Business

ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన అమెజాన్-వాణిజ్యం

ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన అమెజాన్-వాణిజ్యం

* ప్రస్తుతం వీడియో కాలింగ్‌ కోసం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌లో గూగుల్ డ్యుయో యాప్ ఒకటి. ఇందులో ఒకేసారి 32 మందితో వీడియో కాల్ చేసి‌ మాట్లాడుకొనే సౌకర్యం ఉంటుంది. తాజాగా గూగుల్ డ్యుయో సేవలు కొన్ని మొబైల్ ఫోన్ లలో నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. గూగుల్ చేత ధృవీకరణ చేయబడని కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్లే సర్వీసెస్‌ కోసం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేస్తుంది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం సర్టిఫైడ్ చేసిన ఫోన్లు సురక్షితమైనవి, గూగుల్ ప్లే స్టోర్లో ఉండే యాప్ లు ఎటువంటి ఆటంకం లేకుండా ఇందులో పని చేస్తాయి.

* ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇంధన, ఐటీ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 531 పాయింట్లను కోల్పోయి 48,348 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమైన 14,238 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు. ఈ మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1444 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 407 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు సిక్కిం సరిహద్దుల్లో భారత్‌– చైనా సైనిక బలగాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నష్టాల మార్కెట్లోనూ మెటల్‌ షేర్లు మెరిశాయి. ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీల ఒకశాతం పతనంతో రూ.2.1 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.192.3 లక్షల కోట్లకు దిగివచ్చింది. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.765 కోట్ల షేర్లన విక్రయించారు.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)కు ఫ్యూచర్‌ గ్రూప్‌ తన రిటైల్‌ ఆస్తుల విక్రయ ప్రక్రియపై అమెరికా ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం– అమెజాన్‌ సోమవారం కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్‌ బియానీసహా ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. స్థిర, చర ఆస్తులుసహా బియానీ కుటుంబ సభ్యుల ఆస్తులన్నింటినీ వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వాటిని జప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. బియానీ, ఆయన కుమార్తె అష్ని, వ్యవస్థాపక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు, అలాగే కంపెనీ సెక్రటరీసహా ముగ్గురు ఇతర అధికారులను ‘‘అదుపు’’లోకి తీసుకోవాలని కోరింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థల డైరెక్టర్లను అరెస్ట్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వమని అభ్యర్థించింది.

* ఏపీలో…కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం మళ్లీ వేగం పుంజుకుంది. లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతుల జారీ ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరోనా మహమ్మారి వ్యాప్తితో రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ దాదాపుగా స్తంభించిపోయింది. ఆ తర్వాత క్రమంగా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో గత ఏడాది ద్వితీయార్థం నుంచి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల రిజిస్ట్రేషన్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా అన్నిరకాల అనుమతులను నిర్ణీత కాలంలో జారీచేస్తుండడం కూడా ఇందుకు దోహదపడుతోంది.

* ఏడాదిన్నర తర్వాత ఆటోమొబైల్‌ పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో తీసుకొనే నిర్ణయాలు ఈ పరిశ్రమ భవిష్యత్తును నిర్దేశించనుంది. వాస్తవానికి గత బడ్జెట్‌లో ఆటోమొబైల్‌ పరిశ్రమకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా దేశీయ తయారీకి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు రాలేదని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే లాక్‌డౌన్‌ రావడంతో కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి. లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమ మెల్లగా కోలుకోవడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌(ఎఫ్‌ఏడీఏ) ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది.

* భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2021లో 7.3 శాతం వృద్ధి నమోదు చేయనుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మహమ్మారి కారణంగా వినియోగం పడిపోయినందున 2020లో జీడీపీ 9.6 శాతం క్షీణించనున్నట్లు తెలిపింది. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా నష్టపోయిందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అవకాశాలపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం తయారు చేసిన నివేదిక ఈ మేరకు స్పష్టం చేసింది.

* ఈ సారి బడ్జెట్‌లో కీలక పురపాలక సంఘాలకు నిధుల కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన శైలి మెరుగుపర్చేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. వచ్చే ఐదేళ్లలో పురపాలక సంఘాలకు రూ.2లక్షల కోట్లను కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ సారి బడ్జెట్‌లో పట్టణ ప్రాంతాలకు నిధులతోపాటు సంస్కరణలు కూడా చేపట్టే అవకాశం ఉంది.