“గోడ”కు మరో గౌరవం

క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబర్చిన వారికిచ్చే ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ జాబితాలో భారత మాజీ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌కు చోటు కల్పిస్తూ ఈ ఏడాది జులైలో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ నుంచి ఐసీసీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు తిరువనంతపురంలో భారత్‌-వెస్టిండీస్‌ మధ్య చివరి వన్డే జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన మెమెంటోను ఆయనకు భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ చేతుల మీదుగా అందించి, అధికారికంగా ఈ జాబితాలో ఆయనకు చోటు కల్పించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ జాబితాలో చేరిన ఐదో క్రికెటర్‌ ద్రవిడ్ అని, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం భారత అండర్‌-19 జట్టుకి కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ద్రవిడ్‌ కన్నా ముందు ఈ జాబితాలో నలుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. బిషన్‌ సింగ్‌ బేడీ, కపిల్ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లేల సరసన ఇప్పుడు ఆయన నిలిచారు. తన కెరీర్‌లో ద్రవిడ్ 164 టెస్టులు ఆడి 13,288 పరుగులు చేశారు. అందులో 36 శతకాలు ఉన్నాయి. 344 వన్డేలు ఆడిన ఆయన.. 10,889 పరుగులు చేశారు. అందులో 12 శతకాలు ఉన్నాయి. 2014లో ఆయన ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో పాటు ఐసీసీ టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను అందుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com