వాళ్లిద్దరూ….ఉప్పు నిప్పు!

కాంగ్రెస్‌, తెదేపా, ఇతర భాగస్వామ్య పక్షాలు మహా కూటమిగా ఏర్పడటంపై మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమది ప్రజాకూటమి అని, దానికి వ్యతిరేకంగా హరీశ్‌రావు రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీల్డ్‌కవర్‌ సీఎం కావాలా? అంటూ కేటీఆర్‌ ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునే సీఎం ఎంపిక జరుగుతుందనేది గత చరిత్ర చూస్తే ఎవరికైనా అర్థమవుతుందన్నారు. తెరాసలో సీఎంనే కాదు.. కనీసం మంత్రులను నిర్ణయించేటప్పుడు ఎవరి అభిప్రాయమైనా తీసుకుంటారా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులు అన్ని పదవులనూ పంచుకుని ఏమైనా మిగిలితే ఇతరులకు ఇస్తున్నారని విమర్శించారు. హరీశ్‌రావును సీఎం కేసీఆర్‌ నమ్మరని వ్యాఖ్యానించారు. దిల్లీలో కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ను ఉద్దేశించి రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘‘హరీశ్‌రావు నిప్పుల్లో నడిచినా తన శీలాన్ని నిరూపించుకోలేరు. ఆయనను కేసీఆర్‌ నమ్మరు. హరీశ్‌‌ ఎలాంటి వ్యక్తో, నమ్మినవాళ్లను ఎలా మోసం చేశారో అతని మామ కేసీఆర్‌కు తెలుసు. అతని జాతకమంతా కేసీఆర్‌ వద్ద ఉంది. కేసీఆర్‌ను నమ్మించేందుకు కాంగ్రెస్‌ను, కూటమిని హరీశ్‌ పదేపదే విమర్శిస్తున్నారు. ఈరోజు కూడా లేఖ రాశారని తెలిసింది. గత నెల 25న సాయంత్రం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి గజ్వేల్‌లో నర్సారెడ్డిని కారులో ఎక్కించుకొని రాత్రి 9.30గంటలకు హరీశ్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. హరీశ్‌తో మూడు గంటల పాటు చర్చించారు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే నర్సారెడ్డి దిల్లీ వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నర్సారెడ్డి తెరాసలో చేరి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియామకమైన తర్వాత కూడా హరీశ్‌ను కలిసిన తెల్లవారే ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దానికి కారణమేంటో వాళ్లకే తెలియాలి. హరీశ్‌, కేసీఆర్‌ మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పులా ఉన్నాయా? తుపానుకు ముందు వచ్చే ప్రశాంతతలా ఉందా? విచ్ఛిన్నమయ్యే ముందు నిశ్శబ్ధమా? ఈ విషయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి. మంత్రుల క్వార్టర్స్‌ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలన్నీ బయటపెట్టాలని డిమాండ్‌‌ చేస్తున్నా. 25న సాయంత్రం 7గంటల నుంచి 9 గంటల వరకు హరీశ్‌రావు నివాసంలోకి వెళ్లిన కార్లు, వచ్చిన కార్లు, వాటిలో ఎవరెవరు వచ్చివెళ్లారో వెల్లడిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌తో పాటు తెలంగాణ సమాజానికీ ఓ స్పష్టత వస్తుంది’’ రేవంత్‌ వ్యాఖ్యానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com