తితిదే అన్నప్రసాదం ట్రస్టుకు రూ.83 కోట్ల విరాళాలు-ఆధ్యాత్మికవార్తలు

శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు ఏటేటా వృద్ధి సాధిస్తూ రూ.1,026 కోట్ల డిపాజిట్లకు చేరుకుందని తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాతలు రూ.83 కోట్ల విరాళాలు సమర్పించాని తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవన సముదాయంలో శుక్రవారం ఆయుధపూజ నిర్వహించిన సందర్భంగా ఈవో మాట్లాడారు. శ్రీవారి భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందజేసేందుకు ట్రస్టు కృషి చేస్తోందని, దాతల సహకారంతో సాధారణ రోజుల్లో నిత్యం 1.50 లక్షల మందికి, వారాంతంలో 2 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తోందని గుర్తు చేశారు.

1.ప్రత్యేక రోజుల్లో మహిళలకు దర్శనం
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలనూ అనుమతించే విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని కేరళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో పునరుద్ఘాటించింది. గురువారం దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో భాజపా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ బయటకు వెళ్లిపోయాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు జనవరిలో విచారణకు రానున్న నేపథ్యంలో తీర్పు అమలును నిలుపుదల చేసేలా న్యాయస్థానాన్ని కొంతకాలం గడువు కోరాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరస్కరించారు. రాజ్యాంగం కంటే విశ్వాసం గొప్పదని ప్రభుత్వం చెప్పజాలదన్నారు. కాగా 10-50 ఏళ్ల మహిళల దర్శనానికి ప్రత్యేకంగా కొన్ని రోజులు కేటాయించాలన్న ప్రభుత్వ యోచనను విజయన్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ విషయమై సంబంధిత పక్షాలన్నింటితోనూ చర్చించనున్నట్లు విలేకరులకు తెలిపారు. కోర్టు తీర్పుపై స్టే ఇవ్వనందున తీర్పును అమలు చేయడం మినహా గత్యంతరం లేదని, భక్తులు అర్థం చేసుకోవాలని కోరారు.
**ప్రభుత్వానిది మొండి వైఖరి : విపక్షాలు
అఖిలపక్ష సమావేశం ఓ ప్రహసనమేనని, శాంతిభద్రతలు లోపిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి వైఖరి ఆమోదయోగ్యం కాదని శాసనసభ ప్రతిపక్ష (కాంగ్రెస్) నేత రమేశ్ చెన్నితాల, భాజపా రాష్ట్ర విభాగం అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైలు విమర్శించారు. కేరళను ముఖ్యమంత్రి ‘స్టాలిన్స్ రష్యా’లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ శ్రీధరన్ పిళ్లై విమర్శించారు.
**మా వైఖరి మారదు : రాజ కుటుంబం
అన్ని వయసుల మహిళల ప్రవేశానికి ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నందున, ఇందుకు అనుగుణంగానే తమ వైఖరి ఉంటుందని శబరిమల ఆలయానికి చెందిన పందళం రాజ కుటుంబం ముఖ్యమంత్రికి స్పష్టం చేసింది. రాజ కుటుంబానికి చెందిన శశికుమార్ వర్మ, ప్రధాన అర్చకుడు (తంత్రి) కందరారు రాజీవరులతో ముఖ్యమంత్రి వేరుగా భేటీ అయ్యారు. 10-50 ఏళ్ల మహిళలు శబరిమలకు రావొద్దంటూ అభ్యర్థించడం మాత్రమే చేయగలమని రాజీవరు పేర్కొన్నారు.
**15,000 మందితో బందోబస్తు
రెండు నెలల పూజలకు గాను ఎన్నడూ లేనంత భద్రత ఏర్పాట్ల నడుమ శుక్రవారం సాయంత్రం ఆలయాన్ని తెరవనున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఇటీవల రెండు సార్లు ఆలయాన్ని తెరచినప్పటి కంటే.. శబరిమల, పరిసర ప్రాంతాల్లో భద్రతను రెట్టింపు చేసినట్లు డీజీపీ లోక్నాథ్ బెహరా తెలిపారు. మహిళా పోలీసులు సహా 15,000 మందిని మోహరిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా 10-50 ఏళ్ల మహిళలు కేరళ గత వారం రోజులుగా దర్శనం కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు.

2.తిరుమలలో 20న చక్రతీర్థ ముక్కోటి
తిరుమల కొండల్లోని ప్రముఖ తీర్థాల్లో ఒకటైన చక్రతీర్థం వద్ద చక్రతీర్థ ముక్కోటిని ఈనెల 20న నిర్వహించనున్నారు. ఏటా కార్తీకమాసం శుద్ధ ద్వాదశినాడు చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తారు. తీర్థంలో కొలువైన చక్రత్తాళ్వారుకు అభిషేకం చేస్తారు.

3. నెమలి ఆలయానికి నూతన పాలకవర్గం
జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు గురువారం రాత్రి తమకు అందాయని ఆలయ కార్యనిర్వహణాధికారి వై.శివరామయ్య తెలిపారు. గుడి ప్రాంగణంలో నియమిత పాలకవర్గ సభ్యులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈవో ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామానికి చెందిన గరిడేపల్లి రామకృష్ణ, పామర్తి రాంబాబు, తుపాకుల జగన్నాథం, బొల్లెపోగు కొండలరావు, తెల్లబోయిన మంగమ్మ, జవ్వాజి నాగేశ్వరరావు, హనుమంతు వెంకటేశ్వరరావు, మైలవరపు రామాంజనేయులు, ఖమ్మానికి చెందిన వజ్రాల వెంకటనారాయణరెడ్డి సభ్యులుగా, అర్చకులు టి.గోపాలాచార్యులు ఎక్స్అఫిషియో సభ్యునిగా నియమితులయ్యారు. సభ్యులు సమావేశమై ఆలయ పాలకవర్గ అధ్యక్షునిగా ఎం.రామాంజనేయులను ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గ సభ్యులు వేణుగోపాలస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వీరిలో దాతల విభాగంలో నియమితులైన వెంకటనారాయణరెడ్డి ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులతో నియమితులయ్యారు. వాస్తవంగా నోటిఫికేషన్ జారీ చేశాక దరఖాస్తు చేసుకున్న దాతల జాబితా నుంచి ఎంపిక చేయాలి. దరఖాస్తు లేకుండానే నియామక ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. నూతన పాలకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకారంలో తెదేపా గ్రామపార్టీ నాయకులు బెల్లం మధుసూదనరావు, పామర్తి కొండలరావు, వనమా చినఅనంతరామయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

4. క్షీరాబ్ధి కన్యకకు… శ్రీమహా విష్ణువుకు… నీరాజనం
భౌతికంగా ఆచారాన్నీ, సమాజపరంగా సదాచారాన్నీ, ఆధ్యాత్మికంగా జ్ఞానాన్నీ ప్రసాదిస్తూ, అందరూ మోక్షాన్ని పొందే మార్గాన్ని నిర్దేశించే గొప్ప పర్వదినం క్షీరాబ్ధి ద్వాదశి. దానాలకూ, ధ్యానాలకూ, శివకేశవుల అనుగ్రహానికీ నెలవైన మాసం కార్తికం కాగా, అందులో శ్రీలక్ష్మిని శ్రీహరి పరిణయమాడిన రోజు క్షీరాబ్ధి ద్వాదశి.కార్తిక మాస శుక్ల ద్వాదశి శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఇది క్షీరాబ్ధి ద్వాదశిగా ప్రసిద్ధి పొందింది. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మథించిన రోజు ఇది. అందుకే దీన్ని ‘క్షీరాబ్ధి’ ద్వాదశి అన్నారు. మథించడం అంటే చిలకడం. కాబట్టి ‘చిలుక ద్వాదశి’గా కూడా వ్యవహరిస్తారు. దీనికి ముందురోజు ‘ఉత్థాన ఏకాదశి’. ఆషాఢమాసంలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశినాడు మేలుకొంటాడని నమ్మకం. దీన్ని ‘ప్రబోధన ఏకాదశి’ అని కూడా అంటారు. యోగనిద్ర నుంచి మేలుకొన్న విష్ణుమూర్తి నేరుగా బృందా వనంలో ప్రవేశిస్తాడు. అందుకని ‘ఉత్థాన ఏకా దశి’ నాడు తులసీ బృందావనం వద్ద పూజలు చేస్తారు. అందరికీ బృందావనానికి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న తులసికోట దగ్గర మహిళలు పూజ నిర్వహిస్తారు.
**లక్ష్మీదేవి పుట్టినరోజు!
క్షీరాబ్ధి ద్వాదశి నాడు పాల సముద్రంలో మహాలక్ష్మి ఆవిర్భవించిందనీ, ఆ రోజునే లక్ష్మీ నారాయణుల కల్యాణం జరిగిందనీ ‘చతుర్వర్గ చింతామణి’ అనే గ్రంథం చెబుతోంది. అందుకే ఈ రోజు లక్ష్మీనారాయణ కల్యాణం నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. వివాహానంతరం లక్ష్మీ సమేతుడై మహావిష్ణువు బృందావనానికి వెళ్ళాడని కథలు ఉన్నాయి. పరమ పవిత్రమైన ఈ రోజును పావన ద్వాదశిగా, విభూతి ద్వాదశిగా, గోవత్స ద్వాదశిగా, నీరాజన ద్వాదశిగా వ్యవహరిస్తూ… అందుకు సంబంధించిన వ్రతాలు చేస్తుంటారు. విష్ణుమూర్తినీ, మహాలక్ష్మినీ బృందావనానికి బ్రహ్మ తీసుకొని వెళ్ళి, అక్కడ తులసితో విష్ణువుకు వివాహం జరిపించాడని క్షీరాబ్ధి వ్రత కథ చెబుతోంది. తులసి సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశే! ముఖ్యంగా, మథురలోని బృందావనంలో, మహారాష్ట్రలో క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసీ కల్యాణం నిర్వహిస్తారు.
**తులసీ కల్యాణం
తెలుగు లోగిళ్ళలో క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం తులసికోట దగ్గర అలికి, ముగ్గులు పెడతారు. తులసికోటనే బృందావనంగా భావించి, ఉసిరిక కొమ్మను విష్ణుమూర్తికి ప్రతీకగా సంభావించి… తులసీ కల్యాణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గృహిణి లేదా దంపతులు నిర్వహిస్తారు. రామతులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి… ఇలా ఎన్నో రకాల తులసి చెట్లు ఉన్నాయి. నల్లని కాండం ఉన్న మొక్కను ‘కృష్ణ తులసి’ అనీ, తెల్లని కాండం ఉండే మొక్కను ‘లక్ష్మీ తులసి’ అనీ అంటారు. ఈ రెండు వర్ణాల తులసి వృక్షాలను తులసికోటలో నాటి, పరిణయం జరిపిస్తారు.
**దశావతారాల్లో ఎనిమిదవది శ్రీకృష్ణావతారం. తులసి సన్నిధిలో ఉండడం తనకెంతో ఇష్టమని సాక్షాత్తూ కృష్ణుడే తన సహపాఠి ఉద్ధవునితో చెప్పినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తులసితో కృష్ణునికి ఉన్న అనుబంధమే తులసీ కల్యాణం నిర్వహించడానికి ముఖ్య కారణం. ఈ కల్యాణం సందర్భంగా తులసిని షోడశోప చారాలతో పూజించి, వివిధ రకాల పండ్లు, చెరుకు ముక్కలు, చలిమిడి, వడపప్పు నివేదించి, హారతి ఇస్తారు. ముత్తైదువను శ్రీమహాలక్ష్మిగా సంభావించి, పసుపు కుంకుమలు, ఫల పుష్ప తాంబూలాదులతో సత్కరించి, దీవెనలు పొందుతారు. అలా చేస్తే మాంగల్యాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. రోజంతా ఉపవసించిన గృహిణులు పూజానంతరం తులసికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకొని, ఉపవాసాన్ని విరమిస్తారు.
**360 దీపాలు
ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో దేవుని ముందు దీపాలు వెలిగించడం మన సంస్కృతిలో భాగం. అలా పెట్టలేనివారు కార్తిక మాసంలోనైనా పెట్టాలని శాస్త్రాలు అంటున్నాయి. అది కూడా చేయలేనివారు ద్వాదశినాడు 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే, సంవత్సరమంతా దీపం వెలిగించినట్టవు తుందని శాస్త్ర వచనం. కార్తికమాసం అంతా దీపాలు పెట్టలేనివారు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమల నాడు తప్పకుండా పెట్టాలనీ, అందునా ద్వాదశి నాటి దీపం వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందనీ ‘కార్తిక పురాణం’ చెబుతోంది.
**ఈ రోజుకు ఎన్నో విశేషాలు!
స్వాయంభువ మన్వాది సంవత్సరాలను క్షీరాబ్ధి ద్వాదశి రోజు నుంచి లెక్కిస్తారు.
‘గోవత్స ద్వాదశి’గా పిలిచే ఈ రోజున వత్సంతో అంటే దూడతో కూడిన ఆవును దానం ఇస్తే విశేష ఫలం లభిస్తుందని ఆస్తికుల విశ్వాసం.
ఏకాదశి నుంచి పూర్ణిమ వరకూ ‘భీష్మ పంచక వ్రతం’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరణశయ్యపై ఉన్న పితామహుడు భీష్ముని దాహార్తి తీర్చడానికి అర్జునుడు తన బాణంతో పాతాళగంగను పైకి రప్పించినది ఈ రోజునేనని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి.
**తులసిపూజ సంప్రదాయం
హిందూ సంస్కృతిలో తులసి అతి పవిత్రం. తులసీ కృష్ణుల అనుబంధం కూడా అటువంటిదే. తులసికోట లేని ఇల్లంటూ ఉండదు. మహిళలు తులసిని ప్రతిరోజూ పూజిస్తారు. తులసికి నీరు పోసి, దీపం పెట్టి, తులసీ స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేసి, చివరగా తులసికోటలోని తీర్థాన్నీ, తులసీ దళాన్నీ స్వీకరిస్తారు. తులసిని పూజించడం అంటే లక్ష్మిని ఆరాధించడమే. క్షీరాబ్ధి ద్వాదశి రోజున తులసి పూజ… లక్ష్మీ నారాయణులకు చేసే పూజ. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ ఆరాధన ప్రేమకూ, భక్తికీ, ప్రతీక. తులసి తీర్థం, తులసీ దళం మీదుగా వచ్చే గాలి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తులసిలో రోగనివారక శక్తి ఉందని ఆయుర్వేదం నిరూపించింది.
5. తెరుచుకున్న అయ్యప్ప ఆలయం
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ‘మండల మకర విళక్కు’ పూజల నిమిత్తం శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు శుక్రవారం తెరుచుకున్నాయి. శుక్రవారం సాయంత్రం సరిగ్గా అయిదుగంటలకు ప్రధానపూజారి కందరారు రాజీవరు తదితరుల సమక్షంలో ఆలయ ద్వారాలను తెరిచారు. చలిగాలులను సైతం లెక్కచేయకుండా ఇరుముడితో భక్తులు అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మరోవైపు.. ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు తమకు కొంత వ్యవధినివ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) తాజాగా వెల్లడించింది. వీలైతే శనివారం లేదంటే సోమవారం సర్వోన్నతన్యాయస్థానం ముందు తమ అభ్యర్థనను ఉంచుతామని టీడీబీ సారథి ఎ.పద్మకుమార్ చెప్పారు.

6. తిరుగిరుల్లో కొత్త దారులు
తిరుమల కనుమ మార్గంలో రెండు కొత్తదారులు రానున్నాయి. మొదటి ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగి పడే ప్రమాదంతో పాటు భవిష్యత్తులో పెరిగే రద్దీ దృష్ట్యా కొత్త మార్గాలను నిర్మించాలని తితిదే యోచిస్తోంది. నడకదారి భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని వేయాలని తలపోస్తోంది. ఈ రెండు దారులను మొదటి ఘాట్‌ రోడ్డు(తిరుమల నుంచి తిరుపతికి వచ్చే దారి)కు అనుసంధానంగానే వేయనున్నారు.
*మోకాలి పర్వతంనుంచి జీఎన్‌సీ వరకు ఇది పూర్తిగా కొత్త దారి. పొడవు రెండు కిలోమీటర్లు. మోకాలి పర్వతంనుంచి తిరుమల ముఖద్వారమైన గరుడాద్రినగర్‌ టోల్‌గేట్‌ (జీఎన్‌సీ) వరకు కనుమ దారుల్లో నిర్మిస్తారు. దీని సాధ్యాసాధ్యాలపై ఎల్‌అండ్‌టీ సంస్థ ఇటీవల సర్వే చేసింది. రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ నిర్మాణానికి అటవీ అనుమతులు పొందేందుకు తితిదే సమాయత్తమవుతోంది. మొదటి కనుమ దారిలో 11వ కిలోమీటరు వద్ద తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.
* ప్రస్తుతం మోకాలి పర్వతం వద్ద రెండో ఘాట్‌(తిరుపతి నుంచి తిరుమల)ను అనుసంధానిస్తూ లింకు రోడ్డు ఉంది. దీన్ని అందుబాటులోకి తెస్తే ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మార్గంలో వాహనాలను మళ్లించవచ్చు.
* కొత్త మార్గం వల్ల వన్‌వే ఇబ్బందులు తప్పుతాయి. రెండు మార్గాల్లోనూ వాహనాలు టోల్‌గేట్‌ వరకు చేరుకోవచ్చు. రెండోఘాట్‌లో ప్రమాదం జరిగినా ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఉండవు. దీనిపై సాంకేతిక సర్వే పూర్తి చేసి ప్రభుత్వ, అటవీ శాఖల అనుమతులు వచ్చాక టెండర్లు పిలిచేందుకు తితిదే సిద్ధమవుతోంది.
* మోకాలిపర్వతం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయంవరకు కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకోసం ఈ రహదారిని నిర్మించనున్నారు. మోకాలి పర్వతం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 1.4 కి.మీ. దూరం ఉంది.
* మొదటి ఘాట్‌లో అక్కంగార్ల ఆలయం వద్ద కీలక మలుపులకు తోడు రోడ్డు కేవలం ఐదు మీటర్ల వెడల్పే ఉంటుంది. ఫుట్‌పాత్‌లు లేవు. కీలకమైన 1.4 కి.మీ.పరిధిలో నడకదారి భక్తుల కోసం ఫుట్‌పాత్‌ను నిర్మించాలన్నది ఓ ప్రతిపాదన. దీన్ని ఆచరణలో పెట్టాలంటే కచ్చితంగా మొదటిఘాట్‌ రోడ్డులో కొన్ని రోజులైనా వాహనాల రాకపోకలు నిలిపేయాలి. ఆ సందర్భంలో కిందికి దిగే వాహనాల కోసం తితిదే ప్రత్యామ్నాయం వెదుకుతోంది.

7. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
సిరుల‌త‌ల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్‌ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం డిసెంబరు 3వ తేదీ సోమవారం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 27వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
**వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
4-12-2018(మంగళవారం) ధ్వజారోహణం చిన్నశేషవాహనం
5-12-2018(బుధవారం) పెద్దశేషవాహనం హంసవాహనం
6-12-2018(గురువారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
7-12-2018(శుక్రవారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
8-12-2018(శనివారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
9-12-2018(ఆదివారం) సర్వభూపాలవాహనం స్వర్ణరథం, గరుడవాహనం
10-12-2018(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
11-12-2018(మంగళవారం) రథోత్సవం అశ్వ వాహనం
12-12-2018(బుధవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.

8. శుభమస్తు
తేది : 17, నవంబర్ 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(నిన్న ఉదయం 9 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 51 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష
(నిన్న ఉదయం 11 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 22 ని॥ వరకు)
యోగము : వ్యాఘాతము
కరణం : కౌలవ
వర్జ్యం :
(ఈరోజు రాత్రి 9 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 4 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు ఉదయం 6 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 9 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 7 గం॥ 51 ని॥ నుంచి ఉదయం 8 గం॥ 36 ని॥ వరకు)
ాహుకాలం :
(ఉదయం 9 గం॥ 10 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 6 గం॥ 21 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 45 ని॥ వరకు)
యమగండం :
(మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ నుంచి మద్యాహ్నం 2 గం॥ 48 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 21 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 39 ని॥ లకు
సూ్యాశి : వృచ్చికము
చంద్రరాశి : కుంభము

9. శబరిమల యాత్రకు వెళ్లు అయ్యప్పలకు,భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి………….
1. ప్రైవేట్ వాహనాలు “నిలక్కల్”
వరకు మాత్రమే అనుమతి…..
2. “నిలక్కళ్” నుండి “పంబ” వరకు . కేరళ రాష్ట్ర RTC బస్సుల ద్వారా మాత్రమే ప్రయానించవలేను. ఆ బస్ లో కండక్టర్ ఉండరు…కావున కూపన్ కొని బస్ లో ప్రయానించవలెను…
3. మీరు పంబ చేరిన తర్వాత త్రివేణి బ్రిడ్జి అయ్యప్ప వారధి (కొత్తగా నిర్మించిన) మీదుగా సర్వీస్ రోడ్డు ద్వారా కన్నిమూల
గణపతి ఆలయం చేరుకోవాలి.
4. పంబ నుండి కాలినడక వంతెనమూసివేయబడింది
(గమనించగలరు).
5. త్రివేణి నుంచి “ఆరాట్టు కడావు”వరకు గల ప్రదేశాలు మట్టి బురద తో నిండి ప్రమాడపూరిటంగవున్నాయి కావున ఎవ్వరూక్రిందికి దిగరాదు.
6. పంబలో భక్తులకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే స్నానం
చేయాలి. మిగిలిన ప్రదేశాలలోస్నానం చేయరాదు.
7. సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాలను తప్పనసరిగా పాటించాలి. పంబపోలీసుస్టేషన్ ముందు ప్రదేశంపూర్తిగా దెబ్బతింది.కావున ఆ
మార్గం గుండా కొండ పై కిఎక్కరాదు.
8. పంబ పెట్రోల్ బంక్ నుండి “u”టర్నింగ్ పూర్తిగా దెబ్బతింది.
కావున ఆ ప్రాంతం పూర్తిగామూసివేయబడింది.
9. పంబ పరిసరాలు, అడవి దారిలో ప్రమాదకరమైన “పాములు” బాగా సంచరిస్తున్నందువల్ల జాగ్రత్త గా వుండాలి.
10. అనుమతి లేని దారుల ద్వారా కొండ ఎక్కరాధు.
11. త్రాగు నీటిని వెంట తీసుకెళ్లాలి.
12.ప్లాస్టిక్ వస్తువులను వాడరాదు
13. భోజనం, టిఫిన్స్ స్టాల్ నీలక్కలలో కలవు.
14. ఇరుముడి లో ప్లాస్టిక్ కవర్లు,వస్తువులు ఉండరాదు
15. మీ కు అవసరమైన కొద్దిపాటితినుబండారాల తెచ్చుకోవాలి
16. మంచినీటి కొరత వల్ల నీటినిృదాచేయరాధు ( నీటి పైపు లు పాడైన కారణంగా).
17. ఇటీవల వరదల కారణంగా నీలక్కళ్. పంబ. సన్నిధానం ప్రాంతాల్లో మరుగుదొడ్లు పాడైపోవటం వల్ల నియమితమరుగుదొడ్ల ను వాడుకోవాలి.
పైన చెప్పినవన్నీ devaswom board వారి ఉత్తర్వుల ను అందరూ పాటించి స్వామి అయ్యప్ప వారి క్షేత్రం లో క్రమశిక్షణ తో ప్రయాణించి స్వామి అయ్యప్ప వారి కృపా కటాక్షాన్ని పొందగలరు.

10. తిరుమల సమాచారం
ఈరోజు శనివారం *17-11-2018* ఉదయం *5* సమయానికి….
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ….శ్రీ వారి దర్శనానికి *06* కంపార్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు… వారి సర్వ దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి *02* గంటల సమయం పడుతోంది.నిన్న నవంబర్ *16* న *66,614* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు *23,075* మంది.. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.01* కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com