Videos

“ధర్మచక్రం” 25ఏళ్ల వార్షికోత్సవం

“ధర్మచక్రం” 25ఏళ్ల వార్షికోత్సవం

తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రకథానాయకుల్లో వెంకటేశ్‌ ఒకరు. ఆయన కెరీర్‌లో గుర్తిండిపోయే చిత్రాల్లో ‘ధర్మచక్రం’ ఒకటి. 1996 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బుధవారంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సురేశ్‌ కృష్ణ దర్శకత్వం శైలి, వెంకటేశ్‌ నటన, ఎం.ఎం.శ్రీలేఖ అందించిన స్వరాలు ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. వెంకటేశ్‌ తండ్రి పాత్రలో ప్రతినాయకుడిగా నటించిన గిరీశ్‌ కర్నాడ్‌ నటన ఈ సినిమాకు మరో ప్రత్యేకత. రాకేశ్‌(వెంకటేశ్‌) ఒక న్యాయవాది. అతడి తండ్రి మహేంద్ర(గిరీశ్‌ కర్నాడ్‌) పేరున్న రాజకీయ నాయకుడు. తల్లి శారద(శ్రీవిద్య). సురేఖ(ప్రేమ) అనే మధ్య తరగతి అమ్మాయిని రాకేష్ ప్రేమిస్తాడు. ఇది రాకేశ్‌ తండ్రి మహేంద్రకు నచ్చదు. దీంతో సురేఖను వేశ్యగా చిత్రీకరించి ఆమె మరణానికి కారణమవుతాడు. ఈ విషయం తెలిసిన రాకేశ్‌ తన తండ్రిని అసహ్యించుకుని వైరం పెంచుకుంటాడు. తల్లి శారద భర్త, కొడుకుల మధ్య నలిగిపోతూ ఉంటుంది. రాకేశ్‌కు తల్లి మాటంటే వేదవాక్కు. ఆమె తనయుడి ఆవేశాన్ని నియంత్రిస్తూ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. అటు రాజకీయాలు, ఇటు కుటుంబం కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైన మహేంద్ర బాలామణి(కృష్ణవేణి)ని హత్య చేస్తాడు. దాని నుంచి తప్పించుకునేందుకు రాకేశ్‌ను ఈ కేసు వాదించమని కోరతాడు. అందుకు రాకేశ్‌ అంగీకరించడు. మహేంద్ర తన తెలివి తేటలతో అతని తల్లిని పావుగా ఉపయోగించి పతి భిక్ష పెట్టమని రాకేశ్‌ను కోరమంటాడు. తల్లి మాట కాదనలేక రాకేశ్‌ కేసు ఒప్పుకొంటాడు. మరి ఈ కేసులో ఎవరు గెలిచారు?మహేంద్ర తప్పించుకున్నాడా? లేదా? అన్నది ‘ధర్మచక్రం’కథ.