Politics

కథ దర్శకత్వం అఖిలప్రియ. స్క్రీన్‌ప్లే డైలాగులు భార్గవరామ్.

Akhilapriya Mastered Kidnap Plan - Bhargavaram Directed It - Guntur Seenu

హైదరాబాద్‌లోని రూ. రెండువేల కోట్ల విలువైన భూమిపై హక్కుల కోసం ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను అపహరించడం వెనుక భారీ కసరత్తు జరిగిందని బోయిన్‌పల్లి పోలీసులు గుర్తించారు. బాధితులను బెదిరించి దస్త్రాలపై సంతకం పెట్టించుకునే పథకం ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియది కాగా.. కిడ్నాప్‌కు అవసరమైన కార్యాచరణ ఆమె భర్త భార్గవ్‌రామ్‌, శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శ్రీను చేపట్టారు. మూడు నెలల నుంచి ప్రవీణ్‌రావు కదలికలపై నిఘా ఉంచారు. ఈనెల 3 నుంచి ప్రవీణ్‌రావు ఇంటి సమీపంలోని దుకాణాలు, టీ స్టాళ్లు, బ్యాంకు, హోటళ్ల వద్ద గడిపారు. అంతా సానుకూలంగా ఉందని నిర్ధారించుకున్నాక, మంగళవారం రాత్రి కిడ్నాప్‌ చేశారు. అపహరణ అనంతరం ముగ్గురితో ఎలా వ్యవహరించాలనే దానిపై భార్గవరామ్‌, గుంటూరు శ్రీను కిడ్నాపర్లకు దిశానిర్దేశం చేశారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకున్నాకే వదలాలని సూచించారు. దారిలోనే వారికీ విషయం వివరించాలని, గంటలోపు మొయినాబాద్‌లోని తమ ఫాంహౌస్‌కు తీసుకురావాలని ఆదేశించారు. అవాంతరాలు ఎదురైనా.. పోలీసులు కనిపించినా వెంటనే కార్లు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని డ్రైవర్లకు చెప్పారు. అపహరణకు వాడిన మూడు కార్లకు ‘ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ’ స్టిక్కర్లను అతికించడంతో పాటు పోలీసు దుస్తులు ధరించినవారు కిటికీ పక్కన కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. వాట్సాప్‌ కాల్స్‌ మాత్రమే చేయాలని శ్రీను కిడ్నాపర్లకు స్పష్టం చేశాడు. భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీనుల నేరచరితపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే అతడికి మూడేళ్ల క్రితం భార్గవరామ్‌ పరిచయమయ్యాడని, అప్పటి నుంచి స్నేహితులయ్యారని ఆధారాలు లభించాయి. శ్రీను గొడవలు, వివాదాల్లో తలదూర్చుతుండడం, దాడులు చేసేందుకూ వెనకాడకపోవడంతో అతని సాయంతో హైదరాబాద్‌లో భూ వివాదాలను పరిష్కరించేవారు. అఖిలప్రియ, భార్గవరామ్‌ల వివాహం తరవాత శ్రీను వారికి వ్యక్తిగత సహాయకుడిగా మారాడు. భార్గవరామ్‌.. శ్రీనుతో కలిసి హైదరాబాద్‌, అమరావతి, మంగళగిరి, కర్నూలులో పలు సెటిల్‌మెంట్లు చేశారని పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా కోటకందుకూరులోని ఓ స్టోన్‌ క్రషర్‌ను దౌర్జన్యంగా ఆక్రమించేందుకు యత్నించారనే ఆరోపణలున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.