ప్రత్యేక రోజుల్లో అనుమతిద్దాం….

శబరిమలను 10 నుంచి 50ఏళ్ల వయస్సు గల మహిళలు ప్రత్యేక రోజుల్లో దర్శించుకునేలా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై ఆలయ ప్రధాన పూజారి, పందలం ప్రతినిధులతో చర్చిస్తామన్నారు. శబరిమల వివాదంపై చర్చించేందుకు నేడు కేరళలో అఖిల పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సీఎం విజయన్‌ మీడియాతో మాట్లాడారు. ఇవే విషయాలను తాను అఖిలపక్ష సమావేశంలోనూ స్పష్టం చేశానన్నారు. భాజపా, కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును తాము అమలు చేస్తామన్నారు. ప్రజల నమ్మకాల కన్నా వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆందోళనకారులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని ఆయన కోరారు. ప్రభుత్వం ఎటువంటి పక్షపాతం చూపటంలేదని, కేవలం అత్యున్నత న్యాయస్థానం తీర్పును మాత్రమే అమలు చేస్తోందన్నారు. భక్తులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి భద్రత కల్పిస్తుందని విజయన్‌ హామీ ఇచ్చారు. కాగా.. శబరిమల అంశంపై నేడు ప్రభుత్వం చేపట్టిన అఖిలపక్ష సమావేశం నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవట్లేదని, ఇది భక్తులకు సవాల్‌గా మారుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. శబరిమలలో శాంతి నెలకొల్పేందుకు వచ్చిన ఓ సువర్ణావకాశాన్ని సీఎం వృథా చేశారని వారు దుయ్యబట్టారు. అటు భాజపా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రభుత్వం శబరిమలను రణరంగంగా మార్చాలని చూస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించి సంప్రదాయాలను పరిరక్షించాలని భాజపా నేతలు కోరడం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com