Sports

దాదా….ఆరోగ్యంగా లేచి…దా…దా!

దాదా….ఆరోగ్యంగా లేచి…దా…దా!

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ శనివారం స్వల్ప గుండెపోటుతో ఆస్పత్రి పాలవడం అతడి అభిమానులను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. అయితే గంగూలీకి ప్రమాదమేమీ లేదని, అతను కోలుకున్నాడని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రిలో గంగూలీ చేరగా.. అక్కడి వైద్యులు అతడికి యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‘‘గంగూలీకి యాంజియోప్లాస్టీ జరిగింది. అతడి పరిస్థితి నిలకడగా ఉంది. వచ్చే 24 గంటలు గంగూలీని పర్యవేక్షిస్తాం. అతడు పూర్తిగా స్పృహలో ఉన్నాడు. అతడి గుండె రక్తనాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నాయి. వాటికి చికిత్స చేస్తాం. సోమవారం మేం చర్చించుకున్నాక తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తాం. గుండెపోటుకు గురైన గంగూలీ కుదుటపడేలా చేయడానికే ప్రస్తుతం మా ప్రాధాన్యత. అతడికి ప్రమాదమేమీ లేదు. మాట్లాడుతున్నాడు కూడా’’ అని వుడ్‌ల్యాండ్స్‌ ఆస్పత్రి వైద్యుడు అఫ్తాబ్‌ ఖాన్‌ చెప్పాడు.