Politics

మోడీ కన్నీటి కథలు-తాజావార్తలు

మోడీ కన్నీటి కథలు-తాజావార్తలు

* ‘కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతో మంది తల్లుల కడుపుకోతకు కారణమైంది’ అని టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ప్రక్రియను మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా పోరులో గతేడాది ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

* రాష్ట్రంలో తొలి రోజు చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. టీకా తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్‌ సురక్షితమేనని రుజువు చేశారని పేర్కొన్నారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో 3,530 మందికి టీకా అందించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ కోసం రెండు నెలలుగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఎంతో శ్రమించారని అన్నారు. కరోనాపై పోరాటంలో సీఎం కేసీఆర్‌ ముందుండి నడిపించారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వానికి డా.శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

* ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల శోధన ప్రారంభమైంది. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ నేతృత్వంలోని నిపుణుల బృందం వుహాన్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే, కరోనా వైరస్‌ సోకిన తొలి వ్యక్తి ‘పేషెంట్‌ జీరో’ను కనుక్కోవడం అసాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. పేషెంట్‌ జీరోను ప్రపంచం ఎన్నటికీ కనుక్కోకపోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ వ్యాధుల విభాగం సాంకేతికాధిపతి మారయా వ్యాన్‌ కోర్కోవ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ మూలాలను శోధించడం కోసం పది మందితో కూడిన నిపుణుల బృందం వుహాన్‌లో అడుగుపెట్టిన సమయంలోనే డబ్ల్యూహెచ్‌ఓ ఈ విధంగా స్పందించడం గమనార్హం. అయితే, సుదీర్ఘ కాలం తర్వాత అక్కడికి చేరుకోవడంపైనా అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తునకు చైనా తొలినుంచి అడ్డుపడుతున్న విషయం తెలిసిందే.

* ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలపై 150 దాడులు జరిగేవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆలయాలపై జరిగిన దాడులతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని.. ఉన్మాదులు, మతిస్థిమితం లేనివారే దాడులకు పాల్పడ్డారని భోగి రోజు డీజీపీ అన్నారని పేర్కొన్నారు. కనుమ రోజు మాట మార్చిన డీజీపీ.. ఆలయాలపై దాడులను ప్రతిపక్షాలకు అంటగడుతున్నారంటూ మండిపడ్డారు. దాడులు చేసిన వైకాపా వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిపై ఉన్న భక్తితో దాడులను బయటపెట్టిన వాళ్లపై కేసులు పెడతారా?విధ్వంసాలు చేసిన వైకాపా వాళ్లపై కేసులు లేవా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్క్రిప్ట్‌, సీఎం జగన్‌ డైరెక్షన్‌లో డీజీపీ బాగా నటిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైకాపా దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు తిరుపతి ఉపఎన్నిక అవకాశం లాంటిదన్నారు. వైకాపా ఓటమి ద్వారా చరిత్రాత్మక తీర్పునకు తిరుపతి వేదిక కావాలని.. దేశానికే ఒక సందేశాన్ని తిరుపతి ప్రజలు పంపాలని చంద్రబాబు కోరారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో తొలి నుంచి చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలక వర్గం తాజాగా మరోసారి తీవ్ర స్థాయి ఆరోపణలు చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. చైనాను అనుమానించడానికి తమ వద్ద కారణాలు ఉన్నాయని తెలిపారు. 2019 సెప్టెంబరులోనే వుహాన్‌లోని వైరాలజీ ప్రయోగశాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు కరోనా లక్షణాలు బయటపడ్డాయని ఆరోపించారు. చైనాలో అధికారికంగా తొలి కేసును నిర్ధారించడానికి ముందే ఇది జరిగిందని పేర్కొన్నారు. మహమ్మారి మూలాలపై పరిశోధనలు జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు బృందం వుహాన్‌లో పర్యటిస్తున్న సందర్భంలో పాంపియో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

* సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చందు జైన్‌ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. శుక్రవారం తెల్లవారుజామున జ్యూవెల్లరీ దుకాణం వెంటిలేటర్‌ ను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు షాపులో ఉన్న 1219 గ్రాముల బంగారం, 302 గ్రాములు వెండి ఎత్తుకెళ్లారు.

* భారత్‌ – చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వేళ సైన్యం వీరోచిత ప్రదర్శనతో దేశంలో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అలాగే, దురాక్రమణకు యత్నించిన చైనాను గట్టిగా తిప్పికొట్టిన మన సైనికులు ప్రజలను తలెత్తుకొనేలా చేశారంటూ కొనియాడారు. శనివారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కొత్త కమాండ్‌ ఆస్పత్రికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటోందన్నారు. ఈ మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పుడు హోలీ, ఈద్‌, దీపావళి వంటి పర్వదినాలను సరదాగా జరుపుకోలేమని ఎవరూ ఊహించలేదని చెప్పారు. రైళ్లు నిలిచిపోతాయని, పాఠశాలలు, మార్కెట్లు మూతబడతాయని కూడా ఎవరూ అనుకోలేదన్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనాపై పోరాటానికి ధైర్యంగా ముదుకు సాగామన్నారు. కరోనా వైరస్ ఓ పెను సవాల్‌గా మారి పరీక్షించిందని తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన కర్నూలు విమానాశ్రయంలో విమాన రాకపోకలకు డైరెర్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతి లభించింది. ఈ మేరకు మార్చి నుంచి విమానాల రాకపోకలు, కార్యకలాపాలకు ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ జారీ చేసినట్లు కర్నూలు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది మార్చిలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేసి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పనులు పూర్తయిన అనంతరం ఇటీవల దిల్లీ నుంచి డీజీసీఏ అధికారుల బృందం విమానాశ్రయంలోని మౌలిక వసతులు, ఇతరత్రా అంశాలను పరిశీలించి వెళ్లారు. విమానాశ్రయంలో అన్నిరకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో డీజీసీఏ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవడంలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం సహా విపక్ష పార్టీలు విఫలమయ్యాయని వంచిత్‌ బహుజన్‌ అఘాడీ (వీబీఏ) నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ విమర్శించారు. ఈ పార్టీలకు పక్షవాతం వచ్చిందా? అని ప్రశ్నించారు. ఈ పోరాటంలో రాహుల్‌ గాంధీ కనబడుతున్నా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎక్కడా కానరావడంలేదని వ్యాఖ్యానించారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 27న మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తొలుత కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకొని ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. వారు వ్యాక్సిన్‌ షాట్‌ తీసుకుంటే తాను కూడా వేయించుకొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

* ఆవిష్కరణల రంగంలో మహిళలకు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్‌లకు నూతన ఆవిష్కరణల అంశంలో చేయూతనివ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణలోని వి-హబ్, గుజరాత్‌లోని ఐ-హబ్‌లు ఇరు రాష్ట్రాలకు చెందిన 240 స్టార్టప్‌లను ఎంపిక చేసి, అన్నిరకాలుగా సాయం అందించాల్సి ఉంటుంది. తద్వారా ఆయా స్టార్టప్‌లు మరింత మూలధనాన్ని అందిపుచ్చుకోవటమే కాకుండా అవసరమమైన మెంటర్‌షిప్ వీరికి లభించనుంది.

* తెలంగాణలో గత ఏడాది డిసెంబరులో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్ల నుంచి గెలుపొందిన వారి పేర్లను గెజిట్‌లో పొందుపరిచారు. ఇవాళ్టి తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి గెజిట్‌ను జారీ చేశారు. 150 డివిజన్ల నుంచి ఎన్నికైన అభ్యర్థులు, పార్టీ, రిజర్వేషన్లు తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే నెల 11వ తేదీ వరకు ఉంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం కొత్త పాలకమండలి మొదటి సమావేశ తేదీని ప్రకటిస్తూ విడిగా మరో నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది.

* రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంఎంటీఎస్‌ విస్తరణ పనులకు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

* అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా తన మూడు నెలల వేతనాన్ని (రూ.3.9లక్షలు) విరాళంగా ఇచ్చినట్టు ట్విటర్‌లో వెల్లడించారు. ఈరోజు భక్తులతో కలిసి రూ.1,11,111లు అందజేసినట్టు తెలిపారు. శతాబ్దాల కాలం నాటి ఈ స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ ఎంతోకొంత మొత్తాన్ని ఇచ్చి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అది రూ.100లు అయినా రూ.లక్ష అయినా.. ఎవరి శక్తిమేరకు వారు విరాళంగా ఇవ్వాలని కోరారు.

* తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రులిద్దిరికీ షెకావత్‌ లేఖ రాశారు. గత ఏడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా డీపీఆర్‌లు అందివ్వాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ స్పందిస్తూ డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా కోరింది.

* కరోనా వైరస్‌ విజృంభణతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే, ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన కొన్నిదేశాలు మాత్రం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటైన భారత్‌, కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోట్ల మందికి టీకా అందించేందుకు సన్నద్ధమైన భారత్‌, ఇందుకోసం ముందుగానే చేసిన ఏర్పాట్లు, ప్రణాళికలు ప్రపంచ దేశాలకు కొన్ని పాఠాలు నేర్పిస్తుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.