NRI-NRT

డల్లాస్‌లో సిలికనాంధ్ర మనబడి స్నాతకోత్సవం

Silicon Andhra Graduation Across America-TNILIVE america telugu news

అమెరికాలో సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మనబడి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో 99 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌, డాలస్‌ నగరాల్లో 50కిపైగా కేంద్రాల్లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.వి. సత్యనారాయణ విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మాతృ దేశానికి దూరంగా ఉన్నప్పటికీ భవిష్యత్‌ తరానికి మాతృభాషపై మమకారాన్ని పెంచి వారు తెలుగు నేర్చుకొనేందుకు తల్లిదండ్రులు, గురువులు చేస్తున్న కృషిని ఆచార్య ఎస్‌.వి. సత్యనారాయణ కొనియాడారు. గత 12 ఏళ్లలో దాదాపుగా 45 వేలకు పైగా విద్యార్థులు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని.. అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాల్లో మనబడి తరగతులు నిర్వహిస్తున్నామని మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి వెల్లడించారు. 2019-2020 విద్యాసంవత్సరానికిగాను మనబడిలో నమోదు ప్రక్రియ మొదలైందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సిలికానాంధ్ర వారు నిర్వహిస్తున్న ‘సంపద’ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక, శాస్త్రీయ, హిందుస్థానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, వేణువు, వయోలిన్, వీణ, మృదంగం, తబలా కోర్సులను అందిస్తోంది. దీనిలో జూనియర్, సీనియర్ సర్టిఫికెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 333 మంది విద్యార్ధులకు మనబడి కార్యక్రమంలో భాగంగా ధ్రువీకరణ పత్రాలను అందించారు. తెలుగు విశ్వవిద్యాలయం పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య రెడ్డి శ్యామల, జర్నలిజం పీఠాధిపతి డా. కడియాల సుధీర్ కుమార్, తెలుగు విశ్వవిద్యాలయ అధికారులు డా. గాబ్రియెల్, డా. చంద్రశేఖర్ రెడ్డి ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర ‘సంపద’ కోసం రూపకల్పన చేసిన నూతన లోగో, మనబడి బాలరంజని మొబైల్ యాప్‌, ప్రముఖ రచయిత అనంత్ శ్రీరాం రచించిన మనబడి గీతాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్‌.వి.సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుకొమ్మల్లాంటి భారతీయ కళలను రేపటి తరానికి అందించే దిశగా సిలికానాంధ్ర చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. సంపద కోర్సును మొదలుపెట్టిన మొదటి ఏడాదే దాదాపుగా 1400లకుపైగా విద్యార్థులు, 150 మందికి పైగా సంగీత నృత్య గురువులు నమోదు చేసుకోవడం గర్వించదగ్గ విషయమని సిలికానాంధ్ర ‘సంపద’ అధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళలు ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శప్రాయమైనవి కాబట్టే మనబడి ద్వారా తెలుగు భాషని, సిలికానాంధ్ర సంపద ద్వారా భారతీయ కళలని ప్రవాస బాలలకు అందిస్తున్నామని మనబడి స్నాతకోత్సవ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని, ఫణి మాధవ్ కస్తూరి, శాంతి కొండ, ఉష మాడభూషి, స్నేహ వేదుల, జయంతి కోట్ని, మనబడి కార్యనిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు.