Health

పిల్లల కంటిచూపుపై శానిటైజర్ల దుష్ప్రభావం

పిల్లల కంటిచూపుపై శానిటైజర్ల దుష్ప్రభావం

కరోనా వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు నీరు, సబ్బు అందుబాటులో లేని సమయాల్లో శానిటైజర్‌ను వాడటం ప్రపంచ వ్యాప్తంగా అనివార్యమయ్యింది. ప్రజా రవాణా, షాపింగ్ మాళ్లు, పాఠశాలలు, ఇతర ప్రదేశాల్లో శానిటైజర్ల స్టాండుల ఏర్పాటు తప్పనిసరి చేశారు. ఇలాంటి సమయంలో పలు సందర్భాల్లో ఈ శానిటైజర్లు చిన్నారుల కళ్లకు ప్రమాదకరంగా మారుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో చిన్నారుల చూపుపై ప్రభావం పడిన ఘటనలు వెలుగులోకి రావడం మరోసారి అప్రమత్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హ్యాండ్‌ శానిటైజర్ల వాడకం తప్పనిసరైన నేపథ్యంలో వాటి పర్యవసానాలపై పరిశోధకులు దృష్టి సారించారు. ఫ్రెంచ్‌ పాయిజన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నివేదిక ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే చిన్నారుల కళ్లు రసాయనాల ప్రభావానికి గురైన కేసుల సంఖ్య దాదాపు ఏడు రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. ఈ కేసులన్నీ కూడా కేవలం 4ఏళ్ల లోపు చిన్నారులే కావడం ఆందోళన కలిగించే విషయం. వీటికి కారణాలను విశ్లేషించగా, ఎక్కువ ప్రాంతాల్లో శానిటైజర్‌లను మీటరు ఎత్తులో ఏర్పాటు చేయడమేనని.. ముఖ్యంగా అవి చిన్నారుల కళ్లకు సమాన ఎత్తులో ఉండడమేనని గుర్తించారు. శానిటైజర్‌ వినియోగించే సమయంలో శానిటైజర్‌ తుంపర్లు నేరుగా చిన్నారుల కళ్లలోనే పడటం వల్లే కంటి ప్రమాదాలకు కారణమవుతున్నట్లు కనుగొన్నారు. ఇక పారిస్‌లో గడిచిన ఐదు నెలల కాలంలో చిన్నారుల కంటి ఆసుపత్రుల్లో శానిటైజర్ సంబంధిత కేసులు పెరిగినట్లు తేలింది. భారత్‌లోనూ ఇదే రకమైన రెండు కేసులు బయటపడినట్లు జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(జామా) నివేదిక ఈ మధ్యే వెల్లడించింది. అయితే ఈ కేసుల్లో చిన్నారులకు సకాలంలో వైద్యం అందించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ఇలా శానిటైజర్‌ స్ప్రే వాడకం పెరిగిన నేపథ్యంలో చిన్నారులపై వాటి ప్రభావం ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు మరోసారి గుర్తుచేస్తున్నారు. ఎక్కువ శానిటైజర్లలో అధిక మోతాదులో ఉండే ఇథనాల్‌ కంటిలోని కార్నియాను దెబ్బతీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే శానిటైజర్లు ఏర్పాటు చేసిన ప్రదేశంలో వాటివల్ల చిన్నారుల కళ్లకు కలిగే ప్రమాదాలపై సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని.. ఒకవేళ అటువంటి ప్రమాదం జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వీటితో పాటు తప్పని పరిస్థితుల్లో శానిటైజర్లు వాడాల్సి వస్తే.. వారికి కొన్ని సిఫార్సులు చేస్తున్నారు.

* చిన్నారులు శానిటైజర్‌కు బదులు సబ్బు, నీటితో చేతులు శుభ్రం చేసుకునేలా ప్రోత్సహించాలి.

* ఒకవేళ శానిటైజర్‌ వాడితే..ఎలా వాడాలనే విషయంపై వారికి ముందుగానే అవగాహన కల్పించాలి.

* షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రదేశాల్లో చిన్నారుల కోసం తక్కువ ఎత్తులో ఉండే విధంగా ప్రత్యేక శానిటైజర్‌ స్టాండులను ఏర్పాటు చేయాలి.

* వాటివల్ల కలిగే ప్రమాదాలపై శానిటైజర్‌ స్టాండుల దగ్గరే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.