హెరాయిన్ వంటి మత్తుమందులకు బానిస అయిన వారికి విరుగుడుగా వినియోగించే సుబోగ్జోన్ జనరిక్ ఔషధాన్ని అమెరికా విపణిలో విడుదల చేసేందుకు డాక్టర్ రెడ్డీస్‌కు మార్గం సుగమమైంది. పేటెంట్ ఉల్లంఘించిందంటూ డాక్టర్ రెడ్డీస్‌పై ఇండీవర్ వేసిన పిటిషన్‌ను అప్పీల్స్ కోర్టు తిరస్కరించడమే ఇందుకు కారణం. ఈ ఔషధానికి కోర్టు ఆమోదం రానందునే, గత జులై-సెప్టెంబరులో ఆశించిన విధంగా అమెరికాలో జనరిక్ ఔషధ అమ్మకాలు అధికంగా నమోదు చేయలేకపోయినట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఔషధానికి గత జూన్‌లోనే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి వచ్చింది. కానీ అమ్మకాలు జరపకుండా ట్రయల్ కోర్టు అడ్డుపడటంతో, మార్కెట్లో విడుదల చేయటం సాధ్యం కాలేదు. అమ్మకాలను నిరోధిస్తూ, ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ (ఫెడరల్ సర్క్యూట్) మంగళవారం కొట్టివేసి తదుపరి ప్రక్రియల కోసం ఈ కేసును ట్రయల్ కోర్టుకే బదిలీ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఔషధానికి సంబంధించిన పేటెంట్ గడువు 2022లో ముగియనుంది. అయితే ఇండీవర్ మరో ఔషధానికి సంబంధించి వేసిన కేసులో కూడా పేటెంట్ ఉల్లంఘన లేదని తేలిందని, ఇది కూడా అలాంటి కేసేనని కోర్టు పేర్కొంది. సుబోగ్జోన్ ఔషధాన్ని ఈ ఏడాది 9 నెలల్లో ఇండీవర్ 768 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,500 కోట్ల) మేర అమ్మకాలు జరిపింది. గతేడాది 8.75 లక్షల మంది ఈ ఔషధం వినియోగించారు.