తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో ఉన్న ఈ ఊరి పేరు చెప్పగానే అందరికి ఇల్లరికం అల్లుళ్ళు టక్కున గుర్తొచ్చేస్తారు. ఈ ఊరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎటు చూసినా రంగు రంగుల తివాచిల్లాంటి పూదోటలు కనుజూపు మేర దర్శనమిస్తూ కళ్ళను కట్టి పడేస్తుంటాయి. గోదారి చెంతనున్న కడియపుసావరం మన్ను సారవంతమైన నల్ల బంగారం. ఈ సారవంతమైన నేలలో పూల తోటలు విరి సిరులై జీవనోపాధి కల్పిస్తున్నాయి.
పూల మొక్కలు నాటడం దగ్గర నుంచి కలుపు తీసి, ఎరువులు వేసి, తోటలు సాకటం, పూలను కోయటం, దండలు కట్టడం, మార్కెటుకి తరలించడం, మరికొన్ని చోట్ల పూలతో డెకరేషన్ చేయడం లాంటి పనులు ఇంటిల్లపాదికి సంవత్సరం పొడుగునా దొరుకుతాయి. ఆరేళ్ళ బాలలు నుంచి డెబ్బైఏళ్ల వృద్ధుల వరకూ ఆడా, మగా తేడా లేకుండా ఇక్కడ అందరికీ అన్నివేళలా చేతినిండా పనిదొరుకుతుంది. కులమతాలకతీతంగా ఇంటింటా వర్థిల్లే కుటీర పరిశ్రమలా పూలసాగు ఏళ్లతరబడి కొనసాగుతోంది.
అల్లుకుపోయే ఆత్మీయతలు
ఆ నేల విశిష్టతో, నీటి ప్రత్యేకతో లేక నిత్యం గుభాళించే పూల పరిమళ ప్రభావమోకానీ ఊరంతా అడుగడుగునా ఆత్మీయతలు పులకిస్తాయి. పాతా కొత్త తేడా లేకుండా ఊరంతా అల్లుకుపోతారు. కష్టపడి పనిచేసుకునే వాళ్లకు ఇక్కడ బతుకంతా ఆనందాల హరివిల్లు. అందుకే రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి ఇక్కడ ఆడపిల్లల్ని పెళ్లిళ్లు చేసుకుని ఇల్లరికానికి వచ్చేసినవాళ్లే ఊరంతా ఉంటారు.
పూల పనిలో వికసించే మొగ్గలు
పిల్లలు వేకువతో పోటీపడి పూలకోతకు తోటలకు వెళ్తుంటారు. ఆ పసి మొగ్గలు లేలేత చేతులు చాచుతుంటే పువ్వులు సుతారంగా వాళ్ళ చేతుల్లోకి ఒదిగిపోతాయి. పెద్దవాళ్ళైతే తోటల్లో వంగి పూలు కోయాలి. పిల్లలైతే నిలబడి కోయడం తేలికౌతుంది. అందుకే పూల కోతకు బాలలే సిద్ధహస్తులు. అలా అని వీళ్ళని బాల కార్మికులుగా పరిగణించలేం. చక్కగా చదువుకుంటూనే పూలకోతకు వెళ్తుంటారు. సాయంత్రం బడవ్వగానే పుస్తకాల సంచీ ఇంటిదగ్గర పెట్టి అమ్మకట్టిన పూలమాలలు పట్టుకుని నాలుగు కూడళ్లవైపు దారులు తీస్తారు. వేటిని ఎంతకమ్మాలో, కొనుగోలుదారులను ఎలా ఆకర్షించాలో తెలిసిన మహా గడసరులు ఈ బాల బేహారులు.
మహిళా సాధికారిత
ఈ ఊళ్ళో మరో విలక్షణం… ఆర్థిక అసమానతలు, కులమతాలకు అతీతంగా మహిళలంతా కలిసి పులపనిలో నిమగమౌతారు. మహిళలు కూడా మగవాళ్ళకి దీటుగా తోటల్లో పువ్వులు కోస్తారు. ఉదయం పదయిందంటే ప్రతియింటా ఒకటే దృశ్యం మనకు కనిపిస్తుంది. రకరకాల పూల రాశులు పోసి వాటి చుట్టూ మహిళలు చేరి పూలు కడుతుంటారు. కడియపుసావరం ఆడాళ్ళకి పువ్వులు కుట్టుట, కట్టుట ఉగ్గుపాలతో పెట్టిన విద్య. అందుకే ఇక్కడమ్మలకు చెంగున, చేత ఎప్పుడూ నాలుగు డబ్బులాడతాయి.
పెళ్లింట పూల శోభ
పూల అలంకరణకు పెట్టింది పేరు కడియపుసావరం. ఫంక్షన్ జరిగే స్థాయిని బట్టి మూడు వేల నుంచి పది లక్షల రూపాయల విలువ చేసే పూల మందిరాలు చేస్తున్నారు. పెళ్లిళ్ల లగ్గసరి వచ్చిందంటే వీళ్ళకి చేతినిండా పనే. సన్మాన, శుభకార్య, రాజకీయ వేదికలు ఇలా ఒకటేంటి… ఏ కార్యక్రమం జరిగినా పువ్వుల అలంకరణకు సిద్ధమైపోతారు కడియపుసావరం తోటమాలీలు. అధునాతన కంప్యూటర్ డిజైన్లతో, నవీన నగిషీలతో అత్యద్భుతంగా పువ్వుల అలంకరణ చేస్తున్నారు.
స్థానికంగా లభించే గులాబీలు, చామంతులు, బంతులు, లిల్లీలతో బాటు ఇతర ప్రాంతాల నుంచి హైబ్రిడ్ గులాబీలు, జెర్బేరాలు, స్వాతోఫీలుమ్, ఆంథోరియం, ఆర్కిడ్స్ వంటి ఖరీదైన పువ్వులు దిగుమతి చేసుకుని మరీ డెకరేషన్ చేస్తారు.
ఆరు వేల మంది జనాభా ఉన్న ఈ ఊరిలో వందల డెకరేషన్ యూనిట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆడిటోరియంలు, సినీ ఫంక్షన్లహాళ్ల పూల సెట్టింగులు కూడా చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ వేడుకల వేదికల్ని తయారు చేసేస్తున్నారు.
ఆ ఊరు పూలకు ప్రసిద్ధి
Related tags :