చలికాలం కదలకుండా….

ఒకవైపు చల్లగాలి వీస్తుంటుంది. మరోవైపు నులివెచ్చటి ఎండ కాస్తుంటుంది. ఈ రెండు కలిసిన చలికాలం కాసింత ఆహ్లాదంగానే అనిపిస్తుంటుంది. అయితే చలికాలంతో పాటు చాలామందికి బద్ధకం కూడా ముంచుకొస్తుంటుంది. బాగా పొద్దు ఎక్కేవరకూ ముసుగుతన్ని పడుకోవటం, బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవటం వంటివి చేస్తుంటారు. ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపుతాయి. కాబట్టి చలికాలంలో చేయకూడని తప్పులేంటో ఓసారి చూద్దాం.
***చాలామంది చేసే తప్పు ఇది. చలికాలం లో పొద్దున్నే మంచం మీంచి లేవటం చాలామందికి ఇష్టముండదు. ఇంకాసేపు పడుకుంటే బాగుంటుందనే అనిపిస్తుంటుంది. దీంతో జిమ్‌కు, జాగింగ్‌కు వెళ్లటం మానేస్తుంటారు. దీంతో బరువూ పెరుగుతారు. అందువల్ల చలికాలంలోనూ వ్యాయామం మానొద్దు. దీంతో బరువు అదుపులో ఉండటమే కాదు. మనం ఆనందంగా, హుషారుగా ఉండటానికి తోడ్పడే హార్మోన్లు సైతం విడుదలవుతాయి.
* ఇంట్లోనే ఉండిపోవటం
బయట వాతావరణం చల్లగా ఉండటం వల్ల కొందరు ఎంతసేపూ ఇంట్లోనే ఉండిపోతుంటారు. టీవీల ముందు కూలబడి పోతుంటారు. దీంతో శరీర కదలికలు తగ్గిపోయి జీవక్రియలూ మందగిస్తాయి. కాబట్టి కాస్త ఆరుబయటకు వెళ్లి ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవటం, స్నేహితులను కలుసుకోవటం వంటివి చేయటం మేలు.
** కరకర చిరుతిండి
చలికాలంలో వేడివేడి బజ్జీలు, కరకరలాడే పకోడీల వంటి వాటిపై మనసు మళ్లుతుంటుంది. కొందరు మిఠాయిలు తెగ లాగించేస్తుంటారు. ఇలాంటివి మనసుకు హుషారు కలిగిస్తుండొచ్చు గానీ వీటితో రక్తంలో గ్లూకోజు స్థాయులూ పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. దీన్ని శరీరం సరిగా వినియోగించుకోలేక సతమతమైపోతుంది. అందువల్ల ఎక్కువ కేలరీలతో కూడిన వాటికి బదులు వేడి వేడి సూపుల వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు ఎంచుకోవటం మంచిది.
* *అతిగా మద్యం తాగటం
ఇది మరో తప్పు. చలి పెడుతుందని కొందరు, జలుబు తగ్గుతుందని కొందరు మద్యం కాస్త ఎక్కువగా తాగుతుంటారు. ఇది నిజం కాదు. నిజానికి మద్యం మూలంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి మద్యం అలవాటు గలవారు మితం పాటించటం మంచిది.
* *ఎక్కువసేపు వేడినీటి స్నానం
చలికాలంలో వేడినీటి స్నానం హాయిగానే ఉంటుంది. అలాగని మరీ వేడి నీటితో స్నానం చేయటం తగదు. ఎందుకంటే వేడి నీరు చర్మం పొడిబారేలా చేస్తుంది. ఫలితంగా దురద పెట్టటం, పొలుసుల వంటివి వేధిస్తాయి. అందువల్ల గోరువెచ్చని నీటితో స్నానం చేయటం, చర్మం కాస్త తడిగా ఉండగానే మాయిశ్చరైజర్లు రాసుకోవటం మేలు. దీంతో చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు.
** నీళ్లు సరిగా తాగకపోవటం
చలికాలంలో సహజంగానే చర్మం పొడిబారుతుంటుంది. ఒంట్లో నీటిశాతం తగ్గితే ఇది మరింత తీవ్రమవుతుంది. కాబట్టి చలికాలంలోనూ తగినంత నీరు తాగటం మరవరాదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com