నినాదాల ఘోషలో భాష మరణిస్తోంది! తెలుగు తల్లి దుఃఖిస్తోంది!

ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, మారిషస్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా ఇలా ఎక్కడకు వెళ్లినా అక్కడ తెలుగు వారు తమ భాషా సంస్కృతులను కాపాడుకునేందుకు చేస్తున్న కృషి చూసి నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అనేక దేశాల్లో తెలుగు వారు తమ పిల్లలకు తెలుగు నేర్పేందుకు తహతహ లాడుతున్నారు. ఆ దేశాల్లో తెలుగు సదస్సు లకు హాజరైనప్పుడు అక్కడి పిల్లలు చక్కటి తెలుగు లో మాట్లాడుతుండడం విని నేను దిగ్భ్రమ చెందుతుంటాను. ఇవాళ ఇక్కడ మెల్బోర్న్ లో వంగూరి చిట్టెం రాజు ఆధ్వర్యం లో వంగూరి ఫౌండేషన్, లోకనాయక్ ఫౌండేషన్, ఆస్ట్రేలియా తెలుగు సంఘం కలిసికట్టుగా ఏర్పాటు చేసిన ఆరవ ప్రపంచ సాహితీ సదస్సు లో ఆస్ట్రేలియా లోని వివిధ ప్రాంతాలకు చెందిన పెద్దలూ, పిల్లలూ పాల్గొని దాన్ని విజయవంతం చేయడం చిన్న విషయం కాదు. కానీ నేనూ నా రాష్ట్రం నుంచి మీకు ఈ సందేశం ఇవ్వగలను? ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు భాషా సంస్కృతులు అద్భుతంగా పరిఢవిల్లుతున్నాయని చెపితే అది నన్ను నేను మోసగించుకున్నట్లవుతుంది. గత కొన్నేళ్లు గా తెలుగు వాడిగా పుట్టినందుకు తెలుగు భాషకు ఎంతో కొంత ఉడతా భక్తిగా కొంత సేవ చేస్తున్నాను. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి దానికి ప్రాచీన హోదా కల్పించేందుకు నా వంతు కృషి చేశాను. దానికోసం ఎన్నో ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. అనేక విదేశీ యూనివర్సిటీల్లో, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో తెలుగును పాఠ్యాంశంగా కొనసాగించేందుకు నా సహాయ సహకారాల్ని అందించాను. పార్లమెంట్ లో రాజభాషా కమిటీ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ రాజ్యసభలో నేను లేవనెత్తిన ప్రశ్నల్లో తెలుగు భాష, తెలుగు కీర్తి బావుటాను ఎగురవేసిన సాహితీమూర్తుల గురించే అత్యధికం ఉన్నాయి. నా ఎంపి నిధుల్లో అత్యధికం తెలుగు భాష సుసంపన్నం చేసేందుకే ఉపయోగించాను.ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర తో పాటు మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం వంటి ప్రముఖ పుస్తకాలను హిందీలోకి అనువదింప జేసి తెలుగు వారి ఔన్నత్యాన్ని ఉత్తర భారతాన చాటాను.నా వంతు కృషిగా ఎన్నో హిందీ రచనలు తెలుగులోకి, తెలుగు రచనలు హిందీలోకి అనువదించాను.లోక్ నాయక్ ఫౌండేషన్ స్థాపించి గత రెండు దశాబ్దాలుగా జ్ఞానపీఠ పురస్కారంతో సమానమైన పురస్కారాలను తెలుగు వారికి అందజేసి నా రుణం తీర్చుకున్నాను. ఆధునిక భాషగా తెలుగు కు గుర్తింపునచ్చి, విశ్వనాటకంగా గుర్తించదగ్గ కన్యాశుల్కం అనే మహా రచన రచించిన గురజాడ అప్పారావు నివసించిన ఇల్లును పునరుద్దరించాలని పోరాడాను. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత , మహాకవి సి. నారాయణ రెడ్డి విగ్రహాన్ని విశాఖ కూడలిలో నెలకొల్పేందుకు తోడ్పడ్డాను. కొప్పరవు కవులు, పురిపండా అప్పలస్వామి, తిపతివెంకట కవులు విశ్వనాధ సత్యనారాయణ జాషవా సి నారాయణ రెడ్డి గార్ల విగ్రహాల స్థాపనకు కృషి చేశాను.తెలుగు భాష పరిరక్షణకై పాదయాత్రలు చేశాను. ఎన్నో సమావేశాలు నిర్వహించాను. ఎన్నో రచనలు చేశాను. యూనివర్సిటీలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇంగ్లీషు బోర్డులు పెట్టినప్పుడల్లా నిరసన ప్రదర్శనలు నిర్వహించాను. నిరాహార దీక్షలు చేశాను. అన్నిటి ఉద్దేశం తెలుగుభాష మనుగడకోసమే. చేసిన వాటిని చెప్పుకోవాలన్న దుగ్ధ నాకెప్పుడూ లేదు. కాని ఇవాళ ఆస్ట్రేలియా లో మెల్ బోర్న్ లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వేదికగా నా హృదయ భారాన్ని దించుకోవాలనుకుంటున్నాను. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఒక రాష్ట్రం తెలంగాణ పేరుతో, మరో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పరిపాలన సాగుతున్నాయి. కానీ తెలంగాణలో తెలుగు వెలిగిపోతున్నది. ఆంధ్ర అనే పేరును మకుటంగా దాల్చిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు తల్లి ముఖం వెలవెలబోతోంది. ఇక్కడ ఒక ఖండంలో, పరాయిగడ్డపై, మన స్వంత ప్రాంతాలను విడిచివచ్చిన మీరు ఒక్కటై తెలుగుభాషను సంస్కృతినీ అద్భుతంగా కాపాడుతూ, ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నందుకు నేను పులకించి పోతున్నాను. కాని అదే సమయంలో మాతృభూమిలో తెలుగు భాష పరిస్థితిని తలుచుకుని నాకు దుఃఖం కలుగుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడేభాష అయినప్పటికీ ప్రాంతీయభాషగా తెలుగు అత్యంత నిరాదరణకు గురైంది. అన్నింటా అధికారభాషగా ఉర్దూ పీఠం వేసుకుంది. పుట్టుకతో అతి సహజంగా నాలుకలమీద కదలాడే అమ్మభాషకోసం తెలంగాణలో నాటితరం భారీ ఉద్యమాలు, పెనుపోరాటాలు చేయాల్సి వచ్చింది. తెలుగు ప్రజలకు కనీసం సభలూ సమావేశాలు జరుపుకునే స్వేచ్చ కూడా ఉండేది కాదు. తెలుగు పత్రిక స్థాపించాలంటే అందులో తెలుగు, ఆంధ్ర అనే పదాలు ఉండకూడదు.ఇందుకోసం కొమర్రాజు లక్ష్మణ రావు, మాడపాటి హనుమంతరావు, ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాప రెడ్డి లాంటివారెంతో కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుకు అత్యున్నత స్థాయిని కల్పించారు. ఢిల్లీలోనూ, ప్రపంచ దేశాల్లోనూ తెలుగు వారంటే ఏమిటో చాటి చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిచారు.జలగం వెంగళరావు గారు ప్రధమ ప్రపంచ మహో సభలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంఘాలు పురుడు పోసుకోవడానికి దోహదం చేశారు. కాని ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత నందమూరి వారసులు గా చెప్పుకుంటున్నవారి రాష్ట్రంలో, అమరావతిని రాజధానిగా నెలకోల్పామని చెప్పకుంటున్న వారి రాష్ట్రంలో, జరుగుతున్నదేమిటి? ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో తెలుగుకు ఆదరణ తగ్గినట్లు ఇవాళ అమరావతి రాజధానిగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుకు ఆదరణ తగ్గిపోతోంది. ఇవాళ తెలంగాణగా ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకూ తెలుగును తప్పని సరి పాఠ్యాంశంగా మార్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీఓ నంబర్ 21ను విడుదల చేసింది. ఈ మేరకు చట్టాన్ని ప్రవేశపెట్టింది. మన మాతృభాషను, మన సంస్కృతిని గౌరవించడం మన కర్తవ్యం.. అందుకే తెలుగులో తప్పనిసరిగా బోధన జరగాలని ఆదేశాలు జారీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి దేశ విదేశాలనుంచి తెలుగు సాహితీవేత్తలను పిలిపి సత్కరించిన ఘనత కూడా కెసిఆర్ కే దక్కుతుంది. అందుకు ఆయనను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకప్పుడు నిజాం ఆధ్వర్యంలోని తెలంగాణలో తెలుగు నేర్చుకుంటామని తెలుగు ప్రజలే ధైర్యంగా చెప్పలేని పరిస్థితులు కొనసాగితే ఇప్పుడు కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణలో తెలుగు భాషకు ప్రభుత్వమే పెద్ద పీటవేయడం సంతోషకరం. కాని తెలుగు వాడి ఆత్మగౌరవమే తమ ప్రాణంగా భావించి, తెలుగువాడి ఉనికిని చాటి చెప్పిన ఎన్డీఆర్ వారసులు నడుపుతున్న ప్రభుత్వంలో తెలుగు భాష అమలు మాటేమిటి? రాయప్రోలు

నందనోద్యాన సౌందర్యమ్ము నెగబోయు గోదావరి ముఖాన కోనసీమ
సుఫల సంపత్సస్య సురభియై మెఱయు కృష్ణా రసశ్యామ గుంటూరు సీమ
ధవుని పోరి కదల్చి కవిని నేరిమి గెల్చి మీరిన జాణ నెల్లూరి సీమ
ఆంధ్రదిగ్జయ పతాకాలంకృతమ్మైన రతనాలయంగడి రాయలసీమ

అని గొప్పగా చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతోంది? ఈ దేశంలో భాషనే తమ పేరుగా మార్చుకున్న రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఆంధ్ర ప్రదేశ్. కాని ఈ ప్రదేశాన్ని సార్థకం చేయడానికి మన నాయకులు చేస్తున్న కృషి ఏమిటి? విచిత్రమేమంటే తెలుగు అనే పదాన్ని తన సంస్థకు తగిలించుకున్న ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుని నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ ఆ భాషా పరిరక్షణకు ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రకటించిన వాగ్దానాలను నెరవేర్చిన పరిస్థితులు కనపడడం లేదు. ప్రతి ఏటా ఆగస్టు 29న గిడుగురామమూర్తి జన్మదినం రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వీటి గురించి చర్విత చర్వణంగా లేవనెత్తడం, మళ్లీ కొత్త వాగ్దానాలతో చెవుల తుప్పును వదుల్చుకోవడం తప్ప మరో మార్గం కనపడడం లేదు. ఒకటా, రెండా ఎన్ని వాగ్దానాల ఉల్లంఘనలు? ఎన్ని బూటకపు ప్రకటనలు? పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తామన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు.ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ పాలనా భాషగా తెలుగును అమలుచేస్తామని, నవ్యాంధ్ర లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా పలుసార్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక తెలుగు కేంద్రం ఏర్పాటు చేస్తామని, దానికి పదివేల చదరపు అడుగుల స్థలం కేటాయిస్తామని ఆర్భాటాలు చేశారు. తెలుగు పండితుల శిక్షణా కళాశాలలు ఏర్పాటు చేస్తామని, తెలుగు ప్రాచీన తాళ పత్ర గ్రంథాల డిజిటలీకరణ చేస్తామని ఏవేవో ప్రకటనలు గుప్పించారు. తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని వికీ పీడియా ద్వారా విస్తృత పరుస్తామని ప్రకటించారు. అవసరమైన సాంకేతికతతో తెలుగు విద్యార్థులను ప్రోత్సహిస్తామని, జిల్లాల వారిగా మాండలిక పదకోశాల్ని తయారు చేస్తామని చెప్పారు. ఏ ఒక్కదాన్నీ ఆమలు చేయలేదు. పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి ఆంగ్లభాషపై ఉన్న మమకారంలో నూరో వంతు కూడా తెలుగు భాషపై లేదని చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడాల్సిన అవసరం కనపడడం లేదు . శిలాఫలకాలపై కూడా తెలుగును వెతకాల్సిన దుస్థితి నేడు నెలకొని ఉన్నది. ఇవాళ ప్రభుత్వాన్నీ నేతలను ఎందుకు నిలదీయాల్సి వస్తున్నదంటే, తెలుగు భాషా సంస్కృతుల అభివృద్దికి వారు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు వారే అమలు చేయకపోవడం వల్లే. తెలుగు భాష అంటే తమకు పట్టి లేదని, తమకు ఆంగ్ల భాషా వ్యామోహమే ఉన్నదని, తాము, తమ పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదివారు కనుక ప్రజలను తెలుగులో చదవమని చెప్పే అధికారం తమకు లేదని, తెలుగు నేర్చుకుంటే బతుకు తెరువు లభించదని ఆనాడే ప్రకటించి ఉంటే ఇవాళ వారిని నిలదీసి ఎవరూ అడిగేవారు కాదు. కాని తెలుగు భాషను కాపాడతామని, తెలుగులోనే ప్రధానంగా వ్యవహారాలు సాగిస్తామని 2014లోనే తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాట నిజం కాదా? ఈ వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా? పోనీ ఎన్నికల మేనిఫెస్టో ను ప్రజలు పెద్దగా పట్టించుకోరు.. అందులో రాసిన రాతలన్నీ నీటిపై రాసిన రాతలేనని అనుకోవచ్చు అని అనుకుంటే ఆ తర్వాత చేసిన వాగ్దానాల మాటేమిటి? ఒకటో తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు విద్యాసంస్థల్లో తెలుగు భాషను తప్పని సరి చేస్తాం, ఆ మేరకు జీవోలు జారీ చేస్తామని వరుసగా నాలుగేళ్ల పాటు వాగ్దానాలు గుప్పించింది ఎవరో మనకు తెలుసు. అంతేకాదు, మునిసిపల్ పాఠశాల్లో తెలుగు మీడియం లో బోధనను రద్దు చేస్తూ రెండేళ్ల క్రితం జీవో జారీ చేశారు. ఇవాళ మాతృభాష మా జన్మహక్కు అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో మాతృ భాషను ప్రధాన భాషగా విద్యాబోధన చేస్తుంటే మన రాష్ట్రంలో మాతృభాష మీడియంను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంగన్వాడీలలో కూడా తెలుగు లేకుండా చేశారు. తెలుగు భాషను కూకటివేళ్లతో పెకలించేందుకు ఇవాళ ప్రభుత్వంలో మంత్రులు కూడా కంకణం కట్టుకున్నట్లు కనపడుతున్నారు. ఒక కార్పోరేట్, వ్యాపార సంస్కృతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషను పూర్తి కబళించేందుకు ప్రయత్నం చేస్తున్నది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మానస పుత్రిక తెలుగు విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గురజాడ స్మారక భవన నిర్మాణానికి దిక్కు లేదు. తెలుగు ప్రాచీన గ్రంథాలు, సాంస్కృతిక, చారిత్రక గ్రంథాలు, భాషా నిఘంటువులు ఒక్కటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రచురణకు నోచుకోలేదు. మన పొరుగున ఉన్న కర్ణాటకలో పనిచేసే ఏ అధికారి అయినా కన్నడ నేర్చుకోవాల్సిందేనని, కన్నడ భాష రాని అధికారులకు కర్ణాటకలో ఉండే హక్కు లేదని అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించారు, అక్కడ జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆరునెలల్లో కన్నడ నేర్చుకోకపోతే వారిని తొలగించాలని కన్నడ అభివృద్ది సంస్థ ప్రకటించింది. అలాంటి పరిస్థితి మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నదా? ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ భాష ఎలా అమలు అవుతున్నదో తెలుసుకునేందుకు బృందాన్ని పంపిస్తారట. అవసరమా? పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఒక్క ఇమెయిల్ పంపితే సమాచారం రాదా? ప్రతి ఏడాది ఆగస్టు 29 వచ్చే సరికి గంభీరమైన వాగ్దానాలకు కొదవ ఉండదు. ఈ సారి ఆగస్టులో కూడా ఇలాంటి వాగ్దానాలు చేశారు. పాఠశాలలనుంచి ఇంటర్మీడియట్ వరకు మాతృభాష లో విద్యాబోధన తప్పని సరి చేస్తామన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. పాఠశాలలో తెలుగు ప్రవేశించడం మాట దేవుడెరుగు, పసిపిల్లలను కూడా అమ్మా అనే బదులు మమ్మీ అనడమే సరైనదని చెప్పారు. తెలుగు కు పీఠాలు కడతామని మరో వాగ్దానం చేశారు. తీరా చూస్తే ఆ పీఠం సమాధి అన్న విషయం మనకు అర్థమవుతోంది. ప్రత్యేక కేంద్రం కోసం కేటాయిస్తామన్న పదివేల చదరపు అడుగుల భూమి అంటే తెలుగును పూడ్చి పెట్టడానికి ఏడడుగుల స్థలంకోసం అన్వేషణగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇంత కటువుగా భాషా ప్రయోగం చేయాల్సి రావడానికి కారణం ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటినప్పటికీ తెలుగు భాషామతల్లిది అరణ్యరోదనే కావడం. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం కదిలి రాష్ట్రమంతటా తెలుగు అమలుకు కంకణం కట్టుకోవాలి. తెలుగు ప్రాచీన భాషా హోదా కేంద్రాన్ని మైసూరు నుంచి అమరావతికి తరలించేలా చూడాలి. ప్రభుత్వ వ్యవహరాలు తెలుగులో జరిగేలా చూడాలి. ముఖ్యంగా మాతృభాషలో విద్యాబోధన జరగాలి. అప్పుడే తెలుగువాడి ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పినట్లవుతుంది. ఇవాళ తెలుగుభాష ఉనికిని కాపాడేందుకు ప్రభుత్వాలు విదేశాల్లో తెలుగు సంస్థలనుంచి నేర్చుకోవాల్సిన అవసరం కనపడుతోంది. తెలుగు అమలు గురించి అధ్యయనం చేసేందుకు విదేశాలకు ప్రతినిధులు పంపి ఆయా సంస్థలనుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. తెలుగువారికి తెలుగు ప్రాధాన్యత తెలుపుతున్న ఆస్ట్రేలియా తెలుగు సంఘానికి ప్రపంచ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నందుకు అభినందనలు. ఇవాళ ఆంధ్ర్ర ప్రదేశ్ లో తెలుగు తల్లి తనను కబళిస్తున్న భాషా హంతకులనుంచి రక్షించమని విలపిస్తోంది. అమ్మ జోలపాట అంతర్ధానమవుతోంది. చెదలు పట్టిన పెద్ద బాలశిక్ష పుటలు చేతులు చాచి రెపరెపకొట్టుకుంటూ ఆర్తనాదం చేస్తున్నది. నినాదాల ఘోషలోభాష మరణిస్తోంది. వాగ్దానాల హోరులో అక్షరాల ఆర్తనాదం కలిసిపోయింది. కూలిన పాఠశాల భవనాల మధ్య మహాకవులూ, కవిసామ్రాట్టులూ కవిత్రయాలూ, కవికోకిలలూ ఆత్మలై సంభాషిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కాక తెలంగాణలోనో, అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనో, మారిషస్ లోనో పుడితే మళ్లీ జీవిస్తామేమో నని చర్చించుకుంటున్నాయి.

(నవంబర్ 3,4 తేదీల్లో ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు లో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చేసిన ప్రసంగం)

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com