Politics

అతనికి బెయిల్ ఇవ్వొద్దు-నేరవార్తలు

అతనికి బెయిల్ ఇవ్వొద్దు-నేరవార్తలు

* బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు సికింద్రాబాద్‌ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. పరారీలో ఉన్న విఖ్యాత్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్‌లో పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ముగ్గురు సోదరులను అపహరించిన కేసులో విఖ్యాత్‌ రెడ్డి బాధితులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారని పిటిషన్‌లో తెలిపారు.

* తిరుపతి TMR జంక్షన్ వద్ద గరుడ వారధి నిర్మిస్తున్న సందర్భంలో సాంకేతిక లోపం వలన ఒక స్లాబ్ దాదాపు 40 మీటర్ల పొడవు ప్రక్కకు ఒరిగి కింద పడిపోవడం జరిగింది. సంఘటనా స్థలాన్ని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి పరిశీలించారు.

* చిత్తూరు జిల్లాలో ఇద్దరు కూతుళ్లను మంత్రాల పేరుతో ఆదివారం రాత్రి తల్లి హత్య చేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట హత్యల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో ఒకరైన సాయిదివ్య(22) మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది. ‘శివ ఈజ్‌ కమ్‌.. వర్క్‌ ఈజ్‌ డన్‌’ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి తరచూ ఘటన జరిగిన ఇంట్లో పూజలు చేసేవారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

* ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన ఘటన నల్గొండ లో చోటుచేసుకుంది. స్థానిక ఎం.ఎ బేగ్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఇద్దరు వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టిచంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను బిహార్‌ వాసులుగా అనుమానిస్తున్నారు.

* ప్రకాశం జిల్లా పర్చూరులోని స్టేట్‌బ్యాంక్‌ ఆవరణలో ఉన్న ఏటీఎంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని మేనేజర్ తెలిపారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నించినా లాభం లేకపోయింది.

* జిల్లాలో ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ భారీ మోసానికి పాల్పడ్డాడు. యువకులను దుబాయి, బహ్రెయిన్‌, అఫ్గానిస్థాన్‌ దేశాలకు పంపిస్తానని భారీగా డబ్బులు వసూలు చేసి చివరకు చేతులెత్తేశాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలకు చెందిన సుమారు 40 మంది యువకులను ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ విదేశాలకు పంపిస్తానని నమ్మబలికాడు.