శైవక్షేత్రాల్లో కార్తీక సోమవారం సందడి

కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సామర్లకోట, పిఠాపురం తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వ్రత మండపాలు కిటకిటలాడాయి. ఒంగోలులో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంతోపాటు శివాలయాలన్నీ ముకంటి నామస్మరణతో మారుమోగాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఎరగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లెలచెరువు, డోర్నాలలోని శివాలయాల్లో కార్తీక దీపారాధన చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం, ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, ఉమామహేశ్వర వ్రతాలు నిర్వహించారు. ఉచిత దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజశ్వేరస్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. వరంగల్లోని వేయిస్తంభాల గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1.శబరిమలపై సుప్రీం తీర్పుపై చినజీయర్ వ్యాఖ్య
ప్రతి ఆలయానికి కొన్ని నియమ నిబంధనలుంటాయని, దైవంపై నమ్మకం ఉంటే వాటిని గౌరవించాలని.. లేకపోతే వాటి జోలికి వెళ్లవద్దని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. చెన్నైలో ఆదివారం వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు అలా తీర్పునిచ్చిందని, మసీదు విషయంలో ఇలాగే ఎందుకు ప్రశ్నించదని పేర్కొన్నారు. దేవాలయాలు, శాస్త్రాల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని విమర్శించారు. సుప్రీం తీర్పు శాస్త్రాలకు విరుద్ధంగా ఉండటం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించిందని గుర్తుచేశారు. సమాజానికి ప్రమాదం లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ పొందే హక్కుందని అన్నారు. ‘అయ్యప్ప కొండపై ఉన్నాడు. కిందికి దిగడు. ఆయన దారిన ఆయన ఉన్నప్పుడు నమ్మకం ఉన్నవాళ్లు వెళ్తారు. లేదంటే వదిలేయాల’ని పేర్కొన్నారు. శాస్త్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ఇతరులు జోక్యం చేసుకోవటం అంత మంచిది కాదని హితవు పలికారు. హైదరాబాద్ వద్ద శంషాబాద్లో ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరిట భగవాన్ రామానుజాచార్యుల 216 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్టు చిన్నజీయర్ స్వామి వెల్లడించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ నిర్మాణం 2019 మే నాటికి పూర్తి కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తర్వాత ప్రధాన మంత్రి మోదీ సమక్షంలో ఆవిష్కరించాలన్నది తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.

2. మనగుడి ఏర్పాట్లు పూర్తి -తెలుగు రాష్ట్రాల్లోని 12,480 ఆలయాల్లో కార్యక్రమం
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 23వరకు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టనున్న 14వ విడత మనగుడి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన 12,480 ఆలయాల్లో తితిదే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. 20న మంగళ కైశిక ద్వాదశి, 21న ఆలయ శోభ, 22న కార్తీక దీపోత్సవం, 23న ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఆలయాలకు మనగుడి పూజాసామగ్రి పసుపు, కుంకుమ, అక్షింతలు, కలకండ, కంకణాలు అందించారు.

3. సత్యసాయి జయంతి వేడుకలకు శ్రీకారం
అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం పుట్టపర్తిలో సత్యసాయి 93వ జయంతి వేడుకలు ఆదివారం వేణుగోపాలస్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చి, పట్టణ వీధుల్లో వేలాది మంది భక్తులు సాయి నామస్మరణతో ముందుకు లాగారు. ఉభయ రాష్ట్రాల భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. 19న (సోమవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20న ఆధ్యాత్మిక సదస్సు, 22న సత్యసాయి విశ్వవిద్యాలయం 37వ స్నాతకోత్సవం జరగనున్నాయి. 23న సాయి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. 24న అంతర్జాతీయ యువ సమ్మేళనం నిర్వహిస్తారు. వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.

4. పెనుగంచిప్రోలు అమ్మవారికి వడ్ల కంకుల చీర
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ మూలవిరాట్కు అలంకరించేందుకు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కళాకారులు సింగంశెట్టి శివనాగేశ్వరమ్మ, సుబ్బారావు దంపతులు వడ్ల కంకులు, ఎండుగడ్డి పోచలతో ప్రత్యేకంగా చీర, హారం రూపొందించారు. డిసెంబరు 2న అమ్మవారికి అలంకరించనున్నట్లు ఆదివారం వారు తెలిపారు. చీర, హారం తయారీకి వారం రోజుల సమయం పట్టిందన్నారు.

5.22న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం
తిరుమల ఆలయంలో ఈనెల 22వ తేదీన కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఏటా తమిళ కార్తీకమాసంలో పౌర్ణమి రోజున శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆ రోజు సాయంత్రం 6నుంచి రాత్రి 8గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో మూలమూర్తి దర్శనానికి భక్తులను అనుమతించరు. ఆ రోజు వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, పున్నమి గరుడసేవలను రద్దు చేశారు.

6.శ్రీశైలంలో కార్తీక రద్దీ
శ్రీశైలంలో కార్తీకమాస రద్దీ కొనసాగుతోంది. ఆదివారం వేలాదిగా వచ్చిన భక్తులు వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. నాగులకట్ట, గంగాధర మండపం, ఉసిరిచెట్లు, ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు వేకువజామున, సాయంత్రం కార్తీక దీపాలను వెలిగించారు. గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను పరిమితంగా ఇస్తున్నారు. రెండో సోమవారం పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు నవహరతులు, లక్షదీపోత్సవం నిర్వహిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com