Politics

దేవుడు తప్పక శిక్షిస్తాడు-తాజావార్తలు

CM Jagan Warning To Criminals Who Vandalized Lord Rama Statue

* దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. విగ్రహాల విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల ఘటనల నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలపై సీఎంఓ అధికారులతో ఇవాళ సమీక్షించిన జగన్‌.. అర్హత ఉండి ఇంటిపట్టా రాలేదనే మాట వినిపించకూడదన్నారు. అనర్హుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

* ఖమ్మం, వరంగల్‌ నగరపాలక సంస్థలతోపాటు మరో నాలుగు పురపాలికలకు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. నిర్దేశించిన గడువులోపే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ ఖమ్మం బల్దియా పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. వార్డులను పునర్విభజించేందుకు బల్దియా యంత్రాంగం చర్యలకు శ్రీకారం చుట్టింది. పునర్విభజనపై పురపాలక శాఖకు లేఖ రాయడంతో ఖమ్మంలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మరోవైపు ఎన్నికల సంఘం కదలికలతో నగర పోరుపై పార్టీలన్నీ దృష్టిపెట్టాయి.

* తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. నూతన సంవత్సర వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూ ఇయర్ వేడుకలను ఎందుకు బ్యాన్‌ చేయలేదని ప్రశ్నించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారించింది. ఓ వైపు కొత్త వైరస్‌ ప్రమాదకరమని హెల్త్‌ డైరెక్టర్‌ చెబుతుంటే.. వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా బార్లు తెరిచి ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రాజస్థాన్, మహారాష్ట్రలో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలను బ్యాన్‌ చేశారని హైకోర్టు వెల్లడించింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. వేడుకలు జరుపుకోవద్దని ప్రజలకు సూచించామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం ఈ రోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 7న దీనిపై పూర్తి నివేదికను సమర్పించాలని హైకోర్టు తెలిపింది.

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహాకార సంఘం (ఆప్కో) ఛైర్మన్ గా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చిల్లపల్లి వెంకట నాగమోహన రావు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి జె. మురళి ఈ మేరకు జిఓ నెంబర్ 252 జారీ చేసారు. ఆరు నెలల పాటు చిల్లపల్లి పదవిలో కొనసాగనుండగా, ఈ లోపు చేనేత సహకార సంస్ధలకు ఎన్నికలు నిర్వహిస్తే తదనుగుణంగా వ్యవహరించవలసి ఉంటుందని ఆ ఉత్తర్వులలో పేర్కోన్నారు. చేనేత కార్మికుల స్వావలంబన కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న చిల్లపల్లి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలన్న ధ్యేయంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆప్కో ఛైర్మన్ గా చిల్లపల్లికి అవకాశం కల్పించారు.

* సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను కేంద్రం విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ గురువారం సాయంత్రం‌ ప్రకటించారు. మే 4 నుంచి జూన్‌ 10 వరకు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని స్పష్టంచేశారు. జూలై 15న పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. పరీక్షల డేట్‌ షీట్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు.

* తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ప్రారంభించి రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం లేదని స్టార్‌ హీరో రజనీకాంత్‌ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. అయితే, రజనీ వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకున్నారని, ఆయన శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి విలక్షణ నటుడు మోహన్‌బాబు కూడా చేరారు. రజనీ-మోహన్‌బాబు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీ రాజకీయాల్లో వెనకడుగు వేయటంపై మోహన్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘రజనీకాంత్‌ నాకు అత్యంత ఆత్మీయుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లో రావటం లేదని ప్రకటించారు. ఒక రకంగా తను రాజకీయాల్లో రాకపోవటం అభిమానులందరికీ బాధే. అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఇదే మంచి నిర్ణయమని నమ్ముతున్నా. నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ‘నువ్వు చాలా మంచివాడివి. చీమకు కూడా హాని చేయవు. వన్‌ ఆఫ్‌ ది గ్రేటెస్ట్‌ పర్సన్‌. నీకూ, నాకు రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు.. సీట్లు.. కొనలేం. ఇక్కడ ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంతవరకూ మంచివాడన్న వాళ్లే, ఆ తర్వాత చెడ్డవాడంటారు. రాజకీయం రొచ్చు.. బురద.. అది అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిదైంది. రజనీకాంత్‌ అభిమానులందరూ ఆయనంత మంచివాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. – మీ మోహన్‌బాబు’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

* పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీని జమ చేసే ప్రక్రియను ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రారంభించింది. 8.5 శాతం వడ్డీ చొప్పున మొత్తాలను వేసే ప్రక్రియను గురువారం మొదలుపెట్టింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ కానున్నాయి. ఇప్పటికే నగదు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. జనవరి 1 నాటికి అందరి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని రెండు విడతల్లో జమ చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. తర్వాత ఏకమొత్తంలో జమ చేయాలని కార్మిక శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

* జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఉగ్రదాడి ఘటనలు, అక్రమ చొరబాట్లు తగ్గాయని ఆ ప్రాంత డీజీపీ దిల్‌బాగ్‌‌ సింగ్‌ తెలిపారు. 2020లో వందకి పైగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 225 మంది ముష్కరులను భద్రతాసిబ్బంది మట్టుబెట్టినట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ పోలీసు వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

* చాలా సులభంగా, త్వరితంగా వ్యాప్తిస్తుందా?మరింత హాని చేస్తుందా?చికిత్సలకూ, వ్యాక్సిన్‌కూ లొంగదా? ఇటీవల పొడచూపిన కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ (రకం) కంటే కూడా ప్రజల్లో వేగంగా వ్యాప్తిస్తున్న సందేహాలివి. ప్రత్యేకించి ఇటీవల బ్రిటన్‌ తదితర విదేశాలకు వెళ్లి వచ్చినవారు, వారి సంబంధీకులు పలు అనుమానాలతో సతమతమౌతున్నారు.

* నగరంలోని లింగోజిగూడ కార్పొరేటర్‌ ఆకుల రమేశ్‌ గౌడ్‌ మృతిచెందారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా తరఫున ఆయన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం రమేశ్‌ గౌడ్‌కు కొవిడ్‌ సోకడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. అప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో రమేశ్‌గౌడ్‌ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేశ్‌గౌడ్‌ ఎల్బీనగర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు.

* సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని కళాశాల వచ్చేలోపు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల కోసం జనవరి వరకు వేచిచూసి ఆ తర్వాత పోరాటం చేస్తానని హెచ్చరించారు.

* రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరగడం విచారకరమని తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గతిపతిరాజు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. విజయనగరం జిల్లా రామతీర్థానికి 400ఏళ్ల చరిత్ర ఉందన్నారు. రామతీర్థంలోని కోదండరాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

* కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణహత్యకు గురైన తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించారు. అంతకు ముందు ఇంటి నుంచి స్మశానం వరకు సుబ్బయ్య అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ , పార్టీ సీనియర్‌నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సుబ్బయ్య అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

* కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు హైకోర్టు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో 2017లో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు గత వారం న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే కూర్చోవాలని శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.1000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారం రోజులు సాధారణ జైలు శిక్ష విధించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

* రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని.. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో మెరుగుపర్చాల్సిన అంశాలు, సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు పలువురు మంత్రులు, కరీంనగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమీక్షలో పాల్గొన్నారు. అన్నదాతల సమస్యలు తొలగించేందుకే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చామని.. అందుకు అనుగుణంగా పోర్టల్‌ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. 2 నెలల వ్యవధిలోనే 1.6 లక్షల స్లాట్‌లు బుక్‌ చేసుకున్నారని.. వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయన్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాలలోపు వారే ఉన్నారని కేసీఆర్‌ తెలిపారు.

* ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌కు రాజధాని ప్రాంత మహిళలు, రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్తు్న్న మార్గంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పొడవునా మహిళలు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌కు నమస్కరిస్తూ వీడ్కోలు పలికారు. న్యాయాన్ని కాపాడుతూ అమరావతి రైతులకు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ మద్దతుగా నిలిచారని మహిళలు కొనియాడారు. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ 2019 నవంబర్‌ 8న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి రావడానికి ముందు బిహార్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన చేసిన ప్రకటన తీవ్ర సంచలనమైంది. ఉన్నతస్థాయి న్యాయవ్యవస్థలో కొంత అవినీతి చోటుచేసుకుంటోందంటూ జస్టిస్‌ రాకేశ్‌కుమార్ అప్పట్లో పేర్కొన్నారు. ఇది సుప్రీంకోర్టు కొలీజియం వరకూ వెళ్లింది. ఆ తర్వాత రాష్ట్రానికి న్యాయమూర్తిగా వచ్చారు.

* ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ నియామకానికి సీఎం జగన్‌ ఆమోదముద్ర వేశారు. బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం నేటి ముగియనుంది. దీంతో ఆమెను సీఎం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వం నియమించింది.