ScienceAndTech

బెంగుళూరుదే ప్రథమ స్థానం

బెంగుళూరుదే ప్రథమ స్థానం

టెక్నాలజీ అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్‌ నగరంగా భారత టెక్నాలజీ రాజధాని బెంగళూరు అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో లండన్‌, మ్యూనిక్‌, బెర్లిన్‌, పారిస్‌ ఉన్నాయి. ఆ తర్వాత ఆరో స్థానంలో భారత్‌ ఆర్థిక రాజధాని ముంబయి నిలిచింది. లండన్‌& పార్టనర్స్‌ అనే అంతర్జాతీయ వాణిజ్య, పెట్టుబడుల సంస్థ డీల్‌రూం.కాం డాటాను విశ్లేషించింది. ఈ వివరాల ప్రకారం 2016 నుంచి 2020 వరకూ బెంగళూరులో పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగిందన్నారు. ముంబయిలో పెట్టుబడులు 1.7 రెట్లు పెరిగాయని తెలిపారు. లండన్‌లో పెట్టుబడులు 3రెట్లు పెరిగినట్లు తెలిపారు. ‘‘బెంగళూరు, లండన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి రెండు టెక్‌ హబ్‌లుగా నిలిచాయి. టెక్ ఇన్వెస్లర్లకు ఈ రెండు ప్రాంతాల్లో వ్యాపారం చేసేందుకు అనువైన అవకాశాలున్నాయి.’’ అని లండన్ & పార్ట్‌నర్స్ భారత ప్రతినిధి హెమిన్ భారుచా అన్నారు. లండన్‌కు భారత్‌తో బలమైన వాణిజ్య సంబంధాలున్నాయన్నారు. నివేదికలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా గొప్ప టెక్నాలజీలను సృష్టించడం ఈ రెండు నగరాలకే చెందిందన్నారు. లండన్‌లో ఇకపై భారత్‌కు చెందిన పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారని ఆకాంక్షిస్తున్నాం అని అన్నారు. ప్రపంచ టెక్ వెంచర్‌ కాపిటలిస్ట్‌ పెట్టుబడుల్లో బెంగళూరు ఆరోస్థానాన్ని పొందింది. దీనిలో బీజింగ్‌ మొదటి స్థానంలో నిలవగా శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌, షాంఘై, లండన్‌ తరువాతి స్థానాల్లో నిలిచాయి. కరోనా సంక్షోభంతో రిమోట్‌ వర్కింగ్‌ పెరగడంతో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ వెంచర్‌ కాపిటలిస్టులకు మొదటి ప్రాధాన్యంగా మారింది.