Business

తాగుబోతులు తగ్గారు

తాగుబోతులు తగ్గారు

గతేడాదితో పోలిస్తే ఈ సారి సంక్రాంతి పండక్కి మద్యం వినియోగం బాగా తగ్గింది. గతంలో అన్ని పండగల కంటే సంక్రాంతికి మద్యం వినియోగం ఎక్కువగా ఉండేది. ఇందుకు భిన్నంగా ఈ సారి మద్యం వినియోగం తక్కువగా నమోదు కావడం గమనార్హం. దీన్నిబట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానం సత్ఫలితాలనిస్తోందని చెప్పొచ్చు. గతేడాది సంక్రాంతి పండగ మూడు రోజుల్లో కలిపి 4,38,729 మద్యం, బీరు కేసులు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది జనవరి 13, 14, 15 తేదీల్లో 4,02,203 మద్యం, బీరు కేసులే అమ్ముడయ్యాయి. అంటే గతం కంటే ఈ సారి 36,526 మద్యం కేసులు తక్కువగా అమ్ముడయ్యాయన్నమాట. ఇదిలా ఉండగా ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో మొదటి రెండు స్థానాల్లో గతం మాదిరిగానే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో విశాఖ, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలున్నాయి. అతి తక్కువగా అమ్మకాలు జరిగిన జిల్లాలో గతం మాదిరిగానే అనంతపురం ఉంది. ఈ ఏడాది న్యూ ఇయర్‌ పార్టీల్లో కూడా మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. గతేడాది జనవరి ఒకటో తేదీ నుంచి 15 వరకు జరిగిన మద్యం అమ్మకాలను, ఈ ఏడాది జనవరి 15 వరకూ జరిగిన అమ్మకాలతో పోలిస్తే 82,649 మద్యం కేసులు ఈ దఫా తక్కువగా అమ్ముడయ్యాయి. బీరు అమ్మకాల విషయానికొస్తే 90,556 కేసులు గతం కంటే తక్కువగా విక్రయాలు జరిగాయి. గతేడాది (జనవరి 1 నుంచి 15 వరకు) 10,85,530 లిక్కర్‌ కేసులు అమ్ముడవగా, ఈ ఏడాది అదే సమయంలో 10,02,881 లిక్కర్‌ కేసుల విక్రయాలు జరిగాయి. బీరు కేసులు గతేడాది 3,94,450 అమ్ముడు కాగా, ఈ దఫా 3,03,894 కేసులు అమ్ముడయ్యాయి.