Devotional

సంక్రాంతి పండుగ వెనుక విశేషాలు…ఆచారాలు

సంక్రాంతి పండుగ వెనుక విశేషాలు…ఆచారాలు

హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ – ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ సంప్రదాయాన్ని పేర్కొంటారు. యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని చేయించినా మనసు అపవిత్రంగానూ దురాచనలతోనూ ఉంటే అది ‘యోగం’ (రెంటి కలయిక) కా(లే)దు. అదే తీరుగా మనసెంతో పరిశుభ్రంగా ఉన్నా శరీరం స్వేదమయంగానూ అలసటతోనూ సహకరించ(లే)ని స్థితిలోనూ ఉన్నట్లయితే అది కూడా ‘యోగం’ అయ్యే వీల్లేదన్నారు పెద్దలు. ఆ కారణంగా శరీరమూ మనస్సూ అనే రెండూ పవిత్రంగా ఉండేందుకు స్నానాలని చేయాలని ఓ నియమాన్ని చేశారు పెద్దలు. కార్తీకం నెలపొడుగునా స్నానాలని చేసినట్లే ఈ మార్గశీర్ష పుష్యమాసాల్లో కూడా ప్రతిరోజూ స్నానాలని చేయాలన్నారు. దీనికి మరో రహస్యాన్ని కూడా జోడించవచ్చు. చంద్రుని పుట్టు నక్షత్రం మృగశిర. మృగశిర + పూర్ణిమ చంద్రుడు కలిస్తే అది మార్గశీర్ష మాసం అవుతుంది. చంద్రునికి ఇష్టురాలైన భార్య ‘రోహిణి’ (రోహిణి శశినం యథా). ఈ రోహిణి, మృగశిర అనే రెండు నక్షత్రాలూ ఉండే రాశి ‘వృషభం’. కాబట్టి ఈ మార్గశీర్షం నెలపొడుగునా స్నానాలని చేస్తే తన జన్మ నక్షత్రానికి సంబంధించిన మాసంలో స్నానాలని చేస్తూన్న మనకి చంద్రుడు మనశ్శాంతిని (చంద్రమా మనసో జాతః) అందిస్తాడు. చలీ మంచూ బాగా ఉన్న కాలంలో తెల్లవారుజామున స్నానాలని చేయగలిగిన స్థితిలో గనుక మన శరీరమే ఉన్నట్లయితే యోగ దర్శనానికి భౌతికంగా సిద్ధమైనట్టేననేది సత్యం.

***రంగవల్లికలు
రంగమంటే హృదయం అనే వేదిక అని అర్థం. ‘వల్లిక’ అంటే తీగ అని అర్థం. ప్రతి వ్యక్తికీ తన బుద్ధి అనే దాని ఆధారంగా అనేకమైన వల్లికలు (ఆలోచనలు) వస్తూ ఉంటాయి. ఆ అన్నిటికీ కేంద్రం (ముగ్గులో మధ్యగా ఉన్న గడి లేదా గదిలాంటి భాగం) సూర్యుని గడి కాబట్టి అక్కడ కుంకుమని వేస్తారు మహిళలు. కాబట్టి ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతో ఆ బుద్ధి సక్రమమైన వేళ ఆ సక్రమ బుద్ధికి అనుగుణంగానే ఈ వల్లికలన్నీ ఉంటాయనేది యోగదృష్టి.ఆ సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలనిస్తూంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను అనే వీటితో ఆయా పనులని చేయిస్తూంటుందన్నమాట.

*** మొదటిరోజు ‘భోగి’
భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే అలా పడగ కలిగినది ‘పాము’ అని అర్థం. అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తి కూడా శరీరంలోని వెన్నెముకని లాగి పట్టి స్థిరాసనంలో (బాసింపెట్టు) ఉంటూ, ముక్కు మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్లని మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అదే ‘యోగ దర్శన’మౌతుందని చెప్పడానికీ, ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు నేడే అని తెలియజేయడానికీ సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజుని ‘భోగి’ అని పిలిచారు. యోగ ధ్యానాన్ని చేస్తూన్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికీ, దాన్ని బాల్యం నుండీ అలవాటు చేయాలని చెప్పడానికీ సంకేతంగానే – పిల్లలకి రేగుపళ్లని పోస్తూ వాటిని ‘భోగిపళ్లు’గా వ్యవహరించారు.

*** రెండవ రోజు – మకర సంక్రాంతి
“సరతి చరతీతి సూర్యః” అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. “ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత” అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. “సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే “చేరడం” లేదా “మారడం”అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం”సంక్రాంతి”ని ఇలా నిర్వచించింది. “తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరితఃసూర్యస్య పూర్వన్మాద్రాశేఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః”మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది. “రవి సంక్రమణే ప్రాపే నన్నా యాద్యన్తు మానవఃసప్త జన్మసు రోగీ స్యానిర్దేనశే్చన జాయతే” అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే , రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా , దరిద్రునిగా ఉండిపోతాడని భావం. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు.

########

సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి…

సూర్యుని దివ్య యాత్రల్లో ప్రధాన ఘట్టాలలో మేష, తుల, మకర సంక్రమణలు ముఖ్యమైనవి సూర్యుడు మకర రాశి చేరగానే ప్రకృతిలో అనేక మార్పులు కలుగుతాయి. ఆ మార్పుల చైతన్యమే ‘మకర సంక్రాంతి’ లో కనుపిస్తుంది. సంవత్సరాన్ని రెండు ఆయనములుగా మనం విభజించుకుంటున్నాం కనుక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకూ దక్షిణాయనం. మకర సంక్రమణం నుంచి కటక సంక్రమణం వరకూ ఉత్తరాయణం.

ఉత్తరాయణము దేవతా పూజకు, దక్షిణాయనము పితృదేవతారాధనకు ప్రధానం. ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్ళకు చేరుకుంటాయి. పశుపక్ష్యాదులు ఆనందంగా కనుపిస్తాయి.

వాస్తవానికి మన దేశంలో ప్రాకృతిక జీవనం అద్భుతంగా కనుపించేది ఈ పండుగ తరుణంలోనే. సూర్యుడు ధనూరాశి నుంచి మకర రాశికి ప్రవేశించగానే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ పల్లె ప్రజలను ఆనందంగా ఉంచే పండుగ పిల్లల్ని, పెద్దల్ని, ముఖ్యంగా రైతుల్ని ఆనందోత్సాహాలలో ఓలలాడించే ఈ పండుగ మూడు రోజులు సాగుతుంది.

పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట !

సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది !తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.

కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.

సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.

_సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ ఐదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు… సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది !

##############

తెలుగునాట దీనిని పెద్ద పండగగా వ్యవహరిస్తారు. రైతులకు పంటలు ఇంటికి రావటంతో కొంచెం తీరిక దొరికి సంబరంగా చేసుకునే పంటలకు సంబంధించిన ముఖ్యమైన పండుగ ఇది. సూర్యుడు భూమధ్య రేఖకి ఉత్తరంగా ప్రయాణించటాన్ని ఉత్తరాయణమనీ, దక్షిణంగా ప్రయాణించటాన్ని దక్షిణాయమనీ అంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడుగనుక ఉత్తరాయణాన్ని మకర సంక్రాంతి, మకర సంక్రమణమనీ, అలాగే దక్షిణాయంలో సూర్యుడు కర్కాటకం రాశిలో ప్రవేశించటాన్ని కర్కాటక సంక్రమణమనీ అంటారు. సంక్రాంతి అన్నా, సంక్రమణం అన్నా జరగటం అని అర్ధం. అంతేకాదు ఉత్తరాయణం దేవతలకు పగలుగా, దక్షిణాయణం దేవతలకు రాత్రిగా భావిస్తారు. అందుకే ఉత్తరాయణకాలం పుణ్యకాలం అంటారు. ఈ రెండు సంక్రమణాలూ ఆంగ్లమాసం ప్రకారం జనవరి 14, జూలై 16న వస్తాయి. ఆంగ్లమానానికి ఆధారం ఉత్తర, దక్షిణ తేదీలేనంటారు మన పెద్దలు. మహా భారతంలో కురువృధ్ధుడైన భీష్మాచార్యుడు అంపశయ్యమీద పవళించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పుడే (మకర సంక్రాంతి) తన ప్రాణాలను వదిలాడు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి పునర్ జన్మ వుండదని నమ్మకం.

మనం భోగి, పెద్ద పండుగ, కనుమ అని మూడు రోజులు జరుపుకునే ఈ పండగ సంబరాలు అసలు నెల రోజులు జరుపుకుంటారు. ఎలాగంటారా సంక్రాంతి అనగానే మీకు గుర్తుకొచ్చేవి ఏమిటి చెప్పండి? ఈ కాలం సిటీల్లోని పిల్లలకి కూడా మీడియా పుణ్యమాని పండగ రోజులు ఊదర కొట్టేసి మరీ చెబుతున్నారు కదా పండగ విశేషాలు. మరి సంక్రాంతి అనగానే ముందు గుర్తొచ్చేవి ఇంటికి వచ్చే కొత్త పంటలు, ఇంటి ముందు తీర్చిదిద్దిన అందమైన ముగ్గులు, వాటిలో రక రకాల పూలతో అలంకరింపబడ్డ గొబ్బెళ్ళు, హరిదాసు గానాలు, గంగిరెద్దు ఆటలు, పులి వేషాలు, గాలి పటాలు, భోగి మంటలు, భోగి పళ్ళు బొమ్మల కొలువులు, కోడి పందాలు … అబ్బో .. ఇవ్వేనా … ఇంకా చాలా వున్నాయి. మరి కొత్త అల్లుళ్ళని ఇంటికి పిలిచి మర్యాదలు చెయ్యటం .. అంటే కొత్తగా పెళ్ళయినవారి విరిసీ విరియని ప్రేమలు, నును సిగ్గులు చూడాలంటే ఇలాంటి పండగల్లోనే గొప్ప అవకాశం. కొత్త బియ్యంతో చేసే అరిసెలూ, పండగనాడు కొత్త బియ్యంతో వండి దేవుడికి నైవేద్యం పెట్టే పరవాణ్ణంవంటి పిండివంటలు, కొసరి కొసరి వడ్డింపులు సరేసరి.

పెద్ద పండగ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. అలాగే కనుమనాడు వ్యవసాయ పనులలో తమకి తోడుగా వుండి పంటలు పండించటంలో భాగస్వాములైన పశువులకి పూజ చేస్తారు.

ఇదివరకు ఈ సంబరాలన్నీ ప్రత్యక్షంగా అనుభవించినా, నేటితరానికి ఈ సంబరాలు మీడియాలో ముచ్చట్లే, అయితే పల్లెటూళ్ళలో ఈ పండుగ ఛాయలు ఇంకా కనబడుతున్నాయి. అందుకే ఈ పండగకి సిటీలు బోసిపోతాయి, పల్లెటూళ్ళు ఫక్కున నవ్వుతాయి. పండగ ముచ్చట్లు వివరంగా చూద్దాం.

ధనుర్మాసం మొదలయినప్పటినుంచీ ఇంటి ముంగిట పేడ కళ్ళాపులు జల్లి, పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చి ముచ్చట పడతారు మగువలు. ఈ రంగవల్లులు తీర్చటంలో కూడా పోటీలు .. ఎవరు పెద్ద ముగ్గు వేశారు, ఎవరు అందంగా వేశారు, ఎవరు కొత్త ముగ్గు వేశారు వగైరా. వారి ఇంటి ముందు ముగ్గు వెయ్యటం పూర్తి కాగానే ఆ వీధిలో, వీలుంటే పక్క వీధుల్లో కూడా ఎవరే ముగ్గు వేశారో చూసి రావాలి. ఆ సంబరమే వేరు. పండగనాడు వాటిల్లో రంగులు నింపటం నేటి సరదా అయితే వాటిలో పసుపు కుంకుమలు, పూలు జల్లటం ఇదివరకటి సంబరం.

రంగవల్లులతో ఆగిపోదండీ ఆడ పిల్లల ముచ్చట్లు. తెల్లవారుఝామునే లేచి, ఆవు పేడని సేకరించి, గొబ్బెమ్మలు చేసి, వాటిని అలంకరించి, పూజ చేస్తారు. ఇంటి ముందు రంగవల్లులలో వాటిని అమర్చి, మధ్యాహ్నం వాటిని తీసి గోడకి పిడకలు కొట్టటం, వాటిని తీని ఎండబెట్టి, దండలు గుచ్చటం .. అబ్బో ఎన్ని పనులో..

ధనుర్మాసం మొదలయినప్పటినుంచీ నెలంతా ఈ గొబ్బెమ్మలు పెడతారు. మధ్యలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో అనుకుని సందె గొబ్బెమ్మ పెడతారు. ఆ రోజు సాయంకాలం ఇంటి ముందు శుభ్రం చేసి సందె ముగ్గు వేస్తారు. సందె ముగ్గు అంటే సాయంకాలం ఇల్లూ, వాకిలీ ఊడ్చి, వాకిట్లో పలచగా ఒక చెంబు నీళ్ళు చల్లి, గుమ్మానికి అటో రెండు కర్రలు, ఇటో రెండు కర్రలు ఏటవాలుగా ముగ్గుతో వేసి మధ్యలో రాంబాణం, నక్షత్రంలాంటి చిన్న ముగ్గు వేస్తారు. (ఇది వరకు ఇలా ప్రతి ఇంటి ముందూ ఏడాది పొడుగూ రోజు వేసేవారు). ఆవు పేడతో మూడు పెద్ద గొబ్బెమ్మలు చేసి ఒక పీటపై పసుపు, కుంకుమ, బియ్యంపిండితో ముగ్గులు వేసి గొబ్బెమ్మలనుకూడా పసుపు, కుంకుమ, బియ్యంపిండి, పూలతో అలంకరించి ఆ పీటమీద పెట్టి వాకిట్లో పెడతారు. ఇందులో ఒక గొబ్బెమ్మ మిగతా వాటికన్నా కొంచెం పెద్దగా వుంటుంది .. ఇది తల్లి గొబ్బెమ్మ, మిగతావి పిల్ల గొబ్బెమ్మలు. ఆ ఇంటి ఆడ పిల్లలు తమ తోటి ఆడ పిల్లలను పేరంటం పిలిచి వస్తారు. అందరూ సాయంకాలం ఆగొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈ పాటలలో ఎక్కువ కృష్ణుడి గురించే వుంటాయి.

ఆ గొబ్బెమ్మలకి పూజ చేసి నైవేద్యం పెట్టి, వచ్చిన బాలలందరితో కలిసి తామూ నైవేద్యాన్ని ఆరగిస్తారు. సాధారణంగా దీనికి పచ్చి శనగపప్పు వుడకబెట్టి, తాలింపు వేసి పెడతారు. సంక్రాంతి నెల అంతా ఈ సంబరాలతో ఇళ్ళు ఎంత కళకళలాడుతుంటాయో! ఆధునికులకు ఇవి పేడ ముద్దలుగానూ, వాటికి నైవేద్యం పెట్టటం ట్రాష్ గానూ అనిపించవచ్చు. కానీ దీనిలోని అంతరార్ధం వేరు. .. ఇవి పేడ ముద్దలు కావు. గోపికలు. గోపికలకు ప్రతి రూపంగా పెట్టబడ్డవి. వీటి మధ్యలో సాధారణంగా ఒక పెద్ద గొబ్బెమ్మని వుంచుతారు. ఆవిడ భక్తిలో ఉత్తమ స్ధానంలో వున్నదన్నమాట.. ఈ సందర్భానికి తగినట్లుగా గోదాదేవి అనుకోవచ్చు. ఇలా ఆలోచిస్తే గొబ్బెమ్మలంటే గోపికలు, వారిమధ్య కృష్ణ సేవలో తరించి ఆయనని చేరిన గోదాదేవి .. అందుకే శ్రావ్యమైన కృష్ణ గీతాలని పాడటం, ఆ చరిత్రలు గుర్తు చేసుకోవటం.