం, హైదరాబాద్‌లోనూ ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. తెదేపా నుంచి ఉప్పల్‌ స్థానాన్ని కోరుతున్న వీరేంద్రగౌడ్‌ సైతం నగర శివారులో ఓ పాఠశాల నడుపుతున్నారు. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల యజమాని సురేందర్‌రెడ్డి భాజపా నుంచి మలక్‌పేట సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీలూ ఉన్నారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలలను నడుపుతున్న నల్గొండ జిల్లాకు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీతోపాటు శాసనమండలి విప్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తెరాస పార్టీలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలకు, పాఠశాలలకు అధిపతిగా ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com