WorldWonders

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢభక్తి దాష్టీకం

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢభక్తి దాష్టీకం

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఆదివారం రాత్రి వెలుగు చూసిన ఈ దారుణానికి సంబంధించి పోలీసుల చెప్పిన వివరాలివి.. శివనగర్‌కు చెందిన ఎన్‌.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరంతా గత ఏడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసేవార]ని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు దిలీప్‌కుమార్‌, రమాదేవి సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డీఎస్పీ మాట్లాడుతూ హత్యకు గురైనవారు, హంతకులంతా పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయారని, వారు తమ బిడ్డలు మళ్లీ బతుకుతారని చంపేసినట్లు ప్రాథమికంగా తెలిందన్నారు. యువతుల తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపినట్లు, ఈ సంఘటన జరిగినప్పుడు తండ్రి పురుషోత్తంనాయుడు కూడా అక్కడే ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. తల్లిదండ్రులు కూడా మానసికంగా సతమతమవుతున్నట్లు గుర్తించామని, వారు ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ బాగా చదువుకుని విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారని, మంత్రతంత్రాలకు అలవాటు పడి అఘాయిత్యం చేశారని ఆయన పేర్కొన్నారు.