అయిదు రోజులూ దీపావళి-ఆధ్యాత్మిక వార్తలు

హిందువుల ప్రధాన పర్వదినాల్లో ఒకటైన దీపావళి అయిదు రోజుల పండుగ. ఈ వేడుకలు ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ప్రారంభమవుతాయి. కార్తిక శుద్ధ విదియతో ముగుస్తాయి. వీటిలో ఒక్కో రోజుకూ ఒక విశిష్టత, ఘనమైన పౌరాణిక నేపథ్యం ఉన్నాయి.
**ధన త్రయోదశి
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశిని ‘ధన త్రయోదశి’ అంటారు. దీన్ని సంపత్ప్రదాయకమైన రోజుగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే దినంగా పురాణాలు చెబుతున్నాయి. క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఇదేనని చెబుతారు. కాబట్టి ఈ రోజున లక్ష్మీ దేవినీ, ధనాధిపతి అయిన కుబేరుడినీ పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందంటారు. దీన్ని ‘కుబేర త్రయోదశి’, ‘ఐశ్వర్య త్రయోదశి’ అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఈరోజును ‘ధన్ తేరస్’ అంటారు. ఈ రోజున బంగారం, వెండి కొంటే ఏడాది పొడుగునా లక్ష్మీదేవి ఇంట్లో కొలువవుతుందని విశ్వసిస్తారు. అంతేకాదు, పితృదేవతలు ఈ రోజున తమ వారసుల ఇళ్ళకు వస్తారనే నమ్మిక ఉంది.
*లక్ష్మీదేవితో పాటు ఆరోగ్యానికి అధిపతి, ఆయుర్వేదానికి మూలపురుషుడు అయిన ధన్వంతరి కూడా క్షీరసాగరం నుంచి అమృత కలశాన్ని చేతబూని ఈ రోజే ఉద్భవించాడని పురాణాలు అంటున్నాయి. అందుకే దీన్ని ‘ధన్వంతరి త్రయోదశి’గా వ్యవహరిస్తారు. ఆయనను స్మరిస్తే ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు. ఈ రోజుకు ‘యమ త్రయోదశి’ అని మరో పేరు ఉంది. ఈ రోజున సూర్యాస్తమయ సమయంలో ఇంటి ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తారు. వాటిని ‘యమదీపాలు’ అంటారు. ఆ ఇలా దీపాలు వెలిగిస్తే యముడు ప్రసన్నుడవుతాడనీ, అకాల మృత్యువును నివారిస్తాడనీ పెద్దలు చెబుతారు.
**నరక చతుర్దశి
లోకకంటకుడైన నరకాసురుని వధ జరిగిన రోజు కాబట్టి, ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అంటారు. నరకుని పీడ విరగడైనందుకు సంతోష సూచకంగా కొన్ని చోట్ల గడ్డి, తాకాలువంటి వాటితో నరకాసురుని బొమ్మలు తయారుచేసి దహనం చేస్తారు.
**చతుర్దశ్యాంతు యే దీపాన్ నరకాయ దదంతి చ
తేషాం పితృగణాస్సర్వే నరకాత్ స్వర్గమాప్నుయాత్
నరక చతుర్దశి రోజున దీపాలను వెలిగిస్తే, నరకంలో ఉండే పితృదేవతలందరికీ స్వర్గ లోకం ప్రాప్తిస్తుందని భావం. మహాలయపక్షంలో తమ వారసులు సమర్పించే పిండదానాదులు స్వీకరించడానికి భూలోకానికివచ్చిన పితృదేవతలు తిరిగి వారి లోకాలకు ఈ రోజున బయలుదేరుతారట! వారికి దారి చూపుతూ దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది.
**దీపావళి
ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజును దీపావళిగా ప్రజలు జరుపుకొంటారు. రాష్ట్రాల వారీగా సంప్రదాయాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఒకే స్థాయి ఉల్లాస, ఉత్సాహాలతో నిర్వహించే వేడుక ఇది. ఈ రోజు ఏ ఇంట దీపాలు వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందన్న విశ్వాసం ఉంది. అందుకే దీపాల వరుసలతో ఆమెకు స్వాగతం పలుకుతారు. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తే, ఇంట ఆమె కొలువై ఉంటుందని నమ్మకం. సాయంత్రం లక్ష్మీరూపమైన తులసికోట ముందు ముందుగా దీపాలు వెలిగిస్తారు. తరువాత శ్రీమహాలక్ష్మిని పూజిస్తారు. తరువాత పిల్లలూ, పెద్దలూ బాణాసంచా కాలుస్తూ దీపావళిని జరుపుకొంటారు.
**బలి పాడ్యమి
కార్తిక మాసం తొలిరోజును… అంటే కార్తిక శుద్ధ పాడ్యమిని ‘బలి పాడ్యమి’ అంటారు. ప్రతి సంవత్సరం బలి పాడ్యమి రోజు సాయంత్రం తను పాలించిన భూలోకంలో ప్రజలు ఎలా ఉన్నారో చూసేందుకు బలి చక్రవర్తి పాతాళం నుంచి వస్తాడు. ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో, ముగ్గులతో, అలంకరణలతో వేడుకలు చేసుకోవడం చూసి, అతను ఆనందిస్తాడు. ఆ ఆనందం శాశ్వతం కావాలని కోరుకుంటూ తిరిగి వెళతాడు. పురాణాలు పేర్కొంటున్న కథ ఇది. ఈ రోజు ముగ్గు లేదా బియ్యంతో బలి చక్రవర్తి బొమ్మ తయారు చేసి, పూజించాలని పెద్దలు చెబుతారు. ఈ రోజు తప్పనిసరిగా దానం చేయాలనీ, అలా చేసిన వారికి తరగని సిరిసంపదలు లభిస్తాయనీ నమ్మకం.అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి నందగోకులాన్ని కాపాడిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు గోవర్ధన పూజ చేసే ఆనవాయితీ కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇంట్లో ఆవు పేడను కొండ ఆకారంలో తీర్చి, పూజిస్తారు. దానికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలో ఉన్న గోవర్ధన గిరి పరిక్రమను ఈ రోజుల్లో చెయ్యడం పవిత్రంగా భావిస్తారు. గోవర్ధన గిరి చుట్టూ సుమారు 23 కి.మీ. మేర సాగే ఈ పరిక్రమలో వేలాది భక్తులు పాల్గొంటారు. గుజరాతీయుల నూతన సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. వారు దీన్ని ‘బెస్తు వర్ష్’ అంటారు.
**యమ ద్వితీయ
కార్తీక శుద్ధ విదియను ‘యమ విదియ’, ‘యమ ద్వితీయ’, ‘భాతృ విదియ’ అని అంటారు. యమధర్మరాజును ఆయన సోదరి యమీ (యమునా) దేవి ఈ రోజున ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చిందట. దానికి సంతృప్తుడైన యముడు ఈ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక బాధలు ఉండవని, అంతేకాకుండా వారి సౌభాగ్యం పెరుగుతుందనీ వరం ఇచ్చాడు. అలాగే సోదరి చేతి భోజనం చేసిన సోదరులకు అపమృత్యు దోషం ఉండదని చెప్పాడు. అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేస్తారు. దీన్నే ‘భోగినీ హస్త భోజనం’ అని పిలుస్తారు. ఉత్తరాదిన ఈ రోజును ‘భాయ్ దూజ్’గా వ్యవహరిస్తారు.
1. తలనీలాల ద్వారా రూ.6.09 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాలను విక్రయించడం ద్వారా తితిదేకు రూ.6.09 కోట్ల ఆదాయం లభించింది. ప్రతినెలా మొదటి గురువారం ఈ- వేలం ద్వారా తితిదే తలనీలాలను విక్రయిస్తుంది.
2. మన పురాణాల్లో… కావ్యాల్లో…-
దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుంద’ని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీప ప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు.సంస్కృత కావ్యాల్లోనే కాదు, పాళీ భాషలో కూడా దీపావళి మహోత్సవ ప్రస్తావన ఉంది. కేవలం హిందువులేకాదు, జైన, బౌద్ధ మతానుయాయులు కూడా దీపావళి పండుగను పాటిస్తారు. క్రైస్తవ, మహమ్మదీయ మతస్థులు వారివారి ఆచార సంప్రదాయాలను అనుసరించి దీపాలను వెలిగించడం కద్దు.
3. ఎన్ని వత్తులు వాడాలి?
దీపావళి అంటేనే దీపాల పండుగ. సకల సంపదలనూ, సౌభాగ్యాన్నీ ప్రసాదించే శ్రీమహాలక్ష్మీ దేవికి వెలుగుల ద్వారా ఆహ్వానం పలికితే ఆమె కటాక్షం లభిస్తుందన్నది పెద్దల మాట. దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వులనూనె వినియోగించాలి. లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి పాల నుంచి ఉత్పత్తి అయిన నెయ్యి ఆమెకు ప్రీతికరం. అందుకని నెయ్యితో దీపాలు వెలిగించి, లక్ష్మీదేవిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని శాస్త్ర వచనం. దీపారాధనకు కొన్ని నియమాలున్నాయి. ఒకసారి వెలిగించిన వత్తిని మరోసారి వాడడం మంచిది కాదు. అలాగే ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించరాదంటారు. అగరువత్తులతోనో, అగ్గిపుల్లలతోనో దీపాన్ని వెలిగించాలి. కొవ్వొత్తుల వాడకం శ్రేష్ఠం కాదు.మట్టి, వెండి, ఇత్తడి, పంచలోహాలతో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. మట్టి ప్రమిదల్లో దీపం పెడితే, ఒక ప్రమిద కింద మరో ప్రమిద పెట్టాలి. పూజ చేస్తున్నప్పుడు దీపం కొండెక్కిపోతే ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ మళ్ళీ దీపం వెలిగించవచ్చు. దీపాల్లోని ముఖాలను బట్టి, అంటే వాటిలో పెట్టే వీలున్న వత్తుల సంఖ్యను బట్టి కూడా ఫలితాలు ఉంటాయంటోంది శాస్త్రం. దాని ప్రకారం, ఒకే వత్తి ఉండే ఏకముఖి దీపం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. రెండు వత్తుల ద్విముఖ దీపం కుటుంబ ఐక్యతకు దోహదం చేస్తుంది. మూడు వత్తుల త్రిముఖ దీపం ఉత్తమ సంతాన సౌభాగ్యాల్ని చేకూరుస్తుంది. చతుర్ముఖ దీపం పశుసంపదనూ, ధన సంపదనూ పెంచుతుంది. పంచముఖ దీపం సిరిసంపదలను వృద్ధి చేస్తుంది.
4.6 నుంచి 10 వరకు కాళీ పూజలు
కటక్‌లో ఈ నెల 6వ తేదీ నుంచి 10వరకు కాళీ పూజలు నిర్వహించేందుకు కటక్‌ మహానగర శాంతికమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కటక్‌లో కాళీ పూజలకు సన్నాహాక సమావేశం జరిగింది. కటక్‌ మార్వాడి క్లబ్‌ ప్రాంగణంలో బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో భాజపా, బిజద, కాంగ్రెస్‌ పార్టీల నేతలు, మహానగర శాంతికమిటీ ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అధికారులు, వివిధ పూజా కమిటీల పెద్దలు హాజరై చర్చలు జరిపారు. 6న కాళీ పూజలు ప్రారంభమవుతాయి. 7న దీపావళి జరుగుతుంది. 8, 9తేదీల్లో పూజా మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 10న కాళీ ప్రతిమల నిమజ్జనాలు జరిపేందుకు శాంతికమిటీ షెడ్యుల్‌ ఖరారు చేసినట్లు శాంతి కమిటీ కార్యదర్శి బికారి దాస్‌ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎమ్‌సీ మేయర్‌ ప్రసంగిస్తూ నగరంలో ఈ ఏడాది వినాయకుని పూజలు, దుర్గపూజలు శాంతియుతంగా జరిగాయి. కాళీపూజలు కూడా శాంతియుతంగా జరపాలని పూజా కమిటీల పెద్దలకు విన్నపించారు. 80కి పైగా మండపాల్లో కాళీ ప్రతిమలను పూజిస్తారని శాంతికమిటీ ప్రకటించింది.
5.శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే ఈరోజు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వామివారి సేవలో పాల్గొనేందుకు వీలుగా వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్‌ విధానంలో ఆన్‌లైన్‌లో జారీ చేసింది. విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్‌ కింద వెంటనే బుక్‌ చేసుకోవచ్చు.ఫిబ్రవరి నెలకు సంబంధించి 67,146 టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఇందులో కరెంట్‌ బుకింగ్‌ కింద 57,350 ఆర్జిత సేవాటిక్కెట్ల అధికారులు విడుదల చేశారు. సుప్రభాతం 7,096, తోమాల 110, అర్చన 110 , అష్టాదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300, విశేష పూజ 2,000, కల్యాణోత్సవం 12,825, ఊంజల్‌ సేవ 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకరణ 16,200 టిక్కెట్లను భక్తులు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు.
6.తెలంగాణ శ్రీశైలం.. ఓదెల
శ్రీశైలం ఈ మాట వినగానే భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. శ్రీశైలం మాదిరిగానే లింగరూపం, పానపట్టం ఉండటంతో తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచిన శైవక్షేత్రమే పెద్దపల్లి జిల్లాలోని మల్లికార్జునస్వామి దేవాలయం. తనకు గాయం చేసిన భక్తుడికి సైతం మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా అతడి పేరును పక్కన చేర్చుకుని ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు..ఆలయానికి వెళ్ళాలంటే కరీంనగర్ జిల్లా కేంద్రానికి 40కిలోమీటర్ల దూరంలో మల్లికార్జునస్వామి క్షేత్రం ఉంది. రైలు రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్ బస్సు డిపో నుంచి పెద్దపల్లి చేరుకునే ప్రతి బస్సూ ఓదెల మీదుగానే వెళ్తుంది. వరంగల్ జిల్లా నుంచి 60 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారానైనా ఇక్కడకు చేరుకోవచ్చు. దిక్కులనే అంబరాలుగా కలిగిన ఆ దేవదేవుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలుగొందుతున్న క్షేత్రం ఓదెల. పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ మల్లికార్జునుడు స్వయంభుగా వెలిశాడనీ, ఆర్తిగా మల్లన్నా అని పిలిస్తే చాలు నేనున్నానంటూ అభయమిస్తాడనీ భక్తుల నమ్మకం. అందుకే, ఓదెల మల్లన్నను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ బారులుతీరుతారు.
**స్థలపురాణం
పూర్వం ఓదెల ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేదనీ, అక్కడే వెలసిన శివలింగాన్ని పంకజ మహాముని పూజించేవాడనీ ఆలయ స్తంభంపై చెక్కిన మునీశ్వరుడి రూపం, పేర్లూ తెలియజేస్తున్నాయి. కాల లింగం పూర్తిగా కనుమరుగైపోయింది. అదే స్థలంలో చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం కోసం పుట్టను దున్నుతుండగా నాగలి పుట్టలోపలున్న లింగాన్ని బలంగా తాకింది. ఆ సమయంలో భయంకరంగా ఓంకార నాదం చేస్తున్న అశరీరవాణి ‘ఓదెలా! ఇకపై ఈ వంశం నశించుగాక అని శపించింది. జరిగిన పొరపాటును గ్రహించిన ఓదెలు వెంటనే స్వామి వారికి నమస్కరించి, తాను తెలియక చేశాననీ, తనని మన్నించమనీ ప్రాధేయపడ్డాడు. అతడి నిజాయితీనీ, పశ్చాత్తాప బుద్ధిని మెచ్చిన శంకరుడు ఓదెలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా ఓదెల మల్లికార్జున స్వామిగా ఈ ప్రాంతంలోనే కొలువై భక్తుల కష్టాలను తీరుస్తానని అభయమిచ్చాడు. అప్పటి నుంచీ ఈ ఆలయాన్ని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. ఇప్పటికే ఇక్కడున్న శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన ఆనవాలు కనిపించడం విశేషం. కాకతీయుల కాలంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. స్వామి వారికి ఉత్తరంగా భ్రమరాంబ అమ్మవారినీ, క్షేత్రపాలకుడిగా వీర భద్రస్వామినీ ప్రతిష్ఠించారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీశైల పండితారాధ్య పీఠానికి సంబంధించిన అర్చకులతోనే స్వామి వారికి నిత్యకైంకర్యాలు జరుపుతున్నారు. ఆలయానికి పశ్చిమ దిశలో వీరశైవ మఠం కూడా ఉంది. అపరభక్తులైన కొండవీటి వంశంలో మల్లన్న ఖండేశ్వరుడిగా అవతరించాడు. బలిజ వంశానికి చెందిన కేతమ్మలనే కన్యలు ఖండేశ్వరస్వామిని భక్తితో సేవించి ఆయనలో లీనమయ్యారు. ఇందుకు ప్రతిరూపంగా ఆలయానికి ఈశాన్యదిశలో ఖండేశ్వరస్వామి, మేడలాదేవి, కేతమ్మల విగ్రహాలు ప్రతిష్ఠించారని పండితులు చెబుతున్నారు.
**సీతారాములు నడయాడిన ప్రదేశం
ఈ ఆలయంలో మరో విశేషమూ ఉంది. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి ఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే మార్గంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకు గుర్తుగా స్వామి వారికి దక్షిణ దిశగా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారని భక్తుల విశ్వాసం. ఆలయానికి తూర్పు దిశగా బంగారు పోచమ్మ, వాయవ్య దిశగా మదన పోచమ్మ ఆలయాలూ ఉన్నాయి.
**బ్రహ్మోత్సవ సమయంలో…
ఫిబ్రవరిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవిల కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరుగుతుంది. కార్తీక, శ్రావణ మాసాల్లో జరిపే ప్రత్యేక పూజలూ, మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే మహారుద్రాభిషేకాలూ విశిష్టతను సంతరించుకుంటాయి. ఈ పూజల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఒగ్గు పూజారులు వేసే పెద్ద పట్నాలు, అగ్ని గుండాల ప్రదక్షిణ, దక్షయాగాది కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.స్వామి వారికి తెల్లవారుజాము నుంచే మేలుకొలుపు సేవ, సుప్రభాత సేవలు ప్రారంభమవుతాయి. మంగళ వాద్యాల నడుమ నిత్యాభిషేకాలూ, అన్నపూజలూ, మహా నివేదనలూ ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగే ప్రదోషకాల పూజలూ, హారతీ, ద్వార బంధన కార్యక్రమాలు విశిష్టమైనవి. పట్నాలు, బోనాల మొక్కులు సమర్పించే భక్తులతో ఈ ఆలయంలో ఎప్పుడూ పండుగ వాతావరణం కనిపిస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com