సైనా శుభలేఖ

ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. సహ ఆటగాడు, బ్యాడ్మింటన్ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌తో ఆమె వివాహం జరగనుంది. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ వచ్చే నెల 16న వివాహం చేసుకొనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైనానే స్వయంగా వెల్లడించారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఓ పెళ్లిపత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వచ్చే నెల 16న హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరగనుందని తెలిసింది.2005 నుంచి బ్యాడ్మింటన్ కోచ్‌ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకొంటున్న సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని సైనా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కెరీర్‌ కోసం వివాహాన్ని ఇన్నాళ్లూ వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్పలేదని, వాళ్లే దాన్ని పసిగట్టేశారని చెప్పారు ఈ మాజీ నంబర్ వన్‌. ‘వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం, మా తల్లిదండ్రులతో కలిసి అనేక సార్లు ప్రయాణం చేశాం. ఆ సమయంలో నేను ఎవరితో సన్నిహితంగా ఉంటున్నానో వారు అర్థం చేసుకున్నారు’ అని సైనా చెప్పుకొచ్చారు. వివాహం అనంతరం సైనా డిసెంబర్‌ 22నుంచి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌)లో పాల్గొననున్నారు. ఈ లీగ్‌లో ఆమె నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌కు ఆడనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com