Movies

చర్మం రంగు గురించి ఎందుకు?

చర్మం రంగు గురించి ఎందుకు?

శరీరాకృతిని, ఛాయను కించపరుస్తూ చేసే వ్యాఖ్యలు ఆత్మన్యూనతకు దారితీస్తాయని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక అనన్యా పాండే. కెరీర్‌తో పాటు మనసులపై అవి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని చెబుతోంది. బాడీషేమింగ్‌పై వచ్చే విమర్శల్ని తాను పెద్దగా పట్టించుకోనని అంటోంది.సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో చురుకుగా కనిపిస్తుంటుంది. నిత్యం కొత్త ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంటుంది. అయితే ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ కొందరు చేసే కామెంట్స్‌ తనను బాధపెట్టాయని చెప్పింది అనన్యా పాండే. ఆమె మాట్లాడుతూ ‘శారీరాకృతి, రంగు విషయంలో మనుషుల్లో భేదాలుంటాయి. ఆ తేడాలే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకతను ఆపాదిస్తాయి. అందాన్ని తెచ్చిపెడతాయి. ఆ వైవిధ్యతల్ని అర్థం చేసుకోకుండా చాలా మంది శారీరాకృతిని ఉద్దేశిస్తూ కామెంట్స్‌ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అలా వ్యాఖ్యలు చేయడం మనోవ్యాధిగానే నేను పరిగణిస్తా. బాడీషేమింగ్‌ కారణంగా నేను చాలా సందర్భాల్లో బాధ పడ్డా. కామెంట్స్‌ చేసేవారు వాటివల్ల ఆనందాన్ని పొందుతారు కావచ్చు. కానీ ఆ విమర్శల్ని ఎదుర్కొనే వారు ఎంతో మానసిక వేదనకు లోనవుతుంటారు. ఆ ఆలోచనతోనే సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపింది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫైటర్‌’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది అనన్యా పాండే. పూరి జగన్నాథ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.