భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలోనూ యువ దేశం. మొత్తం జనాభాలో యువకులే అధికశాతం. ఉరకలెత్తే ఉత్సాహంతో అన్ని రంగాల్లో యువత ముందడుగు వేస్తోంది. అయితే, దేశ జనాభా పెరిగిపోతోందన్న ప్రచారం కారణంగానో, అధిక సంతానం ఉంటే చదువు, పోషణ, ఇతర ఖర్చుల బాధ్యతను భరించడం కష్టం అవుతుందన్న ముందుచూపుతోనో ఒకరిద్దరి కంటే ఎక్కువ సంతానానికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. దీనివల్ల 30 ఏళ్ల తరవాత దేశ జనాభాలో యువత వాటా బాగా తగ్గే ప్రమాదం నెలకొంది. పదవీ విరమణ పొందిన, ఉద్యోగ వయసుకు చేరనివారి సంఖ్య ఎక్కువై, పనిచేయగలవారి సంఖ్యను మించిపోతుంది. ఇప్పుడు యువకులుగా ఉన్నవారంతా మధ్యవయసు దాటి వార్ధక్యంలోకి అడుగుపెడతారు. 50-60 సంవత్సరాల మధ్య వయసువాళ్లు వేగంగా, సమర్థంగా పనిచేయడం కష్టమే. రాబోయే మూడు దశాబ్దాల తరవాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అవగతమవుతోంది కాబట్టి, ఇటు పాలకులతో పాటు అటు పౌర సమాజం కూడా 60-80 ఏళ్ల మధ్యవారికి ఎలాంటి వ్యాపకం కల్పించాలి, వాళ్ల అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయాలపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలి. వీరందరి పోషణభారం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం మన దేశంలో జనాభా వృద్ధిరేటు ఏడాదికి 1.1 శాతానికి పడిపోయింది. ఈ దశాబ్దాంతానికి మరో 15 కోట్లమంది దేశ జనాభాకు జతపడే అవకాశముంది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే మనం చాలా వేగంగా ముందుకెళ్తున్నాం. దేశ జనాభాలో 60 ఏళ్లు దాటినవారి వాటా ఏటా పెరుగుతోంది. 2015లో అది కేవలం ఎనిమిది శాతం ఉండగా, 2050 నాటికి 19 శాతానికి చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి విడుదల చేసిన నివేదిక చెబుతోంది.
వైద్య రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు, పరిశోధనలు చోటుచేసుకోవడం, పోషకాహార వినియోగం పెరగడం, వ్యక్తిగత పరిశుభ్రత, సొంత ఆరోగ్య పరిరక్షణ విషయంలో అవగాహన… తదితర కారణాలతో ఆయుర్దాయం విస్తరించింది. ప్రతి వెయ్యి జననాలకు నమోదయ్యే మరణాల సంఖ్య మన దేశంలోనూ కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో కుటుంబాల్లో జననాల రేటు (జీవితకాలంలో ఒక మహిళకు కలిగే సంతానం), జననాల రేటు (ఒక సంవత్సరంలో జనాభా పెరుగుదల) కూడా క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో పాటు, వివిధ వ్యాధుల కారణంగా అయిదేళ్లలోపు పిల్లల మరణాల సంఖ్యా తగ్గింది. మొత్తంగా జనాభాలో వయోవృద్ధుల వాటా పెరుగుతోంది. 1961లో ప్రతి 100 మంది పిల్లలకు వయోవృద్ధుల సంఖ్య 13.7 ఉండగా, 2011 నాటికి అది 28.4కు చేరింది. ఆ సంవత్సరానికి దేశంలో 60 ఏళ్లు దాటినవారు అత్యధికంగా (12.3%) కేరళలో, అత్యల్పంగా (6.5%) అసోమ్‌లో ఉన్నారు.
ఈ పరిణామాలు దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. 2050 నాటికి పని చేయగలిగే వయసులో ఉండేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయి, పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇప్పటికే జపాన్‌లాంటి కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. 1971 నాటికి మన దేశంలో 15 ఏళ్లలోపు పిల్లల సంఖ్య బాగా ఎక్కువగా ఉండేది. 2001 నాటికి వారంతా యువకులు, మధ్యవయస్కులుగా ఉండి, పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేశారు. 2011 నాటికి కూడా పనిచేయగలిగే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉండటం- దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. భవిష్యత్తులో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. 2031 నుంచే క్రమంగా పదవీ విరమణ చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అప్పటికి 60 ఏళ్లు దాటినవారి సంఖ్య మొత్తం జనాభాలో గణనీయంగా ఉంటుంది. వృద్ధులకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా పలు రకాల సమస్యలు తలెత్తే ప్రమాదముంది. వారు తమను తాము సంరక్షించుకోలేరు. చాలామందికి ఆర్థిక స్వాతంత్య్రం కూడా ఉండదు. సంతానంపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. ఇలాంటి సమస్యలు ఆందోళనకర పరిస్థితికి చేరకముందే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాలి. ముఖ్యంగా వృద్ధుల్లో పేదలు, ఒంటరి మహిళలు, గ్రామీణులను కచ్చితంగా ఆదుకోవాలి. వారి బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికైతే ప్రభుత్వ రంగంలోని వృద్ధాశ్రమాల నిర్వహణ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్ది పండుటాకుల కోసం మెరుగైన వ్యవస్థను రూపొందించే దిశగా అందరూ కదలాలి!