* చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న బంగారు గనిలో పేలుడు సంభవించిన రెండు వారాలకు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. జనవరి 10వ తేదీన బంగారు గనిలో ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది. దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మట్టి కూరుకుపోవడంతో మరింత కష్టమైంది. వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు.
* ఏకంగా పదహారు మంది మహిళలను దారుణంగా కడతేర్చిన కరుడుగట్టిన హంతకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, రాచకొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుడు మైన రాములును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. నిందితుడు రాములు 16 మందిని దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయిందని సీపీ తెలిపారు. ఈ 16 హత్యల్లో చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతానికి తెలియలేదన్నారు. నిందితుడు రాములుపై మెదక్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. సీపీ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘నిందితుడు మైన రాములు దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు హైదరాబాద్‌లోని బొరబండలో నివాసముంటున్నాడు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా కందిలో ఉండేవాడు. గతంలో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో 21 సార్లు రాములు అరెస్టయ్యాడు. అందులో పదహారు హత్య కేసులు కాగా.. నాలుగు చోరీ కేసులు, ఓసారి పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నందుకు కేసు నమోదైంది. వీటిలో ఒక కేసులో రాములుకు జీవిత ఖైదు విధించారు. అనంతరం పెరోల్‌పై బయటకి వచ్చాడు. నిందితుడు మైన రాములు తాజాగా రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అందులో ఒకటి ములుగు పీఎస్ పరిధిలో ఉండగా.. మరొకటి ఘట్కేసర్ పరిధిలో నమోదైంది. నిందితుడు రాములు 2003 నుంచి హత్యలు, చోరీలు చేయండం మొదలుపెట్టాడు. అతడి చేతిలో ఇప్పటివరకు హత్యకుగురైన వారందరూ మహిళలే. రాష్ట్రంలోని తూప్రాన్, సంగారెడ్డి, రాయదుర్గం, దుండిగల్, నర్సాపూర్, నార్సింగి, కూకట్పల్లి, బోయిన్పల్లి, చందానగర్, శామీర్‌పేట, పటాన్చెరు పోలీసుస్టేషన్ల పరిధిలో ఆ హత్య కేసులు నమోదయ్యాయి. శామీర్‌పేట, మేడ్చల్, రాయదుర్గం, ఐడీఏ బొల్లారంలో చోరీ కేసులు నమోదయ్యాయి’’ అని సీపీ వివరించారు. నిందితుడిని పట్టుకునేందుకు కృషి చేసిన రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులను సీపీ అంజనీ కుమార్ అభినందించారు.
* కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. పోలీసులు అనుమతించిన రూట్ మ్యాప్‌ను పక్కనపెట్టి రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడం కలకలం రేపింది. ఎర్రకోట బురుజులపైకి ఎక్కిన రైతులు అక్కడే జెండాలతో నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రాత్రి 12గంటల వరకు టెలికాం, ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేస్తున్న్టట్టు వెల్లడించింది. శాంతిభద్రతల దృష్ట్యా సింఘు, టిక్రీ, ఘాజీపూర్, ముఖుర్దాచౌక్, నగ్లోయ్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
* వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ దిల్లీలో రణరంగంగా మారింది. పోలీసులు అడుగడుగునా అడ్డుకొనేందుకు ప్రయత్నించినా రైతులు ఎర్రకోట ఎక్కి నిరసన తెలిపారు. దీంతో ఈ నిరసనలు రైతు నేతల చేయి దాటిపోయాయంటూ వస్తున్న ఆరోపణలపై బీకేయూ నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. తమ ర్యాలీలోకి ఇతరులు చొరపడ్డారన్నారు. పరేడ్‌ను చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు చొరబడ్డారని, తమ ర్యాలీలోకి చొరబడినవారిని గుర్తించినట్టు చెప్పారు.
* ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని ఎస్ఈసీ పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 3.61లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారన్నారు. సాంకేతిక, న్యాయ చిక్కుల వల్ల 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని, నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు.