తెలంగాణలో ఎన్నికల రణరంగం-TNI కథనాలు

1. కూటమి ఎత్తులకు తెరాస పైఎత్తులు-పక్కా వ్యూహంతో ప్రచారానికి..
మహాకూటమి వ్యూహాలను నిరంతరం విశ్లేషిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఎత్తులకు, పైఎత్తులు వేస్తోంది. కూటమి ఎత్తులను సునిశితంగా గమనిస్తూ.. వాటికి అనుగుణంగా పైఎత్తులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈనెల 9న మహాకూటమి అభ్యర్థులను ప్రకటిస్తే.. అదే రోజు లేదా 10న తేదీన గులాబీ పార్టీ కూడా తుది జాబితా వెల్లడించనుంది. గురువారం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలున్నందున.. శుక్రవారం పూర్తి స్థాయి ఎన్నికల హామీలను ప్రకటించేందుకు తెరాస కసరత్తు చేస్తోంది. సోనియా గాంధీ, రాహుల్, చంద్రబాబు సభలకు అనుగుణంగా కేసీఆర్ సభల షెడ్యూలు ఖరారు చేసేందుకు వ్యూహాలను రూపొందిస్తోంది.
2. కూటమిలో ‘మహా’ ప్రతిష్టంభన
మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీపావళి నాటికి స్పష్టత వస్తుందని భావించినప్పటికీ సీపీఐ, తెలంగాణా జనసమితి సీట్ల వ్యవహారం తేలలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై సీపీఐ, తెజస పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహాకూటమి సీట్ల సర్దుబాటు, తెజస, సీపీఐకి ప్రతిపాదించిన స్థానాలపై కోదండరాం, సీపీఐ నేతలు ఇవాళ హైదరాబాద్లో సమావేశమై చర్చించారు.
3. కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు-15 చోట్ల పెండింగ్
తెలంగాణ అభ్యర్థులపై కాంగ్రెస్ వార్ రూమ్లో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. నిన్న దాదాపు 14 గంటలపాటు, ఈరోజు 4 గంటలపాటు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఒకరి కంటే ఎక్కువగా పోటీ ఉన్న 15 నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పార్టీ పూర్తి చేసింది. తేలని 15 నియోజకవర్గాలపై సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు చర్చించనుంది. ఈ భేటీలో మొత్తం జాబితాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తుది జాబితాను ప్రకటించే ముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డితో చర్చించే అవకాశముంది.
4. కేసీఆర్ రాజకీయ వారసుడిగా హరీశ్ను ప్రకటించగలరా?
తెరాస అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడిగా మంత్రి హరీశ్రావును కేటీఆర్ ప్రకటిస్తే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అధికార దాహంతోనే కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వరంగల్లో ఆయన ఆరోపించారు. ‘‘మీ బావంటే మీకు ఇష్టం ఉన్నప్పుడు తొలి నుంచి కేసీఆర్కు అండగా ఉన్న హరీశ్ను సీఎం రాజకీయ వారసుడిగా మీరు ప్రకటిస్తారా? ఆ దమ్ము, ధైర్యం ఉందా? నీతి, నిజాయతీని నిరూపించుకోవాలంటే ముందు ఆ ప్రకటన చేయండి. అలా చేస్తే ఇప్పటివరకు నేను మాట్లాడినవన్నీ భేషరతుగా ఉపసంహరించుకుంటా. చంద్రబాబును వెన్నుపోటుదారుడు అని విమర్శిస్తే ప్రజలే రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పడం ఖాయం’’ అని రేవూరి అన్నారు.
5. వచ్చేది ప్రజాపాలనే -తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన పోయి ప్రజాపాలన వస్తుందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మంగళవారం మహాకూటమికి మద్దతుగా జగిత్యాలలో జరిగిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిందన్నారు. నీళ్లు నిధులు, నియామకాలను మరచి అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో 20 వేల ఉపాధ్యాయ నియామకాలు జరపడమే కాకుండా విద్యాసంస్థలకు విద్యుత్తు, పన్ను రాయితీలు కల్పిస్తామన్నారు.
6. తెలంగాణ జనసమితికి 11 సీట్లు?
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితికి 11 సీట్లలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరికొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ చెప్పినట్లు తెజస ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీపై తెలంగాణ జనసమితి కోర్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై తెజస అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు దిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్లు సమాచారం.
7. ఎందరు ఎమ్మెల్యేలు వచ్చినా తాగునీరు ఇవ్వలేదు
కేసీఆర్ను గెలిపించుకున్నాక అభివృద్ధిలో గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో నిర్వహించిన నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో నీటికొరత స్పష్టంగా కన్పించేదని, ఇప్పుడా సమస్యేలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. గజ్వేల్లో 65 ఏళ్లు పలు పార్టీలనుంచి ఎందరో ఎమ్మెల్యేలు వచ్చి పోయారని, ఇంతమంది వచ్చినా తాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. నీటి ట్యాంకర్లు వచ్చినప్పుడు బిందెలు కొట్లాడాయి.. ఆడపడుచులు కొట్లాడుకునేవారన్నారు. కానీ, రోజు గజ్వేల్లో ఆ పరిస్థితిలేదన్నారు. ఇక్కడి ప్రజలతో స్వచ్ఛమైన నీరు తాగించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. 65 ఏళ్లలో ఏ ఎమ్మెల్యే చేయని పనిని 4 ఏళ్లలో కేసీఆర్ చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకున్నారన్నారు.
8. కాంగ్రెస్ లీకులపై సీపీఐ సీరియస్
టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల పంపిణీపై భాగస్వామ్య పక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీట్ల విషయంలో కాంగ్రెస్ లీకులతో తాము తీవ్ర అసంతృప్తి చెందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది సీట్లు కావాలని తాము డిమాండ్ చేశామని.. సీపీఐకి ఎంతో కీలకమైన కొత్తగూడెం స్థానంపై తాము సీరియస్గా ఉన్నామని చాడ పేర్కొన్నారు. దీనిపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాధాన్యత గల సీట్లను ఇవ్వకపోతే కూటమిపై తాము పునరాలోచించుకుంటామని తేల్చిచెప్పారు. సీట్ల విషయంపై తమ పార్టీ శుక్రవారం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని చాడ ప్రకటించారు. కొత్తగూడెం సీటు ఇస్తామని ఒకసారి.. ఇవ్వమని మరోసారి కాంగ్రెస్ లీకులు ఇస్తోందని వాటిపై తాము తీవ్ర అసంతృప్తి చెందామని అన్నారు.
9. వాడివేడిగా వడపోత..
తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయం కుదరని సీట్లపై చర్చలు కొనసాగిస్తోంది. దేవరకొండ, తుంగతుర్తి, ములుగు సహా దాదాపు 20 అసెంబ్లీ స్ధానాల విషయంలో అభ్యర్ధుల పేర్లను సీనియర్ నేతలు పోటాపోటీగా ప్రతిపాదిస్తుండటంతో అభ్యర్ధుల ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. పలు నియోజకవర్గాలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి-జానారెడ్డిల నుంచి భిన్నమైన పేర్లు ప్రతిపాదిస్తున్నారు.
10. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి. ‌
తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ప్రజలకు అభ్యంతరాలున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను పెంచుకున్న చంద్రబాబు.. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు రాసిన లేఖ విడుదల చేశారు.
11. మహాకూటమిని చూస్తే కేసీఆర్‌కు భయం- రమణ
మహాకూటమిని చూస్తే తెరాసకు భయమేస్తోందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. అమరావతిలో చంద్రబాబును కలిసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిదే విజయమని.. కేసీఆర్‌, తెరాసను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. కేంద్రంలో నియంతృత్వ సర్కారును గద్దె దించేందుకు చంద్రబాబునాయుడు నడుం బిగించారని… దీనిలో భాగంగానే ఆయన భాజపాయేతర పార్టీలను ఏకం చేస్తున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర చంద్రబాబుకు ఉందని.. ప్రస్తుతం మరోసారి ఆయన జాతీయ రాజకీయాలను శాసిస్తారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకే మహాకూటమి ఏర్పాటైందన్నారు. సీట్ల సర్దుబాటుపై ఓ స్పష్టత వచ్చిందని… ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన వస్తుందన్నారు.
12. మహాకూటమిదే విజయం- రావుల
జాతీయ రాజకీయాల్లో తమ అధినేత చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారని తెలంగాణ తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. భాజపా వ్యతిరేక శక్తులన్నింటిని ఏకం చేసే కార్యాచరణలో భాగంగా ఆయన చేస్తున్న కృషిని అందరూ గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు తెతెదేపా నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితర నేతలు ఈరోజు అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా రావుల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలపై చంద్రబాబుకు స్పష్టమైన అవగాహన ఉందని.. ఆయన ఆదేశాల మేరకు ఎన్నికల్లో నడుచుకుంటామన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com