DailyDose

దీదీతో ముగిసిన బాబు భేటి-తాజావార్తలు–05/20

Chandrababu meets with mamta banerjee-daily poilitical news - tnilive - daily political news in telugu

* పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం అమరావతి నుంచి కోల్‌కతాకు వెళ్లిన చంద్రబాబు అక్కడ దీదీతో భేటీ అయ్యారు. ఎన్డీయేతర కూటమి ఏర్పాటుపై ముమ్మర ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఆమెతో సమావేశమయ్యారు. అనంతరం దిల్లీకి చంద్రబాబు పయనమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ఈసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు.
* ట్రిచీ నుంచి సింగపూర్‌ వెళ్లాల్సిన స్కూట్‌ ఎయిర్‌వేస్‌ TR 567 విమానంలో పొగ రావడంతో పైలెట్‌ విమానాన్ని చెన్నైలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఇవాళ(సోమవారం) తెల్లవారు ఝామున ట్రిచీ ఎయిర్ పోర్టు నుంచి స్కూట్‌ ఎయిర్‌వేస్‌ టీఆర్‌ విమానం సింగపూర్‌ వెళ్లేందుకు బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో పొగ రావడాన్ని పైలెట్‌ గమనించి, విమానాన్ని తెల్లవారుఝామున 3.40 గంటలకు అత్యవసరంగా చెన్నై విమానాశ్రయంలో దించారు. ఈ విమానంలో 161 మంది ప్రయాణిలున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఈ విమానం సోమవారం సాయంత్రం సింగపూర్‌కు బయలుదేరి వెళ్తుందని విమానాశ్రయం అధికారులు చెప్పారు. పొగరావడానికి కారణాలపై విమానాన్ని పరిశీలిస్తున్నారు ఇంజినీర్లు.
* పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం రాత్రి నిఖిల్ అనే పేషంట్ ను గాయాలతో తీసుకువచ్చారు బంధువులు. ఎమర్జెన్సీ కేసు అయినా డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ చేయడం లేదని ఆరోపిస్తూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ వార్డులోని డాక్టర్, వైద్య సిబ్బందిని బూతులు తిట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి వైద్యం చేయలేదని…డ్యూటీలో ఉన్న మెడికల్ ఆఫీసర్ అన్వేష్ పై దాడి చేశారు. పేషంట్ తో వచ్చిన వారంతా తాగి ఉండడంతో హాస్పిటల్ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. డాక్టర్ పై దాడిని ఖండించారు హాస్పిటల్ సిబ్బంది.
* మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కోర్టు మరోసారి రిమాండ్‌ పొడిగించింది. ఈ హత్యకేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీసులు సోమవారం హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జడ్జి అశోక్ కుమార్ నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే, కడపలోని కేంద్ర కారాగారం నుంచి పులివెందులలోని సబ్ జైలుకు తమను తరలించాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి విచారించారు. వారి అభ్యర్థనను పరిగణలోని తీసుకున్న కోర్టు…ముగ్గురు నిందితుల్ని పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
* న్యాయవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ లాసెట్‌ 2019 ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ దఫా లాసెట్‌కు మొత్తం 11,492 మంది విద్యార్థులు హాజరయ్యారు.
*భారత యువ క్రికెటర్ గాదె హనుమ విహారి ఓ ఇంటివాడయ్యాడు. వరంగల్ కు చెందిన ప్రీతిరాజ్ ను అతడు ఆదివారం వివాహమాడాడు. హైదరబాద్ లో ఓ వివాహ వేడుకలో ప్రీతిని చూసి ఇష్టపడిన విహారి.. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాడు. సోమవారం హైదరాబాద్ లో వివాహ విందు జరగనుంది. విహారి టీం ఇండియా తరపున నాలుగు టెస్టులు ఆడాడు.
*రాయలసీమ జిల్లాలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా చిత్తూరు, కర్నూలు జిల్లాలో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రానున్న నలుగు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 22, 23తేదీల్లో కోస్తాంద్ర జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గాలులు గంటకు 40-50 కిమీ వేగంతో వీయవచ్చని చెబుతున్నారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు.
*ఓ హైకోర్టు న్యాయమూర్తి పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ఉపసంహరించుకున్న రాజ్యసభ సభ్యుల పేర్లను వెల్లడించరాదని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ఇలా బహిర్గత పరచడం పార్లమెంటరీ సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఆదేశాల్లో పేర్కొంది.
*చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు మినహా రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో రీపోలింగ్‌ అనివార్యమైంది. ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో 89.29 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏప్రిల్‌ 11తో పోలిస్తే ఈసారి స్వల్పంగా 1.13 శాతం తగ్గింది. మొత్తం 5451 మంది ఓటర్లు ఉండగా 4867 మంది ఓటు వేశారు. ఏప్రిల్‌ 11న ఇదే ఏడు కేంద్రాల్లో 4929 మంది ఓటు వేశారు.
*రాష్ట్రంలో 2019-20 విద్యాసంవత్సరానికి 1,901 ఆవాసాల పరిధిలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు అందుబాటులో లేవని ప్రభుత్వం ప్రకటించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆ ఆవాసాల్లో గుర్తించిన 20,012 మంది పిల్లలు చదువుకునేందుకు వీలుగా రవాణా వసతి కల్పించనున్నట్లు పేర్కొంది.
* రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున సోమవారం వడగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆదివారం 29 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఎండపల్లిరాజారాంపల్లిలో 45.9, మెట్‌పల్లి, కమాన్‌పూర్‌, మల్లాపూర్‌లో 45.8, జైన, అయ్యగారిపల్లి, చీదెళ్ల, తంగుళ్లలో 45.7, నాస్పూర్‌లో 45.6, జన్నారం, కోల్వాయిలో 45.5, నిజామాబాద్‌లో 44.4, రామగుండంలో 44.2, ఖమ్మంలో 44, హైదరాబాద్‌లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఇంకా పెరిగే సూచనలున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయి. ఆదివారం 41 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు పడ్డాయి. మంగళవారం ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు కురిసే సూచనలున్నట్లు రాజారావు తెలిపారు.
*రాష్ట్రంలో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో స్థానిక గిరిజనులతో కలిసి గిరిజన ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రైవేటు సంస్థల పరిధిలో కొనసాగిన తయారీని నిలిపివేసి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పర్యవేక్షణలో చేపట్టనుంది. ఈ మేరకు ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం ఐటీడీఏ, మన్ననూరు ప్రత్యేక మండలి పరిధిలో కలిపి 25 యూనిట్లు నెలకొల్పనుంది.
*తెలంగాణ సాధారణ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు 80 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 80,450 మంది దరఖాస్తు చేసుకోగా 64,360 మంది పరీక్ష రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 35 జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి 337 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష నిర్వహించినట్లు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి తెలిపారు.
*ప్రకృతి వ్యవసాయంపై జూన్‌ 1, 2, 3 తేదీలలో సేవ్‌ (సొసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌) స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరు గ్రామంలోని సౌభాగ్య గోసదన్‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
*డిగ్రీ అర్హత కలిగిన రాష్ట్ర ముస్లిం యువతి, యువకులకు సివిల్‌ సర్వీసెస్‌(ఐఏఎస్‌/ఐపీఎస్‌) పరీక్షలకు ముంబయిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ కార్యనిర్వాహక అధికారి తాజుద్దీన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత పరీక్ష జూన్‌ 16న, ముఖాముఖీ జూన్‌ 29, 30వ తేదీల్లో ఉంటాయని వెల్లడించారు. దరఖాస్తుకు సోమవారం తుది గడువని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.hajcommittee.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
*రాయలసీమ జిల్లాల్లో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గాలులు గంటకు 40-50కి.మీ వేగంతో వీయవచ్చని చెబుతున్నారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులూ ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు.
*‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ నినాదం ద్వారా తెలుగుజాతి ఐక్యత కోసం పుచ్చలపల్లి సుందరయ్య ఎంతో కృషి చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధిగా, తుదిశ్వాస వరకూ నిజాయతీగా పోరాడారన్నారు. పీడిత వర్గాల సమస్యల పరిష్కారానికి చివరి వరకూ పోరాడారని పేర్కొన్నారు.
* ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధరణకు వెళ్లిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పౌరహక్కుల సంఘం బృందాన్ని అడ్డుకున్న పోలీసులు.. నిజాలను ఎంత మాత్రం దాచలేరని ఈ సంఘం ఏపీ అధ్యక్షుడు వి.చిట్టిబాబు అన్నారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
* ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు.. మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపాయి. ఎన్డీయేకే ఎగ్జిట్ పోల్స్ ప‌ట్టం క‌ట్ట‌డంతో.. మార్కెట్లు ప‌రుగులు తీశాయి. ఇవాళ ఉద‌యం బీఎస్ఈ సెన్సెక్స్ దూసుకెళ్లింది. ట్రేడింగ్‌లో 900 పాయింట్లు ఎగ‌బాకింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ 79 పైస‌లు త‌గ్గింది. సెన్సెక్స్ ఇవాళ 38 వేల 619 పాయింట్ల‌ను తాకింది. ఎన్ఎస్ఈ 11 వేల 610 పాయింట్ల‌కు చేరుకున్న‌ది. ఇవాళ ఎన్ఎస్ఈ 203 పాయింట్లు ట్రేడ్ అయ్యింది.