Business

SBI రుణాలపై తీపికబురు-వాణిజ్యం

SBI రుణాలపై తీపికబురు-వాణిజ్యం

* దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే సంస్థ టీసీఎస్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. అంచనాలు మించి లాభాలను సొంతం చేసుకుంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన స్థూల లాభం రూ.8,701 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.8,118 కోట్లతో పోలిస్తే ఇది 7.2 శాతం అధికం కావడం గమనార్హం.

* పండగ వేళ గృహ కొనుగోలుదారులకు మరో తీపికబురు అందించింది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ). గృహ రుణాల వడ్డీరేటుపై 30 బేసిస్‌ పాయింట్ల మేర రాయితీ ప్రకటించింది. అంతేగాక, ప్రాసెసింగ్‌ ఫీజును 100శాతం మినహాయించింది. అయితే సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా ఈ రాయితీ వర్తిస్తుంది. తాజా నిర్ణయంతో రూ.30లక్షల వరకు రుణాలపై ప్రారంభ వడ్డీ రేటు 6.80శాతం, అంతకు మించి ఉన్న రుణాలపై 6.95శాతంగా ఉండనున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా కొనుగోలుదారులకు 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీంతో పాటు ఎనిమిది మెట్రో నగరాల్లో రూ.5కోట్ల వరకు గృహరుణాలపై ఇదే రకమైన రాయితీ ఉంటుందని వివరించింది. ఇక యోనో యాప్‌ ద్వారా గృహ రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీ పొందొచ్చని తెలిపింది.

* బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ నేడు జీవన కాల గరిష్ఠానికి చేరింది. స్టాక్​మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీల విలువ రూ. 195.21 లక్షల కోట్లకు పైగా నమోదయింది. దీంతో బీఎస్ఈ చరిత్రలో శుక్రవారం సరికొత్త కొత్త రికార్డు​నమోదైంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు రాణించడం, దేశీయంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు వడివడిగా అడుగులు పడుతుండడం, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వంటి పరిణామాలు సెంటిమెంట్‌ను బలపర్చాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ రంగ షేర్లు రాణించడంతో మరోసారి సూచీలు జీవనకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 14,350 ఎగువన ముగిసింది.

* దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్‌, వేరియంట్‌ని బట్టి గరిష్ఠంగా 1.9శాతం మేర ధరలు పెరిగినట్లు వెల్లడించింది. వాహనాన్ని బట్టి రూ.4,500 నుంచి 40,000 వరకు పెరుగుదల ఉన్నట్లు పేర్కొంది. 2020 డిసెంబరు 1 నుంచి 2021, జనవరి 7 మధ్య బుక్‌ చేసుకున్న కొత్త థార్‌ కార్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. నేటి నుంచి జరిగే థార్‌ బుకింగ్‌లకు.. డెలివరీ నాటి ధరలు వర్తిస్తాయని తెలిపింది.