Business

టెస్లా బుడగ పగులుతుంది

Raghuram Rajan Says TESLA Bubble Will Burst One Day

వ‌ర్చువ‌ల్ మ‌నీ.. బిట్ కాయిన్‌.. ఒక క్లాసిక్ బ‌బుల్ (బుడ‌గ‌) అని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ తేల్చేశారు. ప్ర‌ముఖ విద్యుత్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ అసాధార‌ణ రీతిలో పెరిగిపోవ‌డానికి ఇదే కార‌ణం అని చెప్పారు. 2008 ఆర్థిక మాంద్యం ప్ర‌భావాన్ని ముందే ప‌సిగ‌ట్టిన ఆర్థిక వేత్త ర‌ఘురామ్ రాజ‌న్‌. ఒక‌వేళ ప్ర‌పంచం మ‌రో సంక్షోభంలో చిక్కుకుంటే బిట్ కాయిన్‌, టెస్లా విలువ బుడ‌గ మాదిరిగా దూసుకెళ్తాయ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. బుడ‌గ వంటి మార్కెట్ల ధోర‌ణి, ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి విధానం స‌ర‌ళ‌త‌రం, త‌క్కువ వ‌డ్డీరేట్లు ఇవ‌న్నీ బిట్ కాయిన్ విలువ పెరుగ‌డానికి కార‌‌ణం అన్నారు. గ‌తేడాది 10 వేల డాల‌ర్లున్న బిట్ కాయిన్ విలువ ఈనాడు 40 వేల డాల‌ర్లు దాటింద‌ని ర‌ఘురామ్ రాజ‌న్ గుర్తు చేశారు. బిట్ కాయిన్ ఒక క్లాసిక్ బబుల్ అని, దీనికి నిజ‌మైన విలువ లేద‌న్నారు. ఇది ఒక ఆస్తిగా ప‌రిగ‌ణించినా చెల్లింపులు జ‌రుప‌డం క‌ష్ట సాధ్యం అని చెప్పారు. 40 వేల డాల‌ర్లు దాటిన బిట్ కాయిన్ కొనుగోలు చేయ‌డానికి ఇప్ప‌టికీ ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తి చూపుతున్నార‌ని, కానీ అది బుడ‌గ‌వంటిద‌ని గుర్తు చేశారు. శ‌ర‌వేగంగా స్టాక్‌మార్కెట్లు దూసుకెళ్ల‌డంపైనా ర‌ఘురామ్ రాజ‌న్ స్పందించారు. స్టాక్ మార్కెట్లు కీల‌క‌మైన 50 వేల మార్కును దాటి పోవ‌చ్చున‌ని చెప్పారు. దీనికి ఐటీ దిగ్గ‌జ సంస్థ ఇన్ఫోసిస్‌, విప్రో ఆర్థిక ఫ‌లితాలే కార‌ణం అని తెలిపారు. స్టాక్ మార్కెట్ల మాయ‌లో ప‌డొద్ద‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ‌ కొన్ని పెద్ద కంపెనీలు మాత్ర‌మే లాభ ప‌డ్డాయని, కానీ చిన్న ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయ‌ని, అసంఘ‌టిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయార‌ని ప్ర‌భుత్వానికి గుర్తు చేశారు. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల వారు మాత్ర‌మే కార్లు కొనుగోలు చేస్తార‌ని ర‌ఘురామ్ రాజ‌న్ చెప్పారు. దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద‌లు టూ వీల‌ర్స్ కొంటార‌ని, సంప‌న్నులు మాత్ర‌మే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెడతార‌న్నారు.