స్నానాలు-దానాలు-జపాలు-పూజలు-కార్తీకం

కార్తీకం.. పుణ్యమాసం – తదితర ఆద్యాత్మిక వార్తలు
స్నానాలు.. దానాలు.. జపాలు.. పూజలు.. ఉపవాస వ్రతాలు.. దీపాలు వెలిగించడం వనభోజనాలు వంటివి చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమానిత్వమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్రం సమీపంలో సంచరిస్తుండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కాగా ఈ ఏడాది కార్తీక మాసం నవంబరు 8వ తేదీ నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఉండనుంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం విశిష్టత, ప్రత్యేకతలపై కథనం.
***కార్తీక స్నానం… పుణ్యప్రదం
కార్తీక మాసంలో నిత్యం నదుల్లో, చెరువుల్లో, కుంటల్లో తెల్లవారుజామునే స్నానమాచరించడం వల్ల పుణ్యం వస్తుంది. రోజు వీలుకానీ వారు సోమవారాలోనూ, శుద్దద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో స్నానాలు ఆచరిస్తే మంచిది. స్నానాంతరం మహావిష్ణువును తులసీదళాలు, జాజిపూలతో, శివున్ని మారేడు దళం, జిల్లేడు పువ్వులతో పూజించి కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం ద్వారా సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు.
**వన భోజనం విశిష్టత
ప్రకృతి వనభోజనం కార్తీకమాసం పూజా విధానాల్లో ముఖ్యమైంది. కార్తీక మాసంలో వనభోజనాలు ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక భావనలు పెంపొందుతాయి. అదేవిధంగా దీని ద్వారా సమైఖ్యత, చక్కని ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. వనభోజనాల్లో భాగంగా ఉసిరిక, అశ్వద్ధా, బిల్వా తదితర వృక్షాల నీడన ఆరగించడం ద్వారా ఆయా వృక్షాల నుంచి వీచే గాలులు శరీర ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి.
**సత్యనారాయణస్వామి వ్రత మహత్మ్యం
అన్ని వ్రతాల్లోకెల్లా సత్యనారాయణస్వామి వ్రతానికి విశిష్టమైన ప్రత్యేకత ఉంది. అందులోనూ ఈ మాసంలో వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. హరిహరులకు ప్రీతికరమైన మాసం కనుక ఈమాసంలో ఈ వ్రతాన్ని విశేషమైన రోజుల్లో ఆచరిస్తే సకల ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు ఆ సత్యనారాయణుడు ప్రసాదిస్తాడని ప్రతీతి.
**ఉపవాసఫలం
మాసం అన్ని రోజులు లేదా సోమవారాలు, కార్తీక పౌర్ణమి దినాల్లో ఉండే ఉపవాస దీక్షల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. ఉపవాసం ఉన్న రోజున ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం అనంతరం స్థానిక శివాలయాల్లో, విష్ణువు ఆలయాల్లో దీపారాధన చేసి కార్తీక పురాణం పాటిస్తే పూర్వజన్మ కర్మలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం ఉన్న రోజున పేద వారికి అన్నదానం చేయడం శ్రేయస్సుకరమని పండితులు పేర్కొంటున్నారు.
**గోపూజ.. అన్ని పూజావిధానాలు మాదిరిగానే గోపూజకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భగవంతుడి అనుగ్రహం తేలికగా పొందడానికి గోపూజ దోహదపడుతుంది. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తు అమ్మవారిని పూజించినట్లే. ముక్కోటి దేవతలు గోవులో నిక్షిప్తమై ఉంటాయి. కార్తీక మాసంలో గోవుకు పూజ చేయడం వల్ల సకల దేవతానుగ్రహం పొందవచ్చు.
**దీపారాధన… సర్వపాప హరణ
కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే స్నానమాచరించాలి. అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. స్నానానంతరం దీపాలను వెలిగిస్తే సర్వపాపాలు హరించిపోతాయని ప్రతీతి. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో లేదా పౌర్ణమినాడు సాయంకాలం సమయాల్లో ఉసిరి కాయపైన వత్తులను ఆవునెయ్యితోగాని నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అవిశనూనె, విప్పనూనె, ఆముదంతో గాని వెలిగించి దీపారాధన చేయడం వల్ల ముక్తి లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
**కార్తీక సోమవారం ప్రత్యేకత
ప్రత్యేకపూజ విధానాలను పాటించడం ద్వారా శివానుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. శివుడికి ఇష్టకరమైన రోజు సోమవారం కావడంతో కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు ప్రత్యేకమైనవే. ఈ వారాల్లో ప్రత్యేకమైన వ్రతాలు, దీపారాధన, దైవరాధన, ఉపవాసాలు, దీక్షలు చేపట్టడం ద్వారా శివుడు అనుగ్రహం పొంది మన జీవితంలో ఎదుర్కొంటున్న సకల సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రం చెపుతుంది.
**వరుస పర్వదినాలతో సందడి
కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు, వ్రతాలే కాదు. పర్వదినాలకు ప్రత్యేకస్థానం ఉంది. ఈఏడాది వచ్చే పర్వదినాలు వరుసగా ఇలా రానున్నాయి. 11న నాగులచవితి, 12న నాగుల పంచమి, 23న కార్తీక పౌర్ణమి రానుంది. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాల రోజున భక్తులు నాగులపుట్టకు విశేష పూజలను జరుపుతారు.
**అయ్యప్ప మాలధారుల శరణుఘోష
ఈ మాసంలో మాలధారణ చేసి ఉపవాసదీక్షలతో పాటు భజనలు, వ్రతాల్లో పాల్గొంటే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షన్నర మందికి పైగా భక్తులు అయ్యప్పమాలధారణ చేస్తుండగా ప్రత్యేకంగా కార్తీక మాసంలో 60వేల మందికిపైగా మాలధారణ చేస్తారని అంచనా.
1. డిసెంబరు 18న ముక్కోటి ఏకాదశి
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 4న శ్రీ వైష్ణవ బహుళ ఏకాదశి సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నారు. ఆ రోజు స్వామికి పవళింపు సేవ ఉండదు. 6న నరక చతుర్దశి సందర్భంగా తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి సుప్రభాతం నిర్వహించి మంగళ స్నానాదులను కొనసాగిస్తారు. ప్రధాన కోవెలలో మూలమూర్తులకు అభిషేకం ఉంటుంది. అదే రోజు చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం చేయనున్నట్లు స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకుడు జగన్నాథాచార్యులు తెలిపారు. 7న దీపావళి సందర్భంగా రామయ్యకు పవళింపు సేవ ఉండదని తెలిపారు. డిసెంబరు 8 నుంచి 16 వరకు స్వామివారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. 17న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నది వద్ద ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయాల్సి ఉంది. నీటిమట్టం పడిపోతున్నందున ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అదే రోజు తిరుమంగై ఆళ్వార్ పరమ పదోత్సవం చేస్తారు. 18న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సీతారాముడు వైకుంఠ ద్వారంలో దర్శనమిస్తాడు. దీన్నే ఉత్తర ద్వార దర్శనం అంటారు. వేలాది మంది భక్తులు సెక్టార్లో కూర్చొని ఈ క్రతువును వీక్షించనున్నారు. దీనికి టిక్కెట్లు ముద్రించాల్సి ఉంది. అదే రోజు నుంచి రాపత్తు ఉత్సవాలు ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2న విశ్వరూప సేవ నిర్వహించనున్నారు.
2. కొండంత విలువ
కొండకు వెంట్రుక వేశాను… వస్తే కొండ పోతే వెంట్రుక… అని సామెత. వెంట్రుక అంటే మనవాళ్లకు వెంట్రుకతో సమానం. అందుకే ‘నువ్వు నాకు వెంట్రుకతో సమానం’ అని తీసి పడేస్తుంటాం. తల నిండా నెల తిరిగే సరికి గుట్టలు గుట్టలుగా ఉత్తపుణ్యానికి వెంట్రుకలు పెరిగిపోతాయి కనుక మనకు వెంట్రుకలంటే లెక్కలేదు. కాని ప్రపంచంలో తల మీద వెంట్రుకలు లేని వాళ్లు, మొలవని వాళ్లు, మొలిచినా రాలిపోయిన వాళ్లు ఒక్కో వెంట్రుక కోసం అర్రులు చాస్తూ ఉంటారు. తల మీద వెంట్రుకలు అందానికే కాదు ఆత్మ విశ్వాసానికి కూడా చిహ్నం. ఈ ఒక్క పాయింట్ మీదే ప్రపంచంలో వేల కోట్ల రూపాయల వెంట్రుకల వ్యాపారం జరుగుతోంది. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే… అంతగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.ఇందులో మంచి వార్త ఏమిటంటే ప్రపంచానికి అవసరమైన వెంట్రుకల ఎగుమతిలో 80 శాతం వాటాతో భారతదేశం ముందు వరుసలో ఉంది. మరి ఈ వెంట్రుకలు ఎక్కడి నుంచి వస్తాయి? మన సంప్రదాయమే. హైందవ సాంప్రదాయంలో తల నీలాలు సమర్పించడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. తన అహాన్ని, భగవంతుని ముందు తల ఒంచి తల నీలాలు ఇవ్వడం ద్వారా ఆత్మని అర్పిస్తాడు భక్తుడు. ఇలా భారతదేశంలోని ఆలయాలకు చేరుతున్న టన్నుల కొద్ది వెంట్రుకలు భారతదేశానికి వేల కోట్ల రూపాయల రాబడిని సంపాదించి పెడుతున్నాయి.
**ఏడాదికి 1300 టన్నులు
భారతదేశం నుంచి సంవత్సరానికి దాదాపు 1300 టన్నుల శిరోజాలు ప్రపంచానికి ఎగుమతి అవుతన్నాయని అంచనా. దేశంలో 200 సంస్థలు ఈ వ్యాపారంలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం చెన్నైలో ఉన్నాయి. విదేశీ ఎగుమతుల ద్వారా కాని దేశీయ మార్కెట్ వల్లగానీ మొత్తం మీద మన దేశంలో 2500 కోట్ల వ్యాపారం వెంట్రుకల మీద జరుగుతోంది. మళ్లీ ఇందులో సంవత్సరానికి 10 నుంచి 30 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఇంత వ్యాపారానికి అవసరమైన వెంట్రుకల సేకరణకు ప్రధాన కేంద్రం వేరే ఏదో కాదు… మన తిరుపతి కొండే. రోజుకు సగటున 25 వేల మంది అర్పిస్తున్న తల నీలాల ద్వారా సంవత్సరానికి 700 నుంచి 1000 కోట్ల రాబడి సమకూరుతోంది.
**చైనా పోటీ
చైనా వాళ్ల తల వెంట్రుకలు భారతీయుల వెంట్రుకలతో పోల్చితే రెట్టింపు మందంగా ఉంటాయి. ఇవి విగ్గుల తయారీలో బాగా ఉపయోగ పడతాయి. అయితే వీటిని మెత్తగా చూపించాలంటే మాత్రం భారతీయ శిరోజాలను కలపక తప్పదు. ఎగుమతుల్లో భారత్ ముందంజలో ఉన్నా వ్యాపారంలో మాత్రం చైనా భారీ లాభాల్లో ఉంది. దీనికి కారణం అక్కడ వెంట్రుకలతో తయారయ్యే ఉత్పత్తుల కర్మాగారాలు ఎక్కువగా ఉన్నాయి. మనం వెంట్రుకలను విక్రయిస్తుంటే అది వెంట్రుకలతో తయారయ్యే విగ్గులను, సవరాలను, వంకీల జుట్టు వరుసలను విక్రయిస్తోంది. కనుక ఇక మీద తల దువ్వుకున్నప్పుడు దువ్వెనలో వెంట్రుక కనిపిస్తే తీసి పడేయకండి. నాలుగు వెంట్రుకలు వెనకేసి సిరి మూటగట్టుకోవచ్చని గ్రహించండి.
**రెండు రకాలు
వెంట్రుకలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ఇళ్ల నుంచి సేకరించినవి. ఇవి పొట్టిగా చిక్కుతో ఉంటాయి. మరొకటి తల నీలాల ద్వారా సేకరించినవి. ఇవి పొడవుగా శుద్ధి చేయడానికి అనువుగా ఉంటాయి. శుద్ధి చేసిన వెంట్రుకలు 7 నుంచి 11 అంగుళాల పొడవు ఉన్నవి కిలో 7000 రూపాయలు పలుకుతున్నాయి. 30 అంగుళాల పొడువున్న వెంట్రుకలు కిలో 50 వేలు ధర చేస్తున్నాయి.
3. ముక్కోటి దేవతలకు ఆహ్వానమే -ధ్వజారోహణం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు… తిరుమల సప్తగిరులపై వెలసి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్న కలియుగ దైవం వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగే ధ్వజారోహణ ప్రక్రియ పవిత్రమైనది, విశిష్టమైనది, విశేషమైనది. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ఉత్సవ ఆరంభంలో అంకురార్పణ జరుగుతుంది. ఆ మరుసటిరోజున సాయంకాల శుభ ముహూర్తాన ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణ వైభవాన్ని శ్రీవైఖానస భగవత్ శాస్త్ర పురాణాలలో విపులంగా వివరించారు.
**ధ్వజారోహణం ఎందుకు చేస్తారంటే…
‘‘జయం కరోతి దేవానం ధ్వం సయిత్యా సురానా ధ్వం సనాశ్చ జయౖశ్చైవ «ధ్వజమిత్యభిధీయతే’’సకల దేవతలకు జయం కలిగించి అసురులను నాశనం చేయాలనే సంకల్పంతో ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలందరినీ ఆహ్వానించే నేపథ్యంలో కార్పాసం (నూలు)తో చేసి, 14, 15, 16 హస్తాల పొడవు, 3, 4, 5 జానల వెడల్పుతో లేదా స్వామివారి పాదాలు, గర్భాలయ ద్వారానికి సమంగా 5, 3 హస్తాల వెడల్పుతో ఉండేటట్లు ఒక వస్త్రాన్ని తీసుకుని నీటితో శుభ్రం చేస్తారు. ఈ వస్త్రంలో గరుత్మంతుడు ఆకాశానికి ఎగురుతున్నట్లు చిత్రిస్తారు. అనంతరం అగ్నిగుండం ముందు వాస్తు హోమం, వాస్తు పర్యగ్నీకరణ ఆచరిస్తారు. అంగ హోమం చేసి పంచద్రవ్యం, క్షీరం, జలంతో ప్రోక్షణ చేసి గరుత్మంతుడున్న వస్త్రధ్వజాన్ని మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తారు. స్వామివారికి, అమ్మవార్లకు వస్త్రంపై లిఖించిన గరుత్మంతునికి కంకణధారణ గావించి గరుడ, విష్వక్సేన చక్రాలను అర్చిస్తారు. ఆ తరువాత డోలు వాద్యకారుని భేరీపూజతో భేరీ తాడనం చేయిస్తారు. స్వామివారిని ఉభయ దేవేరులతో నవసంధి బలిప్రకరణం కోసం ఉత్సవం చేసేందుకు తిరుచ్చిపై ప్రతిష్ఠిస్తారు. విష్వక్సేన, చక్రసహితంగా గరుడ పటాన్ని ఊరేగింపునకు స్వామివారికి, అభిముఖంగా ఉండేలా ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆచార్యులు, రుత్వికులు బలిహరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక పాత్రలో బలిని(అన్నమును) సంగ్రహించి స్వామివారి గర్భాలయం మొదలుకొని మొదటి సంపంగి ప్రాకరణం, రెండవ ప్రాకరణలలో బలిహరణ గావిస్తారు.మహా ద్వారం నుండి బయటకు వచ్చి ప్రాకరణములలో ఉన్న బ్రహ్మాది అష్ట దిక్పాలకులను గద్య, పద్య, వాద్య, తాళ, గీతాలతో ఆవాహన గావించి బలిహరణ సమర్పిస్తారు. తర్వాత కొలతలు ధ్వజస్తంభానికి రెండింతలు ఉండేలా నూలు పగ్గాన్ని తీసుకుని వస్త్రంపై లిఖించిన గరుడ పటాన్ని స్వామివారి శేషమాలతో బంధిస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి దగ్గరగా ధ్వజ పటాన్ని ఉంచుతారు. ముందుగా ధ్వజస్తంభాన్ని జయ, అత్యుచ్ఛ్రిత, ధన్య, ధ్వజ అనే నాలుగు నామాలతో ఆవాహన చేసి అర్చిస్తారు. తదనంతరం పటలిఖిత గరుత్మంతునిలో ‘గరుడ పక్షిరాజ సువర్ణపక్ష ఖగాధిప’ అనే నాలుగు నామాలతో మంత్రోచ్చారణ మధ్య అర్చిస్తారు. ముద్గాన్నం (కట్టె పొంగలి) నివేదన చేసి యజమానిచే సంకల్పం ఆచరించి ఆచార్యులు యాత్రాదానం స్వీకరిస్తారు. ఆ సుముహూర్తాన స్వామివారి బ్రహ్మోత్సవ సంబరాలకు ముక్కోటి దేవతలందరినీ ఆహ్వానించేందుకు జయజయధ్వానాలు, మంగళవాద్య, వేదఘోషలు పఠిస్తూ గరుత్మంతుని ధ్వజస్తంభం పైకి ఎగురవేస్తారు. అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.
**ధ్వజారోహణ దర్శనం సంతానప్రాప్తికి మార్గం
సంతానం లేనివారు ఈ ప్రసాదాన్ని స్వీకరించడంతో సంతాన యోగం కలుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమై తొమ్మిదవ రోజు చేపట్టే ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల ప్రారంభం నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అనేక వాహనాల్లో స్వామివారు విహరిస్తూ భక్తకోటికి దర్శనభాగ్యం కలిగిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరగా చక్రస్నానం ఆచరిస్తారు. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఎవరైతే వాహనాలపై విహరిస్తున్న స్వామివారిని వీక్షిస్తారో వారికి పునర్జన్మ ఉండదని వైఖానస ఆగమ శాస్త్రాలలో చెప్పబడింది. ‘‘వైఖానసార్య దివ్యాజ్ఞావర్థతా మభివర్థతాం’’
4. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత కలిగిన కార్తీక మాసం ఈ రోజుతో ప్రారంభమైంది. దీపావళి పండగ మరుసటి రోజు వచ్చే పాడ్యమితో కార్తీక మాసం ప్రారంభమవుతోంది. దీంతో నిన్న రాత్రి దీపావళి సంబరాల్లో మునిగిపోయిన ప్రజలు ఈరోజు తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. శివనామస్మరణతో శివాలయాలన్నీ మార్మోగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తితో పాటు పంచారామ క్షేత్రాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని క్షేత్రాలు కార్తీక శోభ సంతరించుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిలో భక్తులు వేల సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి పరమ శివుడిని దర్శించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో విడిచారు. తెలంగాణలోని కీసర, వేములవాడ, చెరువుగట్లు, కాళేశ్వరం తదితర క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
5. కీసరగుట్టలో ఈనెల 8వ తేదీ నుంచి కార్తీకమాస పూజలు
నవంబర్‌ 8న ఆకాశదిపోత్సవం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కల్యాణం, 9న క్షీరాభిషేకం, 10న క్షీరాభిషేకం, 11న నాగుల చవితి, వాల్మీకి పూజ, పంచామృత అభిషేకం, 12న చెరుకు రసంతో అభిషేకం, 13న శ్రీ సుబ్రహ్మాణ్యేశ్వర స్వామి కల్యాణం, 17న క్షీరాభిషేకం, యథాశక్తి భిల్వార్చ న , 18న తేనే అభిషేకం, 19న సత్యనారాయణ స్వామి వత్రం, గంధాభిషేకం, 23న నానావిధ పుష్పార్చన, మహాలింగ దీపోత్సవం, జ్వాలా తో రణం, 24న నానవిధ ఫలరసాభిషేకం, 25న పంచామృతాభిషేకం, 26 క్షీరాభిషేకం, రామలింగేశ్వరస్వామివారి కల్యాణోత్సవం, డిసెంబర్‌ 1న ప చామృతభిషేకం, 2న చక్కరతో అభిషేకం, క్షీరాభి షేకం, 3న సత్యనారాయణ స్వామి వత్రం, క్షీ రాభిషేకం, 5న రుద్రహోమము, 7న తైలాభిషేకం, అన్న పూజతో కార్తీకమాసోత్సవాలు ముగుస్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com