DailyDose

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్-నేరవార్తలు

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్-నేరవార్తలు

* టాలీవుడ్‌లో డ్రగ్స్‌ బాగోతం బయటపడింది. సుశాంత్‌సింగ్‌ కేసులో భాగంగా బయటపడ్డ డ్రగ్స్‌ కేసు మొన్నటి వరకూ బాలీవుడ్‌లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే.. ముంబయిలోని మిరా రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు ఓ టాలీవుడ్‌ నటిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. డ్రగ్స్‌ విక్రయిస్తున్న చాంద్‌ మహమ్మద్‌ను నుంచి 400గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.8-10లక్షల వరకూ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా.. డ్రగ్స్‌ సరఫరా చేసే సయ్యద్‌ పరారీలో ఉన్నట్లు ఎన్‌సీబీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఆ టాలీవుడ్‌ నటి ఎవరన్నది తెలియాల్సి ఉంది.

* టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్.. చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు.. 2018 లో పులివెందుల పూల అంగళ్ల వద్ద జరిగిన అల్లర్లు, ఘర్షణలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్ రవి.. రాళ్లతో దాడి, హత్యా యత్నం కేసులో వారెంట్ పెండింగ్.. అరెస్ట్ నుంచి తప్పించుకు నే ప్రయత్నం చేసిన బీటెక్ రవి.

* యూపీలోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

* గుంటూరు జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు(55)ను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హతమార్చారు. దాచేపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో అంకులు గొంతుకోసి చంపేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ వద్ద ఉన్న సీతమ్మ వారి విగ్రహం ధ్వంసం ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని నగర సీపీ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని.. ఇప్పటికే నగరంలోని అన్ని ఆలయాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 5.30 గంటల తర్వాత పలువురు ఆటోడ్రైవర్లు సీతమ్మవారి గుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని వెళ్లారని.. అప్పటికి విగ్రహాలన్నీ బాగానే ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై విచారణ కొనసాగిస్తున్నామని సీపీ చెప్పారు. ఆలయాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు.

* నిజామాబాద్‌ జిల్లా చందూరు మండలం ఘన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో తల్లి, కుమారుడి మృతదేహాలను ఆదివారం పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం ఉమ్నాపూర్‌ గ్రామానికి చెందిన సుజాత(30), ఆమె ఏడాదిన్నర కుమారుడిని మూడు రోజుల క్రితం ఘన్‌పూర్‌కు చెందిన చెవిటి రాము వంటచెరకు కోసం ఘన్‌పూర్‌ గుట్టకు తీసుకెళ్లారు. అదే రోజు వాళ్లిద్దరినీ హతమార్చాడు. అనంతరం వారిని అడవిలోనే పాతిపెట్టాడు. ఆదివారం చెవిటి రాము వర్ని పోలీసుస్టేషన్‌కు వచ్చి హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. హత్యకు గల కారణాలేంటనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

* తూర్పు గోదావరి జిల్లా అంజాజీపేటలో రైతుల పేరుతో భారీ మోసం జరిగింది. రైతులకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. భూములపై అప్పటికే రుణాలున్నా.. బ్యాంకు అధికారులు అదనంగా మరిన్ని రుణాలు మంజూరు చేశారు. విషయం తెలిసిన భూముల యజమానులు విస్మయానికి గురయ్యారు.