కరెంట్ అడిగితే కుక్కలని కాల్చినట్లు కాల్చారు. గుర్తుందా?

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ ప్రచారం వేడెక్కింది. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. బుధవారం సాయంత్రం మంత్రి కేటీఆర్‌ కొడంగల్‌లో భారీ ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఈ రోడ్‌షోకు భారీగా తరలివచ్చిన జనం సమక్షంలో కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఈ ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రేవంత్‌ రెడ్డి రాజకీయాలను వదిలేస్తారా? అని సవాల్‌ విసిరారు. డిసెంబర్‌ 7న రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీవి కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను తిట్టగానే పెద్దవారు కాలేరన్నారు. పొరపాటును ప్రజా కూటమి గెలిస్తే తెలంగాణ ప్రజల జుట్టు చంద్రబాబు చేతిలోకి వెళ్తుందన్నారు. తెరాస గెలిస్తే కేసీఆరే సీఎం అన్న విషయం అందరికీ తెలిసిందేనని, మరి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి ? అని ప్రశ్నించారు. ఆ పార్టీకి జిల్లాకు నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. దిల్లీ గులాంలు, అమరావతి బాద్‌షాలు తెలంగాణ ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. దిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవరే కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందన్నారు. సీల్డ్‌కవర్‌ సీఎం కావాలా? తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ సింహం కేసీఆర్‌ కావాలా? అని ప్రజలను అడిగారు. కొడంగల్‌ ప్రజలు ఏగట్టున ఉంటారో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కరెంట్‌ అడిగితే కాల్చి చంపిన తెదేపా, కాంగ్రెస్‌ గట్టున ఉంటారా? అడగకపోయినా 24గంటల కరెంటు ఇచ్చిన కేసీఆర్‌ వైపు ఉంటారా? రైతులను 60ఏళ్ల పాటు రాబందుల్లా పీక్కుతిన్న ఆ పార్టీలవైపు ఉంటారా? రైతు బంధు కేసీఆర్‌ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని సూచించారు. కొడంగల్‌కు నీళ్లు కావాలో, కన్నీళ్లు కావాలో తేల్చుకోవాలన్నారు. కొడంగల్‌కు కృష్ణా జలాలు రావాలంటే కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంతోనే సాధ్యం తప్ప ఎవ్వరొచ్చినా కాదన్నారు. కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే కృష్ణానది నుంచి సాగునీరు తెచ్చి ఈ ప్రాంత రైతుల కాళ్లు కడిగే బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్‌ అన్నారు. అంతేకాకుండా కొడంగల్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. గజ్వేల్‌, సిరిసిల్ల మాదిరిగా కొడంగల్‌ను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పేదవాడికి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ రూ.5లక్షలతో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com