NRI-NRT

అమెరికాలో భారీ అల్లర్లు జరగవచ్చు: FBI

అమెరికాలో భారీ అల్లర్లు జరగవచ్చు: FBI

మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వాషింగ్టన్‌ డి.సి ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు. జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆత్యయిన స్థితి విధించాలన్న నగర మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ సిఫార్సు మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు రాజధానిలోని క్యాపిటల్‌ భవనంతో పాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోని క్యాపిటళ్లపై దాడికి కుట్ర జరుగుతోందని ‘ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ)’ హెచ్చరించడం గమనార్హం. బైడెన్‌ ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా అత్యవసర పరిస్థితిని విధించారు.

అత్యవసర పరిస్థితి కారణంగా స్థానికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించడానికి హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగంతో పాటు ఫెడరల్‌ ఎమర్జెన్సీ మ్యానేజ్‌మెంట్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఈఎంఏ)లు రంగంలోకి దిగనున్నాయి. అలాగే స్టాఫర్డ్‌ చట్టం ప్రకారం.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రజల ప్రాణాలకు ముప్పు వంటి ఘటనలు తలెత్తితే వాటిని నిలువరించేందుకు కేంద్ర బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉండనున్నాయి. అలాగే దీనికయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించనుంది. జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడి తర్వాత అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ దాడికి తన మద్దతుదారులను ట్రంపే ఉసిగొల్పాలని ఆరోపిస్తూ డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.