Business

భారీగా తగ్గిన బంగారం-వాణిజ్యం

భారీగా తగ్గిన బంగారం-వాణిజ్యం

* గురువారం భారీగా దిగొచ్చిన బంగారం ధర. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.700లకు పైగా తగ్గింది.బంగారం ధర తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారం భారీగా రూ.714 తగ్గి.. రూ.50,335 వద్దకు చేరింది.అంతర్జాతీయంగా బంగారానికి తగ్గిన డిమాండ్​కు అనుగుణంగా దేశీయంగాను పసిడి ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.వెండి ధర కూడా కిలోకు(దిల్లీలో) రూ.386 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,708 వద్ద ఉంది.అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,916 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.07 డాలర్ల వద్ద ప్లాట్​గా ఉంది..

* దేశ చరిత్రలో తొలిసారిగా గరిష్ఠ స్థాయికి పెట్రోల్‌ ధర.దేశ చరిత్రలోనే పెట్రోల్ ధర గరిష్ఠ స్థాయికి చేరింది. గత నెల రోజులుగా పెరగని చమురు ధరలు బుధవారం అకస్మాత్తుగా పెరిగాయి.నిన్న పెట్రోల్‌ లీటర్‌ ధర 26 పైసలు, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెరగ్గా..కంపెనీలు గురువారం మరో 23 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచాయి.దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.84.20 చేరింది.కోల్‌కతాలో రూ.85.68, ముంబైలో రూ.90.83, చెన్నైలో రూ.86.96, బెంగళూరులో 87.04, భువనేశ్వర్‌ రూ.84.68, హైదరాబాద్‌లో 87.59, జైపూర్‌లో రూ.92.17కు చేరింది.ఇదిలా ఉండగా.. డీజిల్‌ ధర ఢిల్లీ లీటర్‌కు 26 పైసలు పెరగ్గా ప్రస్తుతం రూ.74.38కి చేరింది.కోల్‌కతాలో రూ.77.97, ముంబైలో రూ.81.07, చెన్నైలో రూ.79.72, బెంగళూరులో రూ.78.87, హైదరాబాద్‌లో రూ.81.17, జైపూర్‌లో రూ.84.14కు చేరింది.దేశ చరిత్రలోనే తొలిసారిగా పెట్రోల్ ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది.2018 అక్టోబర్‌ 4న పెట్రోల్‌ రేట్‌ రూ.84 ఉండగా.. ప్రస్తుతం రూ.84.20కు చేరుకుంది.

* ప్ర‌ముఖ డిజిట‌ల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం‌ త‌న ప్లాట్‌ఫామ్‌లో ఇన్‌స్టంట్ ప‌ర్స‌న‌ల్ లోన్స్‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం ఇపుడు 2 నిమిషాల్లో వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తుంది. ఇప్ప‌టికే పేటీఎం సేవ‌ల‌ను పొందుతున్న వినియోగ‌దారులు 2 నిమిషాల్లో వారి రుణ అర్హ‌త‌ను బట్టి రుణాలు పొంద‌టానికి అనుమతిస్తోంది. లోన్‌ను 18-36 నెల‌ల్లో వాయిదా పద్ధతిలో తీర్చ‌వ‌చ్చు. వాయిదాల‌ను బట్టి ఈఎంఐను నిర్ణయిస్తారు. రుణాలను ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు ప్రాసెస్ చేసి పంపిణీ చేస్తాయి. ఈ చ‌ర్య క్రెడిట్ టు న్యూ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆర్ధిక మార్కెట్ ప‌రిధిలోకి తీసుకువ‌స్తుంది. సంప్రదాయ బ్యాంకింగ్ సంస్థ‌ల‌కు యోగ్య‌త లేని చిన్న న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి వ‌చ్చిన వ్యక్తుల‌కు కూడా ఆర్ధిక స‌హాయం అందుతుంది.

* ఎంజీ సంస్థ భారత్‌లోకి సరికొత్త హెక్టార్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.12.89లక్షలుగా నిర్ణయించారు.హైఎండ్‌కు రూ.19.12లక్షలు వెచ్చించాల్సిందే. ఈ కారు 5సీటర్‌, 6సీటర్‌, 7సీటర్‌ మోడళ్లలో లభిస్తోంది. భారత్‌లో ఎంజీ సంస్థకు మంచి మార్కెట్‌ తీసుకొచ్చిన మోడల్‌ హెక్టారే. ఈ కారు మార్కెట్లోకి విడుదలైన 18 నెలల్లో 40వేల కార్లను విక్రయించారు. 2021 మోడల్‌లో పలు మార్పులను తీసుకొచ్చింది. త్వరలోనే మరో 7సీటర్‌ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఎంజీ ప్రయత్నాలు చేస్తోంది. సరికొత్త మోడల్‌ గ్రిల్‌ను అమర్చారు. దీనిని గతంలో జెడ్‌ఎస్‌ ఈవీలో వినియోగించారు. ఫ్రంట్‌,రియర్‌ బంపర్‌పై స్కిడ్‌ ప్లేట్‌కు గన్‌మెటల్‌ కోటింగ్‌ను వేశారు. కొత్తగా 18 అంగుళాల అలాయ్‌వీల్స్‌ను అమర్చారు.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త మైలురాయిని అధిగమించింది. ఆ కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర్‌ దేశంలో 2.5 కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుంది. దేశంలో తొలిసారి ఓ స్కూటర్‌ బ్రాండ్‌ ఈ మైలురాయిని చేరుకున్నట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఓ ప్రకటనలో తెలిపింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో వరుసగా రెండో రోజూ నష్టాలను చవిచూశాయి. దీంతో నిఫ్టీ 14,150 దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం 20 పైసలు క్షీణించి 73.31 వద్ద ముగిసింది.