విజయం! బీసీసీఐకి ఘన విజయం! దాయాది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి పంజా విసిరింది. బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాలన్న పీసీబీ ఫిర్యాదును ఐసీసీ తోసిపుచ్చింది. అవగాహనా ఒప్పందం ప్రకారం తమతో 2015-2023 వరకు ఆరు ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోవడంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని పీసీబీ చాలా కాలంగా ఆరోపించింది. ఆర్థికంగా నష్టపోయిన తమకు రూ.447 కోట్లు బీసీసీఐ పరిహారం చెల్లించాలని ఐసీసీలో ఫిర్యాదు చేసింది. ఏదేమైనప్పటికీ తాము పరిహారం చెల్లించబోమని భారత్ ఎన్నోసార్లు తేల్చిచెప్పింది. మంకుపట్టు వీడని పాక్ ఐసీసీని సంప్రదించింది. అందుకు భారీ మొత్తమే ఖర్చుచేసింది. పాక్ ఫిర్యాదు మేరకు ఐసీసీ ముగ్గురు సభ్యులతో వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేసింది. అక్టోబర్ 1 నుంచి 3 వరకు విచారణ చేపట్టింది. మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సహా బీసీసీఐ మాజీలు, తాజా అధికారులను విచారించింది. ఉగ్రవాదం, భద్రత కారణాల వల్ల ఆడటం లేదని బీసీసీఐ వివరించింది. చివరికి భారత్తో ఏకీభవించిన ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘బీసీసీఐపై పీసీబీ కేసును వివాద పరిష్కార కమిటీ తోసిపుచ్చింది’ అని ఐసీసీ ట్విటర్లో పేర్కొంది.