ఎన్‌టీఆర్ నమ్మకాన్ని తీసుకొచ్చిన ఎడ్లబండి

పట్టణంలోని మిల్లుకు ధాన్యం తీసుకెళ్లాలన్నా.. పెద్దమొత్తంలో సరకులు జహీరాబాద్‌లో కొని ఇంటికి తేవాలన్నా అప్పట్లో బాగన్న బండివైపే అందరూ చూసేవారు. రవాణా సాధనాలు పెద్దగా లేని ఆ రోజుల్లో చాలా మంది ఎడ్లబండిని నమ్ముకుని జీవనం సాగించేవారు. ఎడ్లబళ్లు ఎన్నిఉన్నా.. అందరూ బాగన్న బండికే ప్రాధాన్యం ఇచ్చేవారు. కలుపుగోలుతనం, మర్యాదగా పలకరించడం, కాస్త డబ్బులు తక్కువైనా సర్దుకుపోవడమే అందుకు కారణం. కాలక్రమంలో ఆ మంచితనమే ఆయనను శాసనసభలో అడుగుపెట్టేలా చేసింది. బండి బాగన్నగా జహీరాబాద్‌ ప్రజలకు సుపరిచితుడైన చెంగల్‌ బాగన్న ఆ తర్వాత వార్డు సభ్యుడిగా, సర్పంచిగా, శాసనసభ్యుడిగా వివిధ పదవులను అలంకరించారు. ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాగన్నకు తర్వాత పరాజయాలే ఎదురయ్యాయి. ఉన్న ఆస్తులూ అమ్ముకున్న ఆయన ప్రస్తుతం వృద్ధాప్యంలో జహీరాబాద్‌లోనే అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. జహీరాబాద్‌ మండలం గోపన్‌పల్లి చెంగల్‌ బాగన్న(83) సొంతూరు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఉపాధి కోసం ఎడ్లబండి నడిపేవారు. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేని కుటుంబం వారిది. మర్యాదస్తుడిగా పేరు తెచ్చుకున్న ఆయనను ఎడ్లబళ్లు నడిపే మిగతా వారు ఎంతో అభిమానించేవారు. వారి తోడ్పాటుతో 1977లో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి గోపన్‌పల్లిలో 1981లో సర్పంచిగా ఎన్నికయ్యారు. 1987లో ఎంపీపీగా గెలిచారు. అప్పటికే బాగన్న పేరు నియోజకవర్గం అంతా మారుమోగింది. ధైర్యసాహసాలకుతోడు ఏ అంశం మీదైనా కుండబద్ధలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వినిపిస్తారనే భావన ప్రజల్లో పెరిగింది. తన సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే మనస్తత్వం కావడంతో అనతికాలంలోనే ఆయన అందరి అభిమాన నేతగా ఎదిగారు. 1994లో జరిగిన ఎన్నికలకు ఆరునెలల ముందే జహీరాబాద్‌ నుంచి తెదేపా తరఫున బాగన్న పోటీచేస్తారని ఎన్టీఆర్‌ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పి.నరసింహారెడ్డిపై బాగన్న 34,970 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఇదే అత్యధిక ఆధిక్యం కావడం విశేషం. ఆ తర్వాత తిరిగి 2004లో తెదేపా తరఫున అభ్యర్థిగా ప్రకటించినా.. విజయం సాధించలేకపోయారు. 2009 ఎన్నికల్లో భాజపా నుంచి జహీరాబాద్‌ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇలా ఓటములు రావడంతో ఉన్న కొద్దిపాటి ఆస్తులనూ అమ్ముకోవాల్సి వచ్చింది. బాగన్న శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో జహీరాబాద్‌ నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే తన నివాసంలో వారికి బస ఏర్పాటు చేసేవారు. చాలా మంది ఈ ప్రాంత వాసులను ఆయన ప్రత్యేకంగా తీసుకెళ్లి శాసనసభ మందిరాన్ని చూపించేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం చిన్నకుమారుడు రాజశేఖర్‌తో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్య మాణెమ్మ నాలుగేళ్ల క్రితం మరణించారు. ఎన్నికల ఖర్చుల కోసం జహీరాబాద్‌లో ఉన్న ఇంటిని, గ్రామంలో ఉన్న రెండెకరాల భూమిని అమ్ముకున్న ఆయన ఇంటి స్థలం కేటాయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ చుట్టూ కొన్నేళ్లుగా ప్రదక్షిణలు చేశారు. ఇటీవల ఆయనకు ఇంటిస్థలం కేటాయించారు. జహీరాబాద్‌ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక ఆధిక్యంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన బాగన్న ప్రస్తుతం పింఛను డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నారు. బాగన్న కుటుంబంలో ఆయనకు ముందు, తర్వాత ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com