నరక చతుర్దశి అంటే ఏమిటి-ఆధ్యాత్మిక వార్తలు

నరక బాధ నివారిణి నరక చతుర్దశి –తదితర ఆద్యాత్మిక కధనాలు
చతుర్దశి నాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్, యమ తర్పణం వల్ల మానవులు తమకు నరకబాధలు లేకుండా చేసుకుంటారో దానిని ‘‘నరక చతుర్దశి’’ అంటారు. నరక చతుర్దశి ‘ప్రేత చతుర్దశి’ అని పర్యాయనామం కలిగి, ఈనాడు నరక ముక్తి కోసం యమ ధర్మరాజును ఉద్దేశించి దీప దానం చేయాలని వ్రత చూడామణి చెపుతున్నది. గుజరాతీయులు నరక చతుర్దశిని ‘‘కాలచౌదశ్’’ అంటారు. సంస్కృతంలో ‘‘కాళ చతుర్దశి’’. నరకలోక వాసులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించ చేసే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే కార్యకలాప దినమని, నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘‘చతుర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం. చీకటి ఉండగా స్నానం చేయనివారు నరకకూపంలో పడతారని, అందుకే తెలవారకుండా ఈరోజు అభ్యంగన స్నానం చేయాలని నిర్దేశం. ప్రతీమాసంలోనూ బహుళ చతుర్దశి మాస శివరాత్రి. ఆనాడు కాని, మరునాడు కాని తెల్లవారకుండా అభ్యంగన స్నానం చేయకూడదనే నిషేధం హిందూ సమాజంలో ఉంది. అయితే ఆశ్వయుజ బహుళ చతుర్దశికి అమావాస్య లేదు. పైగా ఈనాడు అభ్యంగన స్నానం విధిగా చేయాలని వ్రత చూడామణి మున్నగు గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. స్నానం చేస్తుండగా తలచుట్టూ దీపం తిప్పడం, టపాసులు కాల్చడం ముఖ్య ఆచారం. వధకు పూర్వం నరకాసురుడు శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడని తెలుసుకుని, పరమాత్ముని క్షమాభిక్ష కోరాడు. ఆ పరంధాముడు మన్నించాడు. క్షమాభిక్ష కారణంగానే నరకుడు తనకూ, తన మరణ దినం నాడు స్నానం చేసే వారికీ పాప విముక్తి సంపాదించుకున్నాడు. వేకువ జామునే తైలాభ్యంగన స్నానం చేసి, యమ తర్పణం చేసే వారికి యమ దర్శనం లేదని శాస్త్రం వివరిస్తున్నది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, చతుర్దశి తిథుల మధ్య కాలంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ దినాన పండువ జరుపుకోవడం ఆచారమైనది.
**స్నాన సమయం
బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది గడియలకు అవుతుంది. అప్పటికి ఒక గంట మాత్రమే రాత్రి మిగిలి ఉంటుంది. చంద్రుడు ఉండగానే తెల్లవారుజామున తలంటి పోసుకోవాలి. తిలతైలంలో లక్ష్మీదేవి ఉంటుందనే భావనతో చతుర్దశినాడు నువ్వుల నూనెతో తలంటుకోవడం సంప్రదాయం.
**స్నాన జలం
ఈనాడు జలమందు గంగాదేవి కళలు సమాహితమై ఉంటాయని శాస్త్ర వచనం. అభ్యంగన స్నానమునకు వలయు నీటిని పూర్వదిన రాత్రియందే పాత్రలందు నింపి, ఆ నీటిలోనికి జలాధి దేవతను ఆహ్వానించి, సకల మహానదీ దివ్య తీర్థ సాన్నిద్ధ్యమును కలుగజేసి, పూజించి, ఆ నీటినే ఉదయాత్పూర్వము స్నానమాచరించాలని వివరించబడింది.
**ఇతర విధులు
స్నాన సందర్భంలో మరికొన్ని విధులు నిర్దేశితాలు. స్నానానికి ఉత్తరేణి, తుమ్మి, తగిరిస చెట్ల కొమ్మలతో కలియబెట్టి, కదిపిన జలంలో విద్యుత్ ఉత్పాదనం అవుతుంది కనుక ఓషధుల సమ్మిళితమైన సదరు నీరు ఆరోగ్యకరం కనుక అలా వినియోగించాలి. నరకబాధ తప్పించేందుకు ఉత్తరేణి ఆకులను తలపై ఉంచుకుని, దక్షిణాభిముఖంగా కూర్చుని, 14నామాలతో యమధర్మరాజుకు తర్పణం చేయాలి. ఈదినం తిలలతో చేసిన పిండి వంటలను తప్పక తినాలి. ప్రదోష కాలమందు దీప దానం చేయాలి. దేవాలయాలలో, మఠాలలో దీప పంక్తులుంచాలి.
1. తిరుమలలో 26 వేల లడ్డూ ప్రసాదం పక్కదారి
తిరుమల, తిరుపతి దేవస్థానం చరిత్రలో లడ్డూ ప్రసాదం విషయంలో తొలిసారి భారీ కుంభకోణం వెలుగుచూసింది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 26 వేల లడ్డూలను పొరుగుసేవల సిబ్బంది స్వాహా చేశారు. ఒక్కో లడ్డూ విలువ రూ.50. ఈ లెక్కన రూ.13 లక్షల మేర శ్రీవారి ఖజానాకు నష్టం వాటిల్లింది. తితిదే విజిలెన్స్ విభాగం వెంటనే ఈ అక్రమాన్ని గుర్తించి విచారించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన సమయంలో గరుడ సేవ జరిగిన అక్టోబరు14వ తేదీ, అంతకుముందు రోజు సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తి లడ్డూ ప్రసాద టోకెన్ల పరిశీలనకు అంతరాయం ఏర్పడింది. భక్తులకు అసౌకర్యం కలగరాదనే భావనతో టోకెన్లు స్కానింగ్ చేయాల్సిన అవసరం లేదంటూ దేవస్థానం ఉన్నతాధికారులు వెసులుబాటు కల్పించారు. ఇదే అదనుగా 30 మంది పొరుగుసేవల సిబ్బంది ముఠాగా ఏర్పడి అక్రమాలకు తెరదీశారు. ఒకే టోకెన్పై ఒకటికంటే ఎక్కువ సార్లు లడ్డూలు అందిస్తూ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. టోకెన్ల సంఖ్యకు, పంపిణీ చేసిన లడ్డూల సంఖ్యకు పొంతన లేదని గమనించి తితిదే ఇన్ఛార్జి సీవీఎస్వో శివకుమార్రెడ్డి విచారణ చేపట్టారు. వివిధ బ్యాంకుల ద్వారా నియమితులైన పొరుగుసేవల సిబ్బంది, పర్యవేక్షకులు కుమ్మక్కై స్వాహాకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నివేదికను తితిదే విజిలెన్స్ అధికారులు తమ ఉన్నతాధికారులకు సోమవారం సర్పించారు. వారి ఆదేశాలతో బాధ్యులపై తిరుపతి ఒకటో పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
2. శరణుఘోషతో మార్మోగిన శబరిమల
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు మరోసారి తెరుచుకున్నాయి. భక్తుల శరణు ఘోషతో సన్నిధానం మార్మోగింది. మంగళవారం నిర్వహించనున్న శ్రీ చిత్తర తిరునాల్ ఉత్సవం నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన, ముఖ్య అర్చకులు కండారరు రాజీవరు, ఉన్నికృష్ణన్ నంబూద్రిలు తలుపులు తెరవడంతో వేలాది మంది దర్శించుకున్నారు. రాత్రి 10 గంటలకు మూసివేశారు. మంగళవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ ద్వారాలను తెరిచి రాత్రి 10 గంటల వరకూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం ఆలయాన్ని మూసివేసి తిరిగి ఈ నెల 16న తెరువనున్నారు.శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసులు, అధికారులు శబరిమల పరిసర ప్రాంతాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సన్నిధానం వద్ద 50 ఏళ్లు పైబడిన మహిళా పోలీసులను కేరళ ప్రభుత్వం మోహరించగా.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, భాజపాలు స్వాగతించాయి. 10-50 ఏళ్ల వయసున్న మహిళలెవరూ సోమవారం ఆలయం వద్ద కనిపించలేదని పోలీసులు తెలిపారు.
3. అయ్యప్ప సన్నిధానానికి భారీగా భక్తులు రాక
అయ్యప్ప సన్నిధానానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. రాత్రి 10 గంటల వరకు అయ్యప్ప ఆలయంలో దర్శనానికి అనుమతిచ్చారు. అయ్యప్ప దర్శనం కోసం మహిళా భక్తులు పంబ చేరుకుంటున్నారు. ఎరుమేలి, పంబలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు మహిళలకు కేరళ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. 2,300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటగే అయ్యప్ప ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ ఆంక్షలు అర్థరాత్రి వరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
4. డిసెంబరు 6 నుంచి అయోధ్యలో ఆమరణ దీక్ష
ప్రభుత్వం గురించి ఆందోళనను పక్కనపెట్టి… అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే బాధ్యతను ప్రధాని నరేంద్రమోదీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ డిసెంబరు 6 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త- స్వామి సత్యమిత్రానంద గిరి వెల్లడించారు. గతంలో ఆయన జగద్గురు శంకరాచార్యగా వ్యవహరించారు. రామాలయ నిర్మాణాన్ని చేపట్టడానికి వచ్చే ఏడాది జనవరిలోగా ఎలాంటి చర్యలు చేపట్టని పక్షంలో ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని సోమవారం నాడిక్కడ తెలిపారు. రామ మందిర నిర్మాణానికి దేశంలో సాధువులంతా చేతులు కలపాలని పిలుపునిచ్చారు. రాముడు లేకపోతే- ప్రభుత్వానికి, అధికారానికి అర్థం లేదన్నారు. ‘అధికారంలో ఉండగానే ప్రధాని మోదీ చరిత్రాత్మక అడుగు వేయాలి. లాభనష్టాల కోణంలో ఆయన బేరీజు వేసుకోకూడదు. ప్రభుత్వం ఎంతమాత్రం జాప్యం చేయడం తగదు. అయినా దీనిపై ఇంకా మేం ఆశాభావంతోనే ఉన్నాం. ప్రభుత్వం తగిన సహకారాన్ని అందించాలి’ అని స్వామి గిరి తెలిపారు.
5. శబరిమలలో ఉద్రిక్తత.. కెమెరామెన్‌కు గాయాలు
కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే 18 బంగారు మెట్ల వద్దకు ఓ మహిళ చేరుకుందని తెలియడంతో ఆలయ పరిసరాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే సదరు మహిళను ఆందోళనకారులు మెట్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఘర్షణలు చెలరేగాయి. గొడవల్లో ఓ మీడియా సంస్థకు చెందిన కెమెరామెన్‌కు గాయాలయ్యాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com