NRI-NRT

బ్రిటన్ రాణి తలుచుకుంటే….

బ్రిటన్ రాణి తలుచుకుంటే….

కాలక్రమంలో రాజ్యాలు పోయినా.. కొన్ని దేశాల్లో ఇంకా రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్రిటన్‌ గురించి. ఇప్పటికీ బ్రిటన్‌ను రాజకుటుంబమే పాలిస్తోంది. ప్రస్తుతం ఎలిజబెత్‌-II బ్రిటన్‌కు మహారాణిగా ఉన్నారు. అయితే, గతంలో రాజ్యాలపై రాజకుటుంబాలకు ఉండే సార్వభౌమాధికారాలు ఇప్పుడు లేవు. మరి ప్రస్తుత బ్రిటన్‌ ప్రభుత్వంలో ఎలిజబెత్‌కు ఉన్న అధికారాలేంటి?ఆ దేశ రాజకీయాల్లో, పాలనలో ఆమెకున్న పాత్ర ఏంటి?
**మండలే పార్లమెంటుగా
బ్రిటన్‌లో రాచరికంతోపాటు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఉంది. ప్రజల గొంతుక వినిపించే, చట్టాలు చేసే పార్లమెంటులో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో దిగువ సభ(హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌), బ్రిటన్‌ రాణి నియమించిన వ్యక్తులు, రాజకుటుంబీకులతో నిండిన ఎగువ సభ(హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌) ఉంటుంది. పార్లమెంటు వ్యవస్థలో మహారాణి కూడా ఒక భాగమే. ఎలిజబెత్‌తో ఆ దేశ ప్రధాన మంత్రి సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుంది. నిజానికి బ్రిటన్‌ రాజ్యంపై రాజులకు ఉండే అధికారాలను 1215లోనే కట్టడి చేశారు. అప్పటి బ్రిటన్‌ రాజు ‘కింగ్‌ జాన్‌’పై కొందరు రాజులు ఒత్తిడి తీసుకొచ్చి ‘మాగ్నా కార్టా’ పత్రంపై సంతకం చేయించారు. దీని ప్రకారం చక్రవర్తి.. ఇతర రాజులు, మేధావులతో కూడిన మండలిని, మతపెద్దలను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ మండలియే ప్రస్తుత పార్లమెంటుగా అవతరించిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ పార్లమెంటుకు అధికారాలు ఎంతమేరకు ఇవ్వాలనేది చక్రవర్తులే నిర్ణయించేవారట. అయితే, ఆ నిర్ణయం.. రాజు/రాణి తీసుకునే నిర్ణయాలకు పార్లమెంటు ఇచ్చే మద్దతు ఆధారంగా ఉండేది.
***కొందరు రాజులు పార్లమెంటును పక్కనపెట్టి ఒంటరిగా రాజ్యాన్ని పరిపాలించాలని విఫలయత్నం చేశారు. జేమ్స్‌-II కూడా పార్లమెంట్‌ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేశాడు. దీంతో పార్లమెంట్‌ సభ్యులు.. ఒకప్పటి ఫ్రాన్స్‌లో ఉన్న ప్రిన్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ రాజ్య చక్రవర్తి విలియమ్‌-IIIతో 1688లో ఇంగ్లాండ్‌పై దాడి చేయించారు. ఆయనతో ఇంగ్లాండ్‌లో పార్లమెంట్‌ వ్యవస్థను తప్పనిసరి చేయిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు. మొదట్లో పార్లమెంట్‌లోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌కే సర్వాధికారాలు ఉండేవి. 18వ శతాబ్దంలో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్వతహాగా పన్నులు విధించే అధికారం దక్కించుకుంది. రానురాను ఈ సభే హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ కన్నా శక్తివంతంగా మారింది. కానీ, దేశానికి అధినేతగా రాజకుటుంబీకులే ఉంటున్నారు.
**ప్రభుత్వాధినేత్రే కానీ..
ప్రస్తుత బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-II అంతర్జాతీయ వేదికలపై ఆ దేశ మొదటి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌కు ప్రధానమంత్రి ఉన్నా రాణినే ప్రభుత్వాధినేత్రిగా ఉంటారు. ఎన్నికల అనంతరం పార్లమెంట్‌లో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఆ పార్టీ తరఫున ఒకరు ప్రధానమంత్రిగా ఎంపికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అప్పటి నుంచి ఆ ప్రధానమంత్రితో దేశ పరిస్థితులు తదితర అంశాలపై తరచూ సమావేశంలో చర్చిస్తుంటారు. అయితే, బహిరంగంగా మాత్రం రాజకీయాలపై రాణి ఎలాంటి చర్చలు జరపరు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు.
*ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పార్లమెంటును ప్రారంభించడం, కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయడం రాణి చేతిలోనే ఉంటుంది. అయితే రద్దు చేసే హక్కును కొన్నాళ్ల కిందట తొలగించారు. పార్లమెంటులో ప్రభుత్వ పాలసీలపై ఆమె ప్రసంగిస్తుంటారు. సభల్లో ఏదైనా బిల్లు ఇరు సభల్లో ఆమోదం పొందినా.. రాణి ఆమోదం తెలపాలి. అప్పుడే బిల్లు చట్టంగా మారుతుంది. హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో సభ్యులను నియమించే అధికారం రాణికి ఉంది. క్వీన్‌ ఎలిజబెత్‌, ఆమె భర్త, కుటుంబసభ్యులు ఆ దేశ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థల్లో కీలక పాత్రలు పోషిస్తారు. రాణి ఎలిజబెత్‌ దాదాపు 600 స్వచ్ఛంద సంస్థలకు పోషకులుగా ఉన్నారు. ఏ దేశంపైనైనా యుద్ధం ప్రకటించే అధికారం రాణికి ఉంది. అయితే, దానికంటే ముందు ప్రధాని, మంత్రులకు ఈ విషయం తెలియజేయడంతో పాటు సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు ఎంపిక చేసిన వారికి నైట్‌హుడ్స్‌, ఇతర అవార్డులు ప్రదానం చేస్తారు. ఒక రకంగా బ్రిటన్‌ రాణిది వివిధ దేశాల్లో ఉండే రాష్ట్రపతి, అధ్యక్షుడి హోదా అన్నమాట.