* రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మతాలు, కులాల మధ్య ద్వేషాలు పెంచేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని.. ఈ విషయంలో ఎవరినీ లెక్కచేయవద్దని సీఎం ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. రాజకీయ దురుద్దేశాలతో అర్ధరాత్రి ఆలయాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారన్నారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని.. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారని ఆక్షేపించారు. వీటన్నింటినీ జాగ్రత్తగా పర్యవేక్షించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
* ఈ ప్రపంచానికి ఏమైంది..? కొవిడ్-19 ప్రభావం ముగిసిందని అనుకునేలోపే కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌తో దేశాలు గజగజ వణికిపోతున్నాయి. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ ఇప్పటికే పలు దేశాలకు పాకడంతో ఎలా నివారించాలో తెలియక దేశాధినేతలు తలలు పట్టుకుంటున్నారు. సాధారణ కరోనా వైరస్ కంటే ఈ స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతుండగా.. మరణాలూ అంతకంతకూ పెరిగిపోతుండటం కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే గతేడాది విధించిన లాక్‌డౌన్ ప్రభావం కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థల్ని గాడిన పెట్టే సవాళ్లు ముందుండగా.. స్ట్రెయిన్ కారణంగా మరోసారి లాక్‌డౌనే శరణ్యమనే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోగా.. జర్మనీ, స్కాట్లాండ్ దేశాలు అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాయి.
* కరోనా వైరస్ గాలిలో వ్యాపిస్తుందా? అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులోభాగంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) కూడా హైదరాబాద్, మోహాలీ నగరాల్లో అధ్యయనం చేపట్టింది. కొవిడ్ ఆసుపత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి సాధ్యమే అని సీసీఎంబీ వెల్లడించింది. అయితే, కొవిడ్ రోగులుండే సమయం మేరకు గాలిలో వైరస్ ప్రభావం ఉంటుందని తెలిపింది.
* ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి(63) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెన్నెలకంటి పూర్తిపేరు రాజేశ్వరప్రసాద్. దాదాపు 300 చిత్రాల్లో 2వేలకు పైగా పాటలు రాశారు. వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. 1957లో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే పూర్తి చేశారు. ఎస్‌బీఐలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయనకు సాహిత్యమంటే మక్కువ. అదే ఆయనను గీత రచయితను చేసింది. తన 11వ ఏటే ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని రాశారు. అలా విద్యార్థి దశలో ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రచించారు. అయితే, మనసంతా నాటకాలు, సినిమాల మీదే ఉండటంతో అప్పుడప్పుడు నాటకాలు కూడా వేసేవారు. ఎప్పటికైనా సినిమాలో పాటలు రాయకపోతానా అనే ఆత్మ విశ్వాసంతో ఉండేవారు. అదే ఆయన్ను సినీ గేయ రచయితగా నిలబెట్టింది.
* దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా దేశంలో అందరికీ కొవిడ్ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాక్సిన్‌ను ఎలా పొందాలా? అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (కొవిన్) యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఆ యాప్.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. అందులో రిజిస్టర్ చేసుకునే వారికే వ్యాక్సిన్‌ను అందిస్తారు.
* రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు విషయంలో భారత్ ముందుకెళితే అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉందని అక్కడి ఓ నివేదిక అభిప్రాయపడింది. భారత రక్షణ ఒప్పందాలు సాంతికేతిక బదిలీ, కలిసి ఉత్పత్తి చేసే విధానాలపైనే ఆధారపడుతున్నాయని తెలిపింది. అమెరికా మాత్రం భారత్ రక్షణ ఒప్పందాల్లో సంస్కరణలు కోరుకుంటోందని పేర్కొంది. ఆఫ్‌సెట్ విధానం, ఎఫ్‌డీఐలపై పరిమితుల విషయంలో నిబంధనల్ని మరింత సడలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
* కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద భారత్‌లో అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నామని.. ఈ కార్యక్రమాన్ని పదిరోజుల్లోనే మొదలు పెట్టనున్నట్లు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ అనుమతి పొందిన తేదీ(జనవరి 3) నుంచి పదిరోజుల్లోపే టీకా పంపిణీ ప్రారంభిస్తామని తెలిపింది.
* పార్లమెంట్ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, అనంతరం మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడతగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 71కి చేరిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బయో టెక్నాలజీ విభాగ కార్యదర్శి రేణు స్వరూప్ వెల్లడించారు. మంగళవారం ఉదయానికి 20 కేసులు పాజిటివ్ కేసులు పెరిగి మొత్తం సంఖ్య 58గా ఉంది. కాగా సాయంత్రానికి మరో 13 కేసులు పెరిగి 71కి చేరింది. సాధారణ కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా యూకే నుంచి వచ్చిన కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటంపై ఆందోళన పెరుగుతోంది.
* విజయనగరం జిల్లా రామతీర్థంలో సీఐడీ బృందం పర్యటించింది. బోడికొండపై ఉన్న కోదండ రాముడి విగ్రహం ధ్వంసం ఘటన జరిగిన ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో అదనపు డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆ ప్రదేశానికి వెళ్లింది. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
* రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు పోస్టింగ్ ఇవ్వలేదని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘానికి ఆయన లేఖ రాశారు. 7 నెలలు వేచిచూసి ప్రభుత్వానికి లేఖ రాశానని.. పోస్టింగ్ ఇచ్చి వేతనం ఇవ్వాలని కోరానని పేర్కొన్నారు. గతేడాది జనవరి 8న మరోసారి లేఖ రాసినా ఎలాంటి స్పందనా లేదన్నారు. ఆరోపణలతో ఇంతకాలం కొన్ని అభియోగాలు మోపి పోస్టింగ్ ఇవ్వలేదని ఏబీ ఆరోపించారు.
* బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. బ్రిటన్‌లో కొవిడ్ స్ట్రెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోరిస్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు బోరిస్ భారత్‌కు రావడానికి గత నెలలోనే అంగీకరించారు. స్ట్రెయిన్ కలవరపరుస్తున్న తరుణంలో భారత్ పర్యటనకు రాలేని బోరిస్ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
* బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దాన్ని అరికట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం అర్థరాత్రి నుంచి రెండో దఫా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర చర్యలు చేపట్టడంతోపాటు జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండేందుకు కఠినమైన నిబంధలు అమలు చేయబోతున్నారు.
* కేంద్రంతో రైతు సంఘాల చర్చల ప్రతిష్ఠంభనతో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 7న ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. ముందుగా జనవరి 6న ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఒక రోజు వాయిదా వేసినట్లు వారు తెలిపారు. అంతే కాకుండా జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా దిల్లీకి పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీని జరుపుతామన్నారు. జనవరి 7న జరిగే ర్యాలీ గణతంత్ర దినోత్సవాన జరిగే ర్యాలీకి ట్రైలర్‌గా అభివర్ణించారు. స్వరాజ్ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్ సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం జరిగే ర్యాలీలో దిల్లీ నాలుగు సరిహద్దుల్లో మోహరిస్తామని తెలిపారు. రేపటి నుంచి రెండు వారాల పాటు ‘దేశ్ జాగరణ్ అభియాన్’లో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. సోమవారం జరిగిన చర్చల్లో సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండటంతో గతంలో ప్రకటించిన విధంగా ట్రాక్టర్ల ర్యాలీ చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. మరోవైపు కేంద్రం, రైతు సంఘాల మధ్య ఎనిమిదో విడత చర్చలు జనవరి 8న జరగనున్నాయి.
* జపాన్‌లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించనున్న ‘‘ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ – 2021’’ సదస్సుకు హాజరుకావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రెండే కేటీఆర్‌కు లేఖ రాశారు. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు. కరోనా సంక్షోభం నుంచి ప్రపంచదేశాలు వృద్ధి బాట పట్టేందుకు ‘ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగం’ అనే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. నూతన సాంకేతికత వినియోగం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల బలోపేతం, అందులో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ వృద్ధి సాధించడం లాంటి కీలక అంశాలపై వక్తలు మాట్లాడనున్నారు.
* విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటన ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే సీఎం జగన్ నిన్నటి వరకు స్పందించకపోవడం అమానుషమని విమర్శించారు. అమరావతిలో మీడియాతో జీవీఎల్ మాట్లాడారు. సీఎం కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. హిందువులపై కక్ష సాధింపు దేనికని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఏపీలో హిందూ వ్యతిరేక విధానాలు నడుస్తున్నట్లుగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. సీఎం ఇకనైనా వివక్షాపూరిత చర్యలు మానుకోకపోతే భాజపా తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు. రామతీర్థం పర్యటనకు వెళ్తున్న తమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.