భారత మహిళల క్రికెట్‌శాశ్వత ప్రతినిధి నీవు


ఆటపై అంకితభావం. అద్భుతమనిపించే రికార్డులు. ఔరా అనిపించే టెక్నిక్‌. ప్రశాంతతకు మారుపేరు. చిరునవ్వుల సింధూరం. పురుషుల ఆధిపత్యముండే భారత క్రికెట్‌లో ఆమె మకుటం లేని మహారాణి. అవును! ఆమె మహిళల క్రికెట్‌లో రారాణి. 1990ల్లో ఎవరికి తెలుసు మహిళలకు క్రికెట్‌ జట్టుందని? వారూ ఆడతారని? ప్రచార ఆర్భాటాలు లేవు. పబ్లిసిటీ లేదు. అభిమానులు లేరు. ప్రత్యక్ష ప్రసారాలు లేవు. ఎలాంటి కాలమది. వెలుగులోకి రాని ఎంతో మంది మహిళా క్రికెటర్లు ఎవ్వరికీ తెలియకుండానే చీకట్లోకి వెళ్లిపోయారు. కాస్త కాలం మారింది. ఒకరి పేరు మాత్రం అడపా దడపా పత్రికల్లో వస్తుండేది. ఆమె పేరు కనిపించగానే భారత మహిళల జట్టు ఆడుతోందని అభిమానులకు తెలిసేది. అర్ధశతకమో, శతకమో ఆమె చేసిందన్న వార్తలోస్తే అబ్బో! వీళ్లూ బానే ఆడుతున్నారులే అనుకునేవారు. అంటే.. ఆమే భారత మహిళల క్రికెట్‌కు గుర్తింపు. అస్థిత్వం. రాయబారి. పరిచయ కర్త. ఉనికి. ఇంకా చెప్పాలంటే టీమిండియా మహిళల జట్టే తనది! ఆ బృందం నాయకురాలే మిథాలీరాజ్‌. పదేళ్లకే బ్యాటు పట్టి 17 ఏళ్లకే శతకం అందుకుంది. 10 టెస్టులు, 85 టీ20లు, 197 వన్డేలు, 6,000 పరుగులు. సచిన్‌కు దీటుగా 20 ఏళ్లుగా మహిళల క్రికెట్‌కు అంకితమైంది మిథాలీ. రెండు సార్లు ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చింది. ఒక్కో తురుపు ముక్కను వెతికింది. స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. వివక్షతో కూడిన ప్రశ్నలకు చెంప చెళ్లుమనిపించే జవాబులు చెప్పింది. ఓ డయానా ఎడుల్జీ, ఓ రమేశ్‌ పొవార్, ఓ హర్మన్‌ ప్రీత్ వంటి వారు ఆమె సేవలు మర్చిపోవచ్చు. భారత క్రికెట్ అభిమానులకు మాత్రం అవెప్పుడూ చిరస్మరణీయమే. ఆమె ప్రస్థానంలో కొన్ని మైలురాళ్లు ఇవి. కేవలం 14 ఏళ్లకే జాతీయ జట్టుకు ఎంపికైంది మిథాలీ. 1997లో ప్రపంచకప్‌కు ఎంపికైంది గానీ తుదిజట్టులో తీసుకోలేదు. 1999లో ఐర్లాండ్‌పై వన్డేలో అరంగేట్రం చేసి శతకం(114నాటౌట్‌)తో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 161 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. ఇప్పటి వరకు 197 వన్డేలాడిన మిథాలీ మొత్తం 6,550 పరుగులుతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌వుమెన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ఖాతాలో ఏడు శతకాలు, 51 అర్థశతకాలు ఉన్నాయి. 2003లో వన్డే జట్టు పగ్గాలు చేపట్టింది. 2005లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చింది. టోర్నీలో మొత్తం 8 మ్యాచ్‌లాడిన ఆమె మొత్తం 199 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌వుమెన్‌ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాది ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్‌లోనూ మిథాలీ అద్భుతంగా రాణించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శతకంతో చెలరేగి జట్టును విజయపథంలో నడిపించింది. ఈ టోర్నీలోనూ భారత్‌ ఫైనల్‌కు వెళ్లింది. తుదిపోరులో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి తప్పలేదు. టోర్నీలో 9 ఇన్నింగ్సుల్లో 409 పరుగులు చేసింది.

అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ఆమె నాయకత్వం అందరి మన్ననలు అందుకుంది. వన్డే నాయకురాలిగా మిథాలీ విజయవంతమైంది. ఆమె నేతృత్వంలో టీమిండియా 120 మ్యాచ్‌లాడగా 73 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పటికీ వన్డే సారథి ఆమే. 2006లో టీ20 బాధ్యతలు చేపట్టిన మిథాలీ నాయకత్వంలో భారత్‌ 32మ్యాచ్‌లాడితే 17 గెలిచింది. 2016లో టీ20 సారథ్యాన్ని హర్మన్‌కు అప్పగించింది. ఇప్పటివరకు 85 టీ20 మ్యాచ్‌లాడిన మిథాలీ 2,283 పరుగులు సాధించింది. టీ20ల్లోనూ అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషం. మరోవైపు పురుషుల క్రికెట్‌లోనూ టీ20ల్లో ఈమెను అధిగమించిన బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం విశేషం. ఆడిన 10 టెస్టుల్లో 663 పరుగులు చేసింది. ఆమె ఖాతాలో ద్విశతకం (214) ఉడండటం గమనార్హం. భారత ప్రభుత్వం 2003లో అర్జున, 2015లో పద్మశ్రీ ప్రదానం చేసింది. 2017లో బీబీసీ ప్రకటించిన వంద మంది ప్రతిభావంత మహిళల జాబితాలోనూ ఆమె స్థానం దక్కించుకుంది. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న కోరికతో మిథాలీ కరీబియన్‌ దీవుల్లో అడుగుపెట్టింది. ఓ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో ఆడింది. పాక్‌, ఐర్లాండ్‌పై ఓపెనర్‌గా అర్ధశతకాలు బాదేసింది. గాయంతో ఆసీస్‌ మ్యాచ్‌కు దూరంగా పెట్టారనుకుంది. సెమీస్‌కు ఎంపిక చేయకపోవడంతో అంతకు ముందు ఘటనలను గుర్తుచేసుకుంది. తీరా చూస్తే పిక్చర్‌ కళ్ల ముందు కనిపించింది. తన సొంత జట్టుకు తనను దూరం చేశారన్న బాధతో కుమిలిపోయింది. కుంగిపోయింది. నీ సేవలకు విలువ లేదా అని అంతరాత్మ వేసిన ప్రశ్నకు సమాధానం దొరక్క.. నిద్ర లేక.. గుండెల్లో ఉప్పొంగుతున్న బాధను దిగమింగలేక కన్నీరు కార్చింది. ఈ 20 ఏళ్లలో కుటుంబంతో కన్నా జట్టుతోనే ఎక్కువ గడిపి ఉంటుంది. అవమానాలను ఎదుర్కొంటున్నప్పుడు ఆమె పడ్డ వేధనను వర్ణించడం ఎవరికి సాధ్యం. ఆమెకు తప్ప!!! అయినా ఓ మిథాలీ..! భారత మహిళల క్రికెట్‌ అంటే గుర్తొచ్చేది నీ పేరే కదా!!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com