NRI-NRT

అధ్యక్షుడిని వెళ్లగొట్టిన యూట్యూబ్

అధ్యక్షుడిని వెళ్లగొట్టిన యూట్యూబ్

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సోష‌ల్ మీడియా సంస్థ‌లు త‌మ ప్ర‌తాపాన్ని కొన‌సాగిస్తున్నాయి. ట్రంప్ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఇప్ప‌టికే శాశ్వ‌తంగా బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. క్యాపిట‌ల్ హిల్ దాడి ఘ‌ట‌న త‌ర్వాత సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌న్నీ ట్రంప్‌ను బ్లాక్ చేస్తున్నాయి. తాజాగా యూట్యూబ్ కూడా మ‌రో కొర‌డా ఝులిపించింది. ట్రంప్ ఛాన‌ల్‌లో తాజాగా అప్‌లోడ్ చేసిన‌ కాంటెంట్‌ను యూట్యూబ్ తీసివేసింది. త‌న విధానాల‌ను ఉల్లంఘించిన‌ట్లు కూడా యూట్యూబ్ ఆ ఛాన‌ల్‌కు వార్నింగ్ ఇచ్చింది. హింస‌ను రెచ్చ‌గొడుతున్న‌ట్లుగా ట్రంప్ ఛాన‌ల్ కాంటెంట్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో ఏడు రోజుల పాటు ట్రంప్ ఛాన‌ల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌కుండా యూట్యూబ్ చ‌ర్య‌లు తీసుకున్న‌ది.

ట్రంప్ ఛాన‌ల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సామాజిక సంఘాలు మంగ‌ళ‌వారం డిమాండ్ చేశాయి. లేదంటే వాణిజ్య ప్ర‌క‌ట‌నల‌ను నిలిపివేసే ప్ర‌చారం చేప‌డుతామ‌ని హెచ్చ‌రించారు. స్టాప్‌హేట్ ఫ‌ర్ ప్రాఫిట్ ఉద్య‌మ సంస్థ ఈ వార్నింగ్ ఇచ్చింది. గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ నుంచి ట్రంప్ ఛాన‌ల్‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. తాజా ఎన్నిక‌ల గురించి ఆ ఛాన‌ల్‌లో అస‌త్య ప్ర‌చారాలు సాగుతున్న‌ట్లు ఆరోపించారు. ట్రంప్ ఛాన‌ల్‌లో ఉన్న హోమ్‌పేజీలో ఓ వీడియో ఉన్న‌ది. ఎన్నిక‌ల్లో మోసం జ‌రిగిన‌ట్లు ఆ వీడియోలో ట్రంప్ ఆరోపించారు. దాన్ని డిలీట్ చేయాల‌ని డిమాండ్లు ఉన్నాయి.

ట్రంప్ ఛాన‌ల్‌కు సుమారు 2.77 మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. క్యాపిట‌ల్ హిల్ ఘ‌ట‌న త‌ర్వాత ట్రంప్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల‌ను తాత్కాక‌లింగా ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఇక ట్విట్ట‌ర్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేశారు. స్నాప్‌చాట్‌, ట్విచ్ లాంటి సోష‌ల్ మీడియాను కూడా ట్రంప్‌కు దూరం చేశారు. త‌మ ఫ్లాట్‌ఫాంను ట్రంప్ దుర్వినియోగం చేశార‌ని, దానితో హింస రెచ్చ‌గొట్టేలా చూశార‌ని ఎఫ్‌బీ చీఫ్ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ తెలిపారు.