మిథాలీ…బాధపడకు. నువ్వు నేను ఒక్కటే!

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో మిథాలీ రాజ్‌ను ఆడించకపోవడం తనను ఆశ్చర్యపరచలేదని టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అన్నారు. అలాంటి పరిస్థితినే తానూ అనుభవించానని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌, ఐర్లాండ్‌పై వరుస అర్ధశతకాలు సాధించిన మిథాలీని ఇంగ్లాండ్‌తో కీలకమైన సెమీస్‌లో తప్పించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో హర్మన్‌సేన ఓడిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ‘ఆమెను తుది జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు! టీమిండియాకు సారథ్యం వహించిన తర్వాత నన్నూ డగౌట్‌లో కూర్చోబెట్టారు. మిథాలీని తప్పించిన తర్వాత ఆ తరహా బృందంలోకి ఆమెను స్వాగతించా. సారథులు కూర్చోమంటారు. కాబట్టి మనం కూర్చోవాలంతే. ఫైసలాబాద్‌లో నేనదే చేశా. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నప్పుడు 15 నెలల పాటు వన్డేలు ఆడలేదు. జీవితంలో ఇలాంటివి చోటుచేసుకుంటాయి. ప్రపంచంలోనే అత్యద్భుతంగా ఆడిన వారికి కొన్నిసార్లు తలుపులు మూసేస్తారు’ అని 2006లో పాకిస్థాన్‌తో రెండో టెస్టు సంగతిని దాదా గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు అత్యుత్తమం అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎంతో కృషి చేశావు. మళ్లీ అవకాశం వస్తుంది. అందుకే మిథాలీని రిజర్వు బెంచీపై కూర్చోబెట్టినప్పుడు ఆశ్చర్యం కలగలేదు. మైదానంలో స్పందన చూసీ ఆశ్చర్యం అనిపించలేదు. సెమీస్‌లో టీమిండియా ఓడినందుకు బాధ కలిగింది. ప్రపంచకప్‌ సాధిస్తారనుకున్నా. అందరూ అన్నట్టు జీవితంలో దేనికీ గ్యారెంటీ లేదు’ అని మిథాలీరాజ్‌కు గంగూలీ సలహా ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com