Movies

రాశి నిరాశ

రాశి నిరాశ

‘‘నటిగా నేనేం చేయగలను? మహిళా సమస్యలు ఇతివృత్తాలుగా రూపొందే చిత్రాల్లో నటించగలను. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రయత్నించగలను. అయితే… రోజు రోజుకీ మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు, నేరాలు అరికట్టాలన్నా… కనీసం తగ్గుముఖం పట్టాలన్నా… ఈ ప్రయత్నాలు సరిపోవు’’ అని రాశీ ఖన్నా అన్నారు. న్యాయవ్యవస్థలో మార్పు మాత్రమే మహిళలకు సహాయం చేయగలదని, పరిస్థితుల్లో మార్పుకు దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. గత నెలలో పొల్లాచ్చిలో వెలుగు చూసిన సెక్స్‌ రాకెట్‌పై గతంలో రాశీ ఖన్నా ట్వీట్‌ చేశారు. నిందుతుల వెన్నులో వణుకుపుట్టేలా శిక్షించాలన్నారు. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’కి రీమేక్‌గా తమిళంలో రూపొందుతోన్న ‘అయోగ్య’లో నటిస్తున్నారామె. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘‘మహిళలపై వేధింపులు తగ్గాలంటే బలమైన న్యాయవ్యవస్థ కావాలి. త్వరితగతిన విచారణ చేపట్టి కఠిన శిక్షలు విధించాలి. త్వరగా శిక్షలు అమలయ్యేలా చూడాలి. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి నటిగా నా వంతు నేను ప్రయత్నిస్తున్నా. సమాజంలో సినిమాల ప్రభావం కొంతవరకూ ఉంటుంది. తెరపై మేం ఏం చూపిస్తున్నామనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు.